డబుల్ ట్రాప్ చాంపియన్ విఖార్
రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి తొలి షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో విఖార్ అహ్మద్ షఫీఖ్ స్వర్ణం గెలుచుకున్నాడు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ షూటింగ్ రేంజ్లో ఈ నెల 13 నుంచి జరుగుతున్న ఈ పోటీలు సోమవారం ముగిశాయి.
డబుల్ ట్రాప్‌లో విఖార్ అహ్మద్ 32 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, ఎం.డి.విక్రమ్ 31 పాయింట్లతో రజతం దక్కించుకున్నాడు. పురుషుల ‘స్కీట్’ విభాగంలో అమిత్ సంఘీ 67 పాయింట్లతో స్వర్ణం, చేతన్‌రెడ్డి 64 పాయింట్లతో రజతం, విఖార్ అహ్మద్ 63 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల ‘స్కీట్’ జూనియర్ విభాగంలో ఆయుష్ రాజు 63 పాయింట్లు సాధించి స్వర్ణం నెగ్గాడు.
పురుషుల స్టాండర్డ్ రైఫిల్ ప్రోన్‌లో సలీమ్ మూసా (235 పాయింట్లు), స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్‌లో తాహెర్ ఖాద్రి (288), జూనియర్ విభాగంలో సర్దార్ అలీ బైయిజ్ (268)లు పసిడి పతకాలు గెలుపొందారు. మహిళల ఫ్రీ రైఫిల్ ప్రోన్‌లో సువర్ణ (279), పురుషుల 3 పి ఫ్రీ రైఫిల్ విభాగంలో తాహెర్ ఖాద్రి (254), జూనియర్ విభాగంలో సాయి అభినవ్, ఫ్రీ పిస్టల్‌లో ప్రసన్న కుమార్ (250)లు విజేతలుగా నిలిచారు. ఇక పురుషుల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో స్వర్ణం నెగ్గిన ఆగా జైనులబ్దీన్ (277), జూనియర్ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. మహిళల స్పోర్ట్స్ పిస్టల్‌లో సబా ఫాతిమా (259) జూనియర్, సీనియర్ విభాగాల్లో పసిడి సాధించింది.
ఆంధ్రప్రదేశ్ పోటీల విజేతలు వీరే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15వ షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఎయిర్ రైఫిల్ పోటీల్లో టి.అమ్మాజీ 378 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. పురుషుల ఎయిర్ పిస్టల్‌లో మల్లిఖార్జునరావు (363), మహిళల ఎయిర్ పిస్టల్‌లో సిరి శాఖమూరు (339), పురుషుల ఫ్రీ రైఫిల్ 3 పి ఫ్రీ రైఫిల్‌లో ఖాదర్ బాబు (253) స్వర్ణాలు గెలుచుకున్నారు. ఇక పురుషుల ‘స్కీట్’ విభాగంలో వంశీ చక్రవర్తి (49), స్మాల్ బోర్ ఫ్రీ రైఫిల్‌లో ఖాదర్ బాబు (283), పురుషుల ఎయిర్ రైఫిల్ సబ్ జూనియర్స్‌లో భార్గవ్ వర్మ (367)లు పసిడి పతకాలు కైవసం
చేసుకున్నారు.