అక్కడ గ్రీన్ కార్డ్.. ఇక్కడ స్థానికతపై రగడ!
కుల, మత, ప్రాంత బేధాలేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్ధులకు పెట్టిన గొప్పవరం ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం. ఎందరో పేద కుటుంబాల్లో ఉన్నత విద్యకు మార్గదర్శకంగా నిలచిన ఈ పతకం మహానేత కనుమరుగైన తర్వాత అనేక ఆటుపోట్లకు గురైంది. ఎలాంటి షరతుల్లేకుండా పేదవిద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని గత నాలుగేళ్లలో ఎన్నో నిబంధనలు, షరతులు వేధించాయి. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం అనేక వేధింపులకు గురవుంతుండగానే రాష్ట్ర విభజన మరోసారి ఇబ్బందుల్లో పడేసింది. ఇప్పటికే తెలుగు ప్రజల మధ్య మానసిక మనస్పర్ధలు సృష్టించిన రాష్ట్ర విభజన... మరోసారి.. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో రెండు రాష్ట్రాల ప్రజలు.. ప్రభుత్వాల మధ్య వివాదం సృష్టిస్తోంది.
తండ్రి స్థానికత ఆధారంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం విద్యార్ధులకు వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల గుండెల్లో రాయి పడేలా చేసింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ రాజధానిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలైన కుటుంబాలకు తెలంగాణ ప్రాంతంలో విద్యనభ్యసించడానికి ఎన్నో అవరోధాలు కల్పిస్తున్నాయి.
తండ్రి స్థానికత ఆధారంగానే ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం వర్తిస్తుందనే నిబంధనపై హైదరాబాద్ లోని విద్యార్ధుల తల్లితండ్రులు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా స్థానికేతరులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్న విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఉపాధి కోసం అమెరికా, కెనడాలాంట దేశాల్లో స్థిరపడిన తెలుగు, ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలు అక్కడే జన్మిస్తే.. గ్రీన్ కార్డులాంటి సదుపాయాలు కల్పిస్తున్నారని.. అలాంటిది తెలంగాణ ప్రాంతంలో అనేక షరతులు, నిబంధనలు విదించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి కోసం జన్మస్థలాలను వదిలి...దశాబ్దాలపైగా హైదరాబాద్ చుట్టు పక్కల స్థిరపడిన ఆంధ్రా కుటుంబాలపై సవతి తల్లి ప్రేమను చూపించడంపై పేద విద్యార్ధుల తల్లితండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాని ఎలాంటి షరతుల్లేకుండా అమలు చేయాలని పేద వర్గాలు కోరుకుంటున్నాయి. పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకోనైనా నిబంధనల్ని సడలిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. Follow @sakshinews