domestic education sector
-
ఇంటర్నేషనల్ స్కూళ్లపై యమా క్రేజ్
సాక్షి, అమరావతి: గత దశాబ్దన్నర కాలంగా దేశీయ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కాన్వెంట్లు పోయి కార్పొరేట్ స్కూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రెండ్‌లోను మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రముఖ సంస్థ ఐఎస్సీ(ఇంటర్నేషనల్ స్కూల్ కన్సల్టెన్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఏడేళ్ల వ్యవధిలో దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్య రెండింతలవడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉందని, వాటి ట్యూషన్ ఫీజుల టర్నోవర్ ఏకంగా రూ.8,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలనే తాపత్రయంతో ధనిక వర్గాలే కాకుండా ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా తమ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఐఎస్సీ తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో నిలవగా.. మనం రెండో స్థానం దక్కించుకున్నాం. విదేశీ విద్యపై మోజుతోనే.. గత 15 ఏళ్లుగా ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాఠశాల విద్య కూడా ఇంటర్నేషనల్ సిలబస్‌లో ఉంటే మంచిదనే భావన తల్లిదండ్రుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2012 నాటికి దేశంలో ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరించాయి. ఇవి ఎక్కువగా కేంబ్రిడ్జ్ ప్రైమరీ, సెకండరీ, అడ్వాన్స్డ్ ప్రోగ్రాం కోర్సులు అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా విశేష గుర్తింపున్న ‘ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ కోర్సులో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న వారిలో 63.40 శాతం భారతీయులు కాగా మిగిలినవారు విదేశీయుల పిల్లలు. విదేశీ దౌత్యవేత్తలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల పిల్లలు దాదాపు 36 శాతం ఉన్నారు. భారీగానే ఫీజులు మన దేశంలోని ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ. 2.87 లక్షల నుంచి రూ. 7.17 లక్షల వరకు ట్యూషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువేనని ఐఎస్సీ నివేదిక పేర్కొంటుంది. మన దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సగటు వార్షిక ఫీజు రూ. 2.36 లక్షలు కాగా.. చైనాలోరూ. 11.29 లక్షలు, యూఏఈలో రూ. 5.79 లక్షలుగా ఉంది. మున్ముందు దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ప్రాభవం మరింతగా పెరుగుతుందని ఐఎస్సీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఎస్సీ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లకు సంబంధించిన డేటాను సేకరిస్తూ విశ్లేషిస్తోంది. -
లైవ్ క్లాస్‌లతో కాసుల వర్షం
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్లో పాఠ్యాంశాల బోధన బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీంతో లైవ్ తరగతులు నిర్వహించే పలు ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థల ఆదాయం భారీగా పెరుగుతోంది. టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ రూపొందించిన నివేదిక ప్రకారం... ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఫీజులు చెల్లించి నేర్చుకునే పెయిడ్ యూజర్ల సంఖ్య 2021 నాటికల్లా 96 లక్షలకు చేరనుంది. పోటీ పరీక్షలు, టెస్టుల కోసం సిద్ధం చేసే కోర్సులకు అత్యంత ఆదరణ ఉంటోంది. ఈ విభాగాల్లో విపరీతమైన వృద్ధి ఉండటంతో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అన్అకాడెమీ, వేదాంతు, బైజూస్ వంటి ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు పోటీపడుతున్నాయి. విద్యారంగానికి సంబంధించి చైనాలో నెలకొన్న ట్రెండ్ భారత్‌లో కూడా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వీఐపీ కిడ్, యువాన్ ఫుడావో వంటి వందల కోట్ల డాలర్ల స్టార్టప్ సంస్థలు ప్రస్తుతం లైవ్ క్లాసుల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇదే తరహాలో దేశీ సంస్థలు కూడా లైవ్ వీడియో లెర్నింగ్ విధానాలను అమలు చేస్తున్నాయి. టీచర్లకూ ఆదాయం.. దేశీయంగా ఏటా 20 కోట్ల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటారు. పరీక్షల్లో మెరుగ్గా రాణించేందుకు ఆన్లైన్ వనరులపై ఆధారపడే వారి సంఖ్య ఇపుడిపుడే పెరుగుతోంది. విద్యార్థులు రోజుకు సగటున 90 నిమిషాలకు పైగా తమ పోర్టల్‌ను చూస్తున్నారని అన్అకాడెమీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ చెప్పారు. తమ పోర్టల్ ద్వారా విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు సగటున నెలకు 2,000 డాలర్ల దాకా (దాదాపు రూ.1.4 లక్షలు) ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ప్రత్యేక కోర్సులను విక్రయించడం సహా ఇతరత్రా ప్రయత్నాలూ చేశామని, చివరికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం తమకు ఉపయోగకరంగా ఉంటోందని ఆయన చెప్పారు. అన్ అకాడెమీ ప్రస్తుతం యూపీఎస్సీ, ఐఐటీ–జేఈఈ, క్యాట్ సహా 12 పోటీ పరీక్షల కోర్సులు అందిస్తోంది. బీటా ఫేజ్‌లో ప్రతి రోజూ 400 మంది టీచర్స్‌తో 600 పైచిలుకు లైవ్ తరగతులను నిర్వహిస్తోంది. ఉచిత విద్యా బోధన పోర్టల్‌గా ప్రారంభమైన అన్అకాడెమీ ఆ తర్వాత పెయిడ్ ప్లాట్‌ఫాం కూడా ప్రవేశపెట్టింది. బీటా దశలోని ఈ పెయిడ్ ప్లాట్‌ఫాంలో 10,000 మంది దాకా విద్యార్థులున్నారు. అధ్యాపకులు పోటీ పరీక్షలతో పాటు వివిధ పాఠ్యాంశాలపై కోర్సులను అందించేందుకు అన్అకాడెమీ తోడ్పడుతోంది. సెకోయా క్యాపిటల్, ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ వంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఇందులో పెట్టుబడులు పెట్టాయి. నిధుల సమీకరణ.. ఆన్లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థలు భారీగా పెట్టుబడులు కూడా ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే బీజింగ్‌కు చెందిన టీఏఎల్ ఎడ్యూకేషన్ గ్రూప్ సంస్థ వేదాంతూలో దాదాపు రూ. 35 కోట్ల నిధులను ఇన్వెస్ట్ చేసింది. డిసెంబర్ నాటికి 10 లక్షల గంటల లైవ్ తరగతుల నిర్వహణ మైలురాయిని సాధించినట్లు వేదాంతూ వెల్లడించింది. రికార్డు చేసిన వీడియోలు, పాఠాల వంటి మిగతా విధానాలతో పోలిస్తే తరగతుల ప్రత్యక్ష ప్రసారం వల్ల విద్యార్థులు మరింత చురుగ్గా పాఠాలను ఆకళింపు చేసుకోగలిగే వీలుంటోందని గ్రేడప్ అనే ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ సీఈవో శోభిత్ భట్నాగర్ పేర్కొన్నారు. -
రూ.7.8 లక్షల కోట్లకు విద్యా రంగం!: ఇండ్-రా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశీయ విద్యా రంగం రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది దాదాపు రూ.6.4 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది.