సోధికి దక్కని ‘కామన్వెల్త్ బెర్త్’
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత అగ్రశ్రేణి ‘డబుల్ ట్రాప్’ షూటర్ రంజన్ సోధి ఈ ఏడాది జులైలో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు దూరం కానున్నాడు. షాట్గన్లోని ఆరు ఈవెంట్లలో పాల్గొనే 10 మంది షూటర్లను భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) శనివారం ఎంపిక చేసింది. ఇందులో సోధికి స్థానం కల్పించలేదు.
ఏప్రిల్‌లో అల్మాటీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచ కప్‌లో స్కోర్ల ఆధారంగా ఎన్ఆర్ఏఐ ఈ ఎంపికను నిర్వహించింది. అభినవ్ బింద్రా సారథ్యం వహించనున్న భారత షూటర్ల బృందంలో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌తోపాటు విజయ్ కుమార్, ప్రపంచకప్ తాజా విజేత మానవ్‌జిత్ సింగ్ సంధూ, హీనా సిద్ధూ తదితరులకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగాల్లో పోటీపడనున్నాడు. 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్లు 14 స్వర్ణాలు, 11 రజతాలు, 5 కాంస్యాలు సాధించారు.