ఆన్‌లైన్‌లో రిటర్న్ వేస్తున్నారా! | Online in Returns! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో రిటర్న్ వేస్తున్నారా!

Published Mon, May 9 2016 3:00 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

ఆన్‌లైన్‌లో రిటర్న్ వేస్తున్నారా! - Sakshi

ఆన్‌లైన్‌లో రిటర్న్ వేస్తున్నారా!

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన సమయం వచ్చింది. ఏ వ్యక్తయినా రిటర్న్ వేసే ముందు తనకు సంబంధించిన ఆదాయ వివరాల పట్టికను తయారు చేసుకోవాలి. అంటే తనకు వచ్చిన ఆదాయం, వివరాలు దానికి సంబంధించిన ఎగ్జంప్షన్లు, డిడక్షన్‌ల వివరాలన్నీ తీసుకుని తనకు వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? అందులో ఎంత మొత్తానికి పన్ను వర్తిస్తుంది? ఎంత పన్ను చెల్లించాల్సి ఉంది? అనే విషయాలు పొందుపరచాలి. ఇలా ఒక అవగాహనకు వచ్చాక రిటర్న్ దాఖలు చేయొచ్చు. కొన్ని నిర్ధిష్ట  పరిస్థితుల్లో తప్ప రిటర్న్ ఆన్‌లైన్‌లో, భౌతికంగా రెండు విధాలుగా వేయొచ్చు. కానీ ఆన్‌లైన్లో వేయటం శ్రేయస్కరం.
 
ఆన్‌లైన్‌లో దాఖలు చేసేదిలా..
.
అసెస్సీ తన ఆదాయ, పన్ను వివరాలను ఒక పట్టికలో పొందుపరిచాక ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా ఈఫైలింగ్.జీవోవీ.ఇన్ అనే వెబ్‌సైట్ ద్వారా తనకు సంబంధించిన ఐటీఆర్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంటే వేతనదారులకు ఐటీఆర్-1, వ్యాపారం ద్వారా ఆదాయం ఉన్న వారికి ఐటీఆర్-4 తదితరాలు. ప్రస్తుతం ఐటీఆర్ ఎక్సెల్ , జావా యుటిలిటీ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఆసెసిలు ఈ రెండింటిలో ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేశాక దాన్ని మీ సిస్టంలో సేవ్ చేయాలి. తరవాత ఐటీఆర్ ఫారంలో వివరాలను పొందుపరచాలి. ప్రతి ఐటీఆర్ ఫారంలో మీ పేరు, చిరునామా, పాన్ నంబరు, అడ్రస్, బ్యాంకు ఖాతా వివరాల వంటివి పొందుపరచాలి.
 
తరువాత మీ ఆదాయ వివరాలను రాయాలి. మీకు వర్తించే డిడక్షన్‌లు  ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా తెలియ చేయాలి. మీకు సంబంధించిన టీడీఎస్ , సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్సు వివరాలను కూడా పొందుపరచాలి. మీరు తయారు చేసుకున్న పట్టిక ఆధారంగా పై వివరాలు తెలియజేయాలి. రిప్రజెంటేటివ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసేట్లయితే వారి వివరాలు కూడా తెలపాలి. ఆఖర్లో మీకు వర్తించే ట్యాక్సు లేదా రిఫండ్ మొత్తాన్ని సరి చూసుకోవాల్సి ఉంటుంది.
 
కంపెనీలైతే రిటర్న్ సబ్‌మిట్ చేసేముందు డిజిటల్ సిగ్నేచర్ చేయాలి. మిగిలిన వారు జావా యుటిలిటిలో ఐటీఆర్ నింపి... ఐటీఆర్‌లోనే సబ్‌మిట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను శాఖ వారు కొత్తగా ఆధార్ నంబరుతో లింక్ చేస్తున్నారు. ఆధార్‌తో లింక్ అయిన ఆసెిస్సీలు ఓటీపీ ద్వారా తమ రిటర్న్‌ని ఈ వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీఆర్-  అనే అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకొని, దానిపై సంతకం చేసి, దాని కింది భాగంలో పేర్కొన్న ‘సీపీసీ బెంగళూరు’ చిరునామాకి పోస్టు ద్వారా పంపాలి. పైన తెలిపిన రెండు పద్ధతులు కాకుండా నెట్‌బ్యాంకింగ్ లాగిన్ ద్వారా ఈ వెరిఫై చేయవచ్చు. ఒకవేళ సీపీసీ బెంగళూరుకు పంపితే రిటర్న్ ఫైల్ చేసిన 120 రోజుల లోపు పంపించాలి.
- కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
 ట్యాక్సేషన్ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement