donate land
-
శ్మశానానికి రూ.6 కోట్ల భూమి విరాళం
భీమారం (వరంగల్): గజం స్థలం కోసం సొంతవాళ్లతో ఘర్షణ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా రూ.6 కోట్ల విలువైన భూమిని దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. వరంగల్ నగరం పరిధిలోని గుండ్లసింగారానికి చెందిన గంగు గోపాల్రావుకు స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడాన్ని గమనించి తనకున్న భూమిలోనుంచి మూడెకరాలను దానికి ఇవ్వాలని నిర్ణయించాడు. అక్కడ ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా నేత అల్వాల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీ దయాకర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వివరించాడు. ఈ మేరకు శనివారం ఎంపీలు దయాకర్, బండా ప్రకాశ్ చేతుల మీదుగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్‌కు పత్రాలు అందజేశారు. గోపాల్‌రావు దానమిచ్చిన మూడెకరాలలో మోడల్ శ్మశానవాటిక నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెద్దమనసు చాటుకున్న గోపాల్‌రావును కలెక్టర్ అభినందించారు. -
సీఎం జగన్ పిలుపు.. డాక్టర్ ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: ‘రెండేళ్లు ఆగండి. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తాం. ఇప్పుడున్న స్కూల్‌ను ఫొటో తీసి.. రెండు సంవత్సరాల తర్వాత ఫొటో తీసి నాడు నేడు అని డిస్ప్లే చేస్తాం’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శూలపాణి స్పందించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా క్రోసూర్ మండలం హస్సానాబాద్ గ్రామంలో సుమారు కోటి రూపాయలు విలువజేసే ఒక ఎకరా 70 సెంట్ల భూమిని ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విరాళం అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన చింతలపాటి సోమయాజి శర్మ, రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ చింతలపాటి శూలపాణి. వనస్థలిపురంలో ఆయన రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్నారు. తన తండ్రి సోమయాజిశర్మ కొన్నేళ్ల క్రితం మరణించారు. తల్లి రాజ్యలక్ష్మి ఇటీవలే కన్నుమూశారు. డాక్టర్ శూలపాణి చిన్నతనంలో తన స్వగ్రామం హస్సానాబాద్‌లోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. 3 సంవత్సరాల క్రితం 5వ తరగతి వరకే ఉన్న ఆ పాఠశాలకు 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అనుమతిచ్చింది. దీంతో ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోనే పైతరగతులను ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలకు అదనపు తరగతులు నిర్మించేందుకు స్థలం లేదు. ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించింది. పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కార్యాచరణ చేపట్టింది. డాక్టర్ శూలపాణి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వగ్రామంలో ఏదైనా చేయాలని భావిస్తున్న తరుణంలో తనకున్న ఒక ఎకరా 70 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చేందుకు అంగీకరించారు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలను విద్యాశాఖ అధికారులకు అందజేశారు. డాక్టర్ శూలపాణి నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
రూ.కోటి విలువైన స్థలం దానం
స్కూలు భవనాన్ని, స్థలాన్ని రాసిచ్చిన వైనం వైఎస్ ప్రకాష్‌రెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వం పులివెందుల రూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులోని పాల్‌రెడ్డి ఎంపీయూపీ స్కూలు భవనాన్ని, స్థలాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి (వైఎస్ రాజారెడ్డి సోదరుడు చినకొండారెడ్డి కుమారుడు) సతీమణి వైఎస్ పద్మావతి, కుమారుడు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి (వైఎస్ మధు) వైఎస్సార్ జిల్లా పరిషత్‌కు దానం చేశారు. మంగళవారం ఎంపీడీవో అక్రమ్ బాషా, సూపరింటెండెంట్ ముకుందారెడ్డిలను కలసి 454/2 సర్వే నంబరులోని 21 సెంట్ల స్థలాన్ని, అందులోని భవనాన్ని జెడ్పీకి దానపత్రం రాసి ఇచ్చారు. దీనివిలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.కోటికిపైగా ఉంటుంది. ఇంతటి విలువైన స్థలాన్ని జిల్లా పరిషత్‌కు దానం చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ పద్మావతి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ పాల్ జగన్మోహన్రెడ్డి (వైఎస్ ప్రకాష్‌రెడ్డి కుమారుడు) జ్ఞాపకార్థం ఈ భవనాన్ని, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు. పేదలకు మెరుగైన విద్యనందించాలన్నదే వైఎస్ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ ఆశయమని చెప్పారు.