లైవ్‌ క్లాస్‌లతో కాసుల వర్షం | Domestic Education Startup Boom | Sakshi
Sakshi News home page

లైవ్‌ క్లాస్‌లతో కాసుల వర్షం

Apr 23 2019 12:19 AM | Updated on Apr 23 2019 12:19 AM

Domestic Education Startup Boom - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీంతో లైవ్‌ తరగతులు నిర్వహించే పలు ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థల ఆదాయం భారీగా పెరుగుతోంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ రూపొందించిన నివేదిక ప్రకారం... ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఫీజులు చెల్లించి నేర్చుకునే పెయిడ్‌ యూజర్ల సంఖ్య 2021 నాటికల్లా 96 లక్షలకు చేరనుంది. పోటీ పరీక్షలు, టెస్టుల కోసం సిద్ధం చేసే కోర్సులకు అత్యంత ఆదరణ ఉంటోంది. ఈ విభాగాల్లో విపరీతమైన వృద్ధి ఉండటంతో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అన్‌అకాడెమీ, వేదాంతు, బైజూస్‌ వంటి ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థలు పోటీపడుతున్నాయి. విద్యారంగానికి సంబంధించి చైనాలో నెలకొన్న ట్రెండ్‌ భారత్‌లో కూడా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వీఐపీ కిడ్, యువాన్‌ ఫుడావో వంటి వందల కోట్ల డాలర్ల స్టార్టప్‌ సంస్థలు ప్రస్తుతం లైవ్‌ క్లాసుల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇదే తరహాలో దేశీ సంస్థలు కూడా లైవ్‌ వీడియో లెర్నింగ్‌ విధానాలను అమలు చేస్తున్నాయి.  

టీచర్లకూ ఆదాయం.. 
దేశీయంగా ఏటా 20 కోట్ల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటారు. పరీక్షల్లో మెరుగ్గా రాణించేందుకు ఆన్‌లైన్‌ వనరులపై ఆధారపడే వారి సంఖ్య ఇపుడిపుడే పెరుగుతోంది. విద్యార్థులు రోజుకు సగటున 90 నిమిషాలకు పైగా తమ పోర్టల్‌ను చూస్తున్నారని అన్‌అకాడెమీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్‌ ముంజల్‌ చెప్పారు. తమ పోర్టల్‌ ద్వారా విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు సగటున నెలకు 2,000 డాలర్ల దాకా (దాదాపు రూ.1.4 లక్షలు) ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ప్రత్యేక కోర్సులను విక్రయించడం సహా ఇతరత్రా ప్రయత్నాలూ చేశామని, చివరికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం తమకు ఉపయోగకరంగా ఉంటోందని ఆయన చెప్పారు. అన్‌ అకాడెమీ ప్రస్తుతం యూపీఎస్‌సీ, ఐఐటీ–జేఈఈ, క్యాట్‌ సహా 12 పోటీ పరీక్షల కోర్సులు అందిస్తోంది. బీటా ఫేజ్‌లో ప్రతి రోజూ 400 మంది టీచర్స్‌తో 600 పైచిలుకు లైవ్‌ తరగతులను నిర్వహిస్తోంది. ఉచిత విద్యా బోధన పోర్టల్‌గా ప్రారంభమైన అన్‌అకాడెమీ ఆ తర్వాత పెయిడ్‌ ప్లాట్‌ఫాం కూడా ప్రవేశపెట్టింది. 
బీటా దశలోని ఈ పెయిడ్‌ ప్లాట్‌ఫాంలో 10,000 మంది దాకా విద్యార్థులున్నారు. అధ్యాపకులు పోటీ పరీక్షలతో పాటు వివిధ పాఠ్యాంశాలపై కోర్సులను అందించేందుకు అన్‌అకాడెమీ తోడ్పడుతోంది. సెకోయా క్యాపిటల్, ఎస్‌ఏఐఎఫ్‌ పార్ట్‌నర్స్‌ వంటి వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ ఇందులో పెట్టుబడులు పెట్టాయి.  

నిధుల సమీకరణ.. 
ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థలు భారీగా పెట్టుబడులు కూడా ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే బీజింగ్‌కు చెందిన టీఏఎల్‌ ఎడ్యూకేషన్‌ గ్రూప్‌ సంస్థ వేదాంతూలో దాదాపు రూ. 35 కోట్ల నిధులను ఇన్వెస్ట్‌ చేసింది. డిసెంబర్‌ నాటికి 10 లక్షల గంటల లైవ్‌ తరగతుల నిర్వహణ మైలురాయిని సాధించినట్లు వేదాంతూ వెల్లడించింది.  రికార్డు చేసిన వీడియోలు, పాఠాల వంటి మిగతా విధానాలతో పోలిస్తే తరగతుల ప్రత్యక్ష ప్రసారం వల్ల విద్యార్థులు మరింత చురుగ్గా పాఠాలను ఆకళింపు చేసుకోగలిగే వీలుంటోందని గ్రేడప్‌ అనే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ పోర్టల్‌ సీఈవో శోభిత్‌ భట్నాగర్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement