
విద్యాశాఖ అధికారులకు భూ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్న శూలపాణి తదితరులు. ఇన్‌సెట్‌లో డాక్టర్ శూలపాణి
సాక్షి, హైదరాబాద్: ‘రెండేళ్లు ఆగండి. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తాం. ఇప్పుడున్న స్కూల్‌ను ఫొటో తీసి.. రెండు సంవత్సరాల తర్వాత ఫొటో తీసి నాడు నేడు అని డిస్‌ప్లే చేస్తాం’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శూలపాణి స్పందించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా క్రోసూర్ మండలం హస్సానాబాద్ గ్రామంలో సుమారు కోటి రూపాయలు విలువజేసే ఒక ఎకరా 70 సెంట్ల భూమిని ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విరాళం అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన చింతలపాటి సోమయాజి శర్మ, రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ చింతలపాటి శూలపాణి. వనస్థలిపురంలో ఆయన రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్నారు. తన తండ్రి సోమయాజిశర్మ కొన్నేళ్ల క్రితం మరణించారు. తల్లి రాజ్యలక్ష్మి ఇటీవలే కన్నుమూశారు. డాక్టర్ శూలపాణి చిన్నతనంలో తన స్వగ్రామం హస్సానాబాద్‌లోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. 3 సంవత్సరాల క్రితం 5వ తరగతి వరకే ఉన్న ఆ పాఠశాలకు 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అనుమతిచ్చింది. దీంతో ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోనే పైతరగతులను ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలకు అదనపు తరగతులు నిర్మించేందుకు స్థలం లేదు.
ఇదే క్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించింది. పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కార్యాచరణ చేపట్టింది. డాక్టర్ శూలపాణి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వగ్రామంలో ఏదైనా చేయాలని భావిస్తున్న తరుణంలో తనకున్న ఒక ఎకరా 70 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చేందుకు అంగీకరించారు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలను విద్యాశాఖ అధికారులకు అందజేశారు. డాక్టర్ శూలపాణి నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment