ఆ ఎస్సైకి మేకలంటే తెగ ఇష్టం..!
నల్లగొండ: పోలీస్స్టేషన్ ఆవరణలోకి మేకలు వస్తున్నాయని వాటిని తన సిబ్బందితో అమ్మించేశాడు నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం ఎస్ఐ దూది రాజు. ఈ తంతు ఏడాదిన్నర కాలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఫిర్యాదుతో ఎట్టకేలకు వీరి బాగోతం బయటపడింది. ఎస్ఐతోపాటు ముగ్గురు హోంగార్డులపై జిల్లా ఎస్పీ వేటు వేశారు.
బయటపడిందిలా..
గ్రామానికి చెందిన రాపర్తి జయమ్మకు నాలుగు మేకలు ఉన్నాయి. అవి పోలీస్స్టేషన్ ఆవరణలోకి వస్తుండటంతో ఎస్ఐ వాటిని బంధించి, ఓ కానిస్టేబుల్, హోంగార్డు సాయంతో రూ.20 వేలకు అమ్మించాడు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు మూడు రోజులుగా పోలీసు అధికారులు విచారణ జరిపారు. బుధవారం ఎస్ఐ రాజు, బాధితులను ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించుకొని, స్వయంగా విచారణ చేయడంతో విషయం రూఢీ అయింది. దీంతో ఎస్సైతోపాటు ఆయనకు సహకరించిన ముగ్గురు హోం గార్డులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సై పెళ్లిలో విందుకు కూడా ఇక్కడి మేకలే..
సంస్థాన్ నారాయణపురం పోలీసులు మేకలను అమ్ముకోవటం ఏడాదిన్నర కాలం నుంచే జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాపర్తి జయమ్మ మేకలను పోలీసులు అమ్ముకున్న విషయం బయటికి రావడంతో, తమ మేకలు కూడా కనిపించటం లేదంటూ పలువురు బాధితులు బయటికొస్తున్నారు. ఇప్పటి వరకు సంస్థాన్ నారాయణపురంలో కనిపించని మేకల సంఖ్య 30కిపైగానే ఉన్నట్టు అంచనా. ఇటీవల జరిగిన గ్రామజ్యోతి గ్రామసభలో కూడా గ్రామస్తులు మేకలు పోతున్న విషయమై ప్రత్యేక తీర్మానం చేయించారు. ఎస్ఐ రాజు ఇక్కడ రెండేళ్ల కాలంగా పనిచేస్తున్నారు. నల్లగొండలో జరిగిన తన పెళ్లికి, విందులకు కూడా ఇక్కడి నుంచే మేకలను తరలించినట్టు ఆరోపణలొస్తున్నాయి.