ఆదాయం @ ఆన్‌లైన్ | Income online shopping | Sakshi
Sakshi News home page

ఆదాయం @ ఆన్‌లైన్

Published Fri, Aug 8 2014 10:23 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

ఆదాయం @ ఆన్‌లైన్ - Sakshi

ఆదాయం @ ఆన్‌లైన్

ఆదాయాలు అరకొరగా ఉన్నా.. ఉప్పు, పప్పు ధరల నుంచి పండుగాడి స్కూలు ఫీజుల దాకా అన్నీ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. ధరల భారాన్ని తట్టుకునేందుకు ఒక్క ఉద్యోగం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే అదనపు ఆదాయాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించాల్సి ఉంటోంది. ఇంటర్నెట్ విప్లవంతో ఇలాంటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వస్తున్నాయి. కాస్త నైపుణ్యం.. సృజనాత్మకత ఉంటే ఆన్‌లైన్లో ఆదాయాలకు అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి..
 
అనువాదాలు, ఐటీ పరమైన సేవలు, న్యాయపరమైన సలహాలు మొదలైన వాటికోసం  వివిధ సంస్థలు ప్రస్తుతం ఆన్‌లైన్ మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఇందుకు మెరుగ్గానే ముట్టచెబుతున్నాయి కూడా. ఇలాంటి జాబ్స్ కోసం ఇల్యాన్స్‌డాట్‌కామ్, ఒడెస్క్‌డాట్‌కామ్ వంటి వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నమోదు చేయించుకుని, ఆయా అంశాల్లో మీ నైపుణ్యాన్ని నిరూపించే కొన్ని పరీక్షలు ప్యాసయితే చాలు. కాంట్రాక్టరు/ఫ్రీలాన్సర్ల జాబితాలో మీ పేరును కూడా చేరుస్తుంది వెబ్‌సైటు. మీ ప్రొఫైల్, నైపుణ్యాలు నచ్చితే క్లయింట్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. గంటకి ఇంత చొప్పున లేదా ప్రాజెక్టుకు ఇంత చొప్పున అని వర్క్ దక్కించుకోవచ్చు. కాస్త ఎక్కువ కష్టపడగలిగితే, క్లయింట్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంటే మరిన్ని ఎక్కువ ప్రాజెక్టులు, మరింత ఆదాయం ఆర్జించవచ్చు. అయితే, సర్వే ఫారంలు నింపితే చాలు డాలర్లలో సంపాదించవచ్చు, ముందస్తుగా కొంత కడితే రెగ్యులర్‌గా ఆదాయం వచ్చే ప్రాజెక్టులు ఇస్తాం అంటూ అనేక వెబ్‌సైట్లు ఊరిస్తుంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
 
 ఈ-ట్యూషన్స్..
 
 బోధన అనుభవం ఉండి, వివిధ సబ్జెక్టులపై పట్టు గానీ ఉంటే ఆన్‌లైన్లోనూ పాఠాలు చెప్పే ప్రాజెక్టులు దక్కించుకోవచ్చు. 2షన్‌డాట్‌నెట్, ట్యూటర్‌విస్టాడాట్‌కామ్ వంటి వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ ట్యూటర్‌గా పేరు  నమోదు చేయించుకోవచ్చు. ఏయే సబ్జెక్టుల్లో మీకు అనుభవం ఉంది, ఏయే తరగతులకు చెప్పగలరు, అనుభవం, మీకు వీలుండే సమయం, ఎంత రెమ్యూనరేషన్ ఆశిస్తున్నారు వంటి అంశాలను పొందుపర్చాలి. వీటిని ధ్రువీకరించుకున్నాక.. సదరు సైట్ మీ పేరును పోర్టల్‌లో ఉంచుతుంది. ఆసక్తి గల విద్యార్థులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒక్కసారి పట్టు దొరికాక.. వివిధ ప్రాంతాల్లో ఉండే పలువురు విద్యార్థులకు ఏకకాలంలో బోధించడం ద్వారా మరింత ఎక్కువగా సంపాదించడానికి వీలవుతుంది.
 
 పుస్తకాల పబ్లిషింగ్ ..
 
 రచనా వ్యాసంగంపై ఆసక్తి ఉంటే మీరు రాసే వాటిని ఆన్‌లైన్లో ప్రచురించి, వాటి అమ్మకాల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. ఇలాంటి వాటి పబ్లిషింగ్ కోసం అమెజాన్ సంస్థ కిండిల్ డెరైక్ట్ పబ్లిషింగ్ పేరుతో ఉచిత సర్వీసు అందిస్తోంది. దీంట్లో నమోదు చేసుకుంటే కిండిల్ బుక్‌స్టోర్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్లో వాటి అమ్మకాల ద్వారా రాయల్టీలను అందుకోవచ్చు. దేశాలను బట్టి 35-70 శాతం మేర రాయల్టీ ఉంటుంది.
 
 ఫోటోల అమ్మకం..
 
 ఫోటోగ్రఫీ మీ హాబీ అయితే దాన్ని సైతం ఆన్‌లైన్లో ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఐస్టాక్‌ఫొటోడాట్‌కామ్, షటర్‌పాయింట్ వంటి వెబ్‌సైట్లలో మీరు తీసే ఫొటోలను ఉంచవచ్చు. అవి అమ్ముడైన ప్రతిసారి 15-85 శాతం దాకా రాయల్టీ కింద అందుకోవచ్చు. విక్రయాలకు సంబంధించిన ఫొటోల ఎంపికపై ఆయా వెబ్‌సైట్లు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుంటాయి. నాణ్యత బాగుండి, మీ పోర్ట్‌ఫోలియోలో ఎంత ఎక్కువగా ఫొటోలు ఉంటే అంత ఎక్కువగా అమ్మకాలు ఉంటాయి.  
 
 ఆన్‌లైన్ షాపు ..
 
 హస్తకళలు, మరెక్కడా ఎక్కువగా దొరకని ప్రత్యేక ఉత్పత్తులు లాంటివాటితో ఆన్‌లైన్లో షాపు తెరవొచ్చు. ఈబేడాట్‌ఇన్, అమెజాన్‌డాట్‌ఇన్, ఇండీబజార్‌డాట్‌కామ్ వంటి వెబ్‌సైట్ల ద్వారా విక్రయించవచ్చు. వీటిలో నమోదు ప్రక్రియ సులువుగానే ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాలను వెరిఫై చేసుకున్న తర్వాత స్టోర్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి లాంటి విషయాల గురించి సదరు వెబ్‌సైటు తగిన సహాయం అందిస్తుంది.
 
 యాప్స్ తయారీ

 
 స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యాప్స్‌కి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాప్స్ ఎలా తయారు చేయాలన్న దానిపై ఆన్‌లైన్లో పాఠాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. యాప్‌ను తయారు చేసే గూగుల్ ప్లే, విండోస్ ఫోన్ స్టోర్ వంటి వాటిలో ఉంచవచ్చు. నిర్దిష్ట ఫీజులేమైనా ఉంటే మినహాయించుకుని డౌన్‌లోడ్లను బట్టి సదరు సైటు మీకు చెల్లింపులు జరుపుతుంది. అయితే, లక్షల కొద్దీ యాప్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి కనుక.. మీ యాప్ వైవిధ్యంగా ఉంటేనే నిలదొక్కుకోగలుగుతుంది.
 
 డొమైన్లు కొనడం.. అమ్మడం ..
 
 మిగతా వస్తువులు కొని అమ్మినట్లే.. డొమైన్ నేమ్స్‌ని కూడా కొని, అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇప్పటికే చాలా మటుకు నేమ్స్ అమ్ముడైపోయినప్పటికీ.. కొత్త రకం వ్యాపారాలు, వెబ్‌సైట్లు కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. కాస్త క్రియేటివ్‌గా ఆలోచించగలిగి, మంచి డొమైన్ నేమ్స్‌ను పట్టుకోగలిగితే చాలు. ఆ నేమ్‌కి ఉన్న డిమాండ్‌ను బట్టి కొన్న దానికి అనేక రెట్లు ఎక్కువ రేటుకు అమ్మి లాభాలు గడించవచ్చు. ఉదాహరణకు.. వెకేషన్‌రెంటల్స్‌డాట్‌కామ్ అనే డొమైన్‌ని హోమ్‌ఎవే అనే సంస్థ దాదాపు రూ. 175 కోట్లకు కొనుక్కుంది. పోటీ కంపెనీకి ఈ నేమ్ దక్కకూడదనే దీన్ని కొనుక్కున్నట్లు సదరు సంస్థ చెప్పుకొచ్చింది.
 
ప్రకటనలతో ఆదాయం ..


మీకంటూ బ్లాగు, వెబ్‌సైటు లేదా యూట్యూబ్‌లో చానల్‌ని గానీ ప్రారంభిస్తే.. వాటిల్లో ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చు. ఇందుకోసం గూగుల్ యాడ్‌సెన్స్‌లో అకౌంటు తీసుకోవాలి. ఎంత ఎక్కువ మంది మీ బ్లాగ్ లేదా వెబ్‌సైటును సందర్శిస్తే.. మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇక వీటిల్లో ఏం రాయాలంటారా.. మీకు తెలిసినవీ, మీకు నచ్చిన విషయాల గురించి రాయొచ్చు. యూట్యూబ్‌లో ఆసక్తికరమైన వీడియోలు రూపొందించి అప్‌లోడ్ చేయొచ్చు. అప్‌లోడ్ చేయడం ఒక్కటే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వాటిని చూసేలా ప్రమోట్ కూడా చేయాలి. యూట్యూబ్ సగటున సుమారు 1,000 వ్యూస్‌కి 10 డాలర్ల చొప్పున చెల్లిస్తుంది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా భారీగా ఆర్జిస్తున్న వారి సంఖ్య బాగానే ఉంటోంది. ఎల్‌రూబియస్‌ఓఎంజీ పేరుతో యూట్యూబ్ చానల్‌ని నిర్వహించే 24 ఏళ్ల స్పానిష్ వీడియో గేమ్ కామెంటేటర్.. దీని ద్వారా ఏటా దాదాపు రూ. 24 కోట్ల దాకా అందుకుంటున్నాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement