బాబు తీరు.. విమానాల హోరు
పర్యటనంటే ‘ప్రత్యేక’ ఫ్లైట్ ఎక్కాల్సిందే.. సీఎం మోజు ఖర్చు ఇప్పటి వరకూ రూ.12 కోట్లుపైనే..
రాజధాని కోసం విరాళాలు అడుగుతూ జనం సొమ్ముతో టూర్లు
ఢిల్లీ, సింగపూర్, జిల్లాలు.. ఎక్కడికైనా అలా వెళ్లాల్సిందే..
సింగపూర్ ప్రత్యేక విమానానికి సర్కారు వ్యయం రూ.అర కోటి
హైదరాబాద్: ప్రత్యేక విమానాలను వినియోగించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రికార్డు సృష్టించారు. సాధారణంగా ఢిల్లీకి వెళ్లినా, విదేశీ పర్యటనలకైనా సీఎంలు ఎవరూ ప్రత్యేక విమానాలను వినియోగించరు. సాధారణ విమానాల్లోనే వెళతారు. చంద్రబాబు మాత్రం ఢిల్లీతో సహా జిల్లాల పర్యటనలకు సైతం ప్రత్యేక ఫ్లైట్లలో తప్ప రెగ్యులర్ విమానాల్లో కాలు పెట్టట్లేదు. విదేశీ పర్యటనలకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మాత్రమే ప్రత్యేక విమానాల్లో వెళుతుంటారు. బాబు మాత్రం సింగపూర్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లి రికార్డు సృష్టించారు. ఏ ముఖ్యమంత్రి విదేశాలకు ప్రత్యేక విమానంలో వెళ్లరని, అయితే టీడీపీకి చెందిన పి.అశోకగజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నందున ప్రత్యేక విమానాల ఏర్పాటు సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీకి చెందిన క్లబ్-1 ప్రత్యేక విమానంలో బాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. విమాన చార్జీల కింద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రూ.అర కోటి చెల్లించింది.
ఢిల్లీకి బాబు ఐదుసార్లూ ‘ప్రత్యేకం’గానే
చంద్రబాబు ఎక్కువగా నవయుగ, కృష్ణపట్నం, జీవీకే, జీఎంఆర్ సంస్థలకు చెందిన 9, 15 సీట్లు కలిగిన ప్రత్యేక విమానాలను వాడుతున్నారు. వీటి చార్జీల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇప్పటిదాకా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఐదు దఫాలూ ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటనకు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లారు.
బెజవాడకు వెళ్లాలన్నా ..
.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జన్మభూమి కార్యక్రమాలతోపాటు జిల్లాల్లో ఇతర అన్ని పర్యటనలకు కూడా ప్రత్యేక విమానాల్లోనే వెళ్లారు. ఆఖరికి విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతిలకు కూడా రెగ్యులర్ విమానాల్లో కాకుండా ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. ఒక పక్క రాజధాని కోసం ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తూ మరో పక్క కోట్ల రూపాయలను ప్రత్యేక విమానాలపై కుమ్మరించటం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులు, అధికారులు పొదుపు చర్యలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రే స్వయంగా వాటిని ఉల్లంఘిస్తూ అవసరం లేకున్నా ప్రత్యేక విమానాల్లో విహరించడం పట్ల ఉన్నతస్థాయి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.