అత్తా కోడలు.. దొంగనోట్ల చెలామణిలో దిట్టలు
ఎర్రగుంట్ల(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్:జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి, సుమలత ఇద్దరూ అత్తాకోడలు. పనీపాట లేకుండా ఇంటి పట్టున ఉండే వీరిని బడా దొంగలు పావులుగా వాడుకున్నారు. చిల్లర డబ్బులకు కక్కుర్తి పడిన మహిళలిద్దరూ దొంగనోట్లు మార్పిడి చేస్తూ చివరకు పోలీసులకు చిక్కిపోయారు. ఇందుకు సంబంధించిన వివ రాలను ఎస్ఐ భానుమూర్తి విలేకరులకు ఆదివారం తెలిపారు.
దొంగనోట్లను ఎలా మార్పిడి చేసేవారంటే...
అసలు నోటును పోలి ఉండే రూ.500 దొంగనోటను తీసుకుని వివిధ ప్రాంతాల్లోని చిల్లర దుకాణాలకు వెళ్తారు. రూ.వందలోపు విలువ చేసే సరుకులను తీసుకుని తమ వద్దనున్న రూ.500 నోటు ఇస్తారు. మిగిలిన రూ.400 ఇవ్వగానే క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. కొన్నాళ్లపాటు అటువైపు తిరిగి చూడరు. ఇంకో ప్రాంతానికి వెళ్తారు. అక్కడా ఇదే తంతు.
దొరికింది ఇలా...
యథాప్రకారం ఆదివారం కూడా పైన పేర్కొన్న అత్తాకోడలు ఎర్రగుంట్లకు వచ్చారు. పలు దుకాణాల్లో వస్తువులు కొని దొంగనోట్లను మార్చేశారు. యాపారం బాగుందనుకుని వేంపల్లెకు వెళ్లే మార్గంలోని వెంకటసుబ్బయ్య చిల్లర దుకాణానికీ వెళ్లారు. అక్కడ రూ.వంద విలువ చేసే వస్తువులు కొని రూ.500 నోటు అంటగట్టారు. మిగిలిన రూ.400 తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనుమరుగయ్యారు. అదే సదరు వ్యాపారి అదే నోటును మరో వినియోగదారుడికి ఇస్తూ నిశితంగా పరిశీలించగా ఆ నోటు నకిలీదిగా గుర్తించారు. వచ్చిన వినియోగదారులు కూడా నకిలీ నోటేనంటూ తేల్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుకాణాదారుడు వెంకటసుబ్బయ్య కొందరిని వెంటబెట్టుకుని తనకు నకిలీ నోటు అంటగట్టిన మహిళల కోసం వెతికారు. నడివూరులో వారిద్దరూ ఉండగా పట్టుకుని నిలదీశారు. వారి బ్యాగును పరిశీలించగా మరికొన్ని నకి లీ నోట్లు ఉండడాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి పోలీసులు
ఎస్ఐ భానుమూర్తి, ఏఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నారు. మహిళలిద్దరినీ తమ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ విచారణ చేశారు. పెద్దమొడియం మండలం పాలురు గ్రామానికి చెందిన షామీర్ అనే వ్యక్తి తమకు ఈ నోట్లు ఇచ్చినట్లు వారు విలువైన సమాచారం ఇచ్చారు. కమిషన్ పద్ధతిన దొంగనోట్లను తాము మార్చుతున్నట్లు మహిళలిద్దరూ అంగీకరించారు. అయితే వారు చెప్పిన షామీర్ అనే వ్యక్తికి సంబంధించిన సమాచారం నిజమా, కాదా అనే విషయాలపై దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.