మోదీగారూ.. స్పందించండి
మా తమ్ముడి మృతదేహం వెంటనే తెప్పించండి
అర్జెంటీనా గవర్నర్తో మాట్లాడండి
అమెరికాలో అయితేఈపాటికే తెచ్చేవారు!
మల్లిబాబు సోదరి దొరసానమ్మ వేడుకోలు
సంగం: ఆండీస్ పర్వతారోహణ క్రమంలో ప్రాణాలు విడిచిన మస్తాన్బాబు మృతదేహాన్ని స్వదేశానికి చేర్చడంలో జరుగుతున్న జాప్యంపై మస్తాన్బాబు అక్క డాక్టర్ దొరసానమ్మ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. మృతదేహం జాడ తెలిసి 2 రోజులు గడిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ స్పందించలేదని, అదే అమెరికా పౌరుడై ఉంటే ఆ దేశ ప్రభుత్వం ఈ పాటికే స్పందించి తగు విధంగా చర్యలు తీసుకుని ఉండేదని ఆమె అన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంగంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
మస్తాన్బాబు మృతదేహం ఆచూకీ లభ్యమై రెండు రోజులు దాటుతున్నా నేటికీ కిందికి తీసుకురాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికా దేశస్తులైతే ఈ సమయానికి మృతదేహాన్ని తెచ్చి ఉండేవారన్నారు. అకోకన్గువా పర్వతారోహణలో ఓ పర్వతారోహకుడు మృతిచెందగా, అతని మృతదేహాన్ని ఆయా దేశస్తులు ఆగమేఘాలపై తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే స్పందించి అర్జెంటీనా గవర్నర్తో మాట్లాడాలని, మృతదేహాన్ని త్వరితగతిన దేశానికి తీసుకువచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారతీయుల సత్తా ప్రపంచానికి చాటాలని తాపత్రయపడిన తన తమ్ముడి విషయంలో కేంద్రం తగువిధంగా స్పందించాలని కోరారు. వాతావరణం అనుకూలించి ఉంటే నేడు 10 పర్వతాలను అధిరోహించిన తొలి భారతీయుడిగా తన తమ్ముడు గుర్తింపు పొంది ఉండేవాడని అన్నారు.
ఆ కోరిక నేను నెరవేరుస్తా: తన తమ్ముడు ఆండీస్ పర్వతారోహణ క్రమంలో ప్రాణాలు విడిచాడని, ఈ పర్వతాన్ని తాను అధిరోహిస్తానని దొరసానమ్మ ప్రకటించారు. నేషనల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పర్వతారోహణపై అవగాహన కల్పించాలని తాను, మస్తాన్బాబు అనుకున్నట్టు తెలిపారు. హిమాలయాల నుంచి సిక్కిం వరకు నడిచి వెళ్లిన ఘనత తన తమ్ముడిదని ఆమె గుర్తుచేశారు. తన చివరి నిమిషం వరకు భారతీయతను చాటిచెప్పేలా రుద్రాక్ష, జాతీయ పతాకం, భగవ ద్గీతను పర్వతాల్లో ఉంచి తుదిశ్వాస విడిచాడన్నారు. మస్తాన్బాబు బతికున్నంత కాలం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడైనా అతని మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చి సహకరించాలన్నారు. అర్జెంటీనా గవర్నర్ సంతకం పెడితే ఆర్మీ కమాండర్లు మృతదేహాన్ని తెచ్చేందుకు వెళతారని, ఇది జరిగితే 4 రోజుల్లో మృతదేహం దేశానికి చేరుతుందన్నారు.