కోచ్‌పై చిందులేసిన క్రికెటర్
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ చిక్కుల్లో పడ్డాడు. అక్మల్.. పాకిస్తాన్ దేశవాళీ జట్టు కోచ్, మాజీ టెస్టు క్రికెటర్ బాసిత్‌తో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగిన ఖ్వాయిద్ ఏ అజామ్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని, డ్రెస్సింగ్ రూమ్‌లో అక్మల్.. బాసిత్‌తో దురుసుగా ప్రవర్తించి దూషించినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపడంతో అక్మల్.. కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆల్ రౌండర్ హుసేన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తనను ఎందుకు వెనుకగా పంపారని కోచ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, అధికారుల సమక్షంలో ఈ గొడవ జరిగినట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా అక్మల్ ఇటీవల నిషేధం ఎదుర్కొనే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓ మ్యాచ్ సందర్భంగా పోలీసులు ఓ ప్రైవేట్ డాన్స్ పార్టీపై దాడి చేసి అక్మల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అక్మల్‌ను విడుదల చేయడంతో పాటు డాన్స్ పార్టీలో అతను పాల్గొనలేదని నివేదిక ఇవ్వడంతో అతనికి ఊరట కలిగింది.