భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
దుబ్బాక(మెదక్) : కట్టుకున్న భార్య ఉండగానే మరో మహిళతో మనువాడిన భర్త నుంచి న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ మొదటి భార్య ధర్నా చేపట్టిన సంఘటన మంగళవారం దుబ్బాక మండలం దుంపలపల్లిలో జరిగింది. బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమంది గ్రామానికి చెందిన పర్స ఎల్లవ్వ, లింగయ్య దంపతుల ఏకైక కూతురైన అనితను దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామానికి చెందిన దొందడి బాలవ్వ, భూమయ్య దంపతుల కుమారుడైన దొందడి రమేశ్‌కు ఎనిమిదేళ్ల కింద రూ. 5.30 లక్షల నగదు, కట్నకానుకలిచ్చి ఘనంగా వివాహం చేశారు. అప్పటి నుంచి ఐదేళ్ల వరకు ఇరువురి వైవాహిక జీవితం సరిగానే సాగింది. వీరి జీవితంలో మూడేళ్ల నుంచి ఎడ మొఖం, పెడ మొఖం మొదలైంది.
అందంగా లేవని, నీకు పిల్లలు పుట్టడంలేదని, మరో రూ. 10 లక్షల డబ్బులు కావాలని మానసికంగా, శారీరకంగా అత్త, మామలు, తొబుట్టువులతో కలిసి భర్త రమేశ్ భార్యను అనితను తరచుగా వేధించడం మొదలు పెట్టాడు. ఇరు గ్రామాల పెద్ద మనుషులు సర్ధిచెప్పినా భర్త మనసులో మార్పు రాలేదు. 8 నెలల కింద అనితను అత్తమామలు, తొబుట్టువులైన ఎల్కపల్లి లక్ష్మి భర్త లక్ష్మణ్, అంబాల బాల్‌లక్ష్మి భర్త రాజులతో కలిసి భర్త రమేశ్ భార్య అనితను చంపడానికి పథకం పన్నుతుండగా విన్న అనిత వారి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్నితల్లిదండ్రులకు చెప్పింది. కూతురు సంసారం విడిపోతుందనే బాధతోనే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మహిళా కోర్టులో కేసు పెట్టారు. కేసు నడుస్తుండగానే నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలం మల్లుమల్లి గ్రామానికి చెందిన మరో అమ్మాయితో రెండో వివాహాం చేసుకున్నాడు. రమేశ్ తతంగమంతా ఆలస్యంగా తెలియడంతో మంగళవారం వచ్చి భర్త రమేశ్ ఇంటి ఎదుట తల్లిదండ్రులతో కలిసి అనిత ధర్నాకు దిగింది. విషయాన్ని తెలుసుకున్న రమేశ్, తల్లిదండ్రులు ఇంటిని విడిచి పరారయ్యారు. బాధితురాలైన అనిత నుంచి దుబ్బాక ఏఎస్ఐ భూంరెడ్డి ఫిర్యాదు తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.