‘దక్కన్ తాజ్ మహల్’ ఎవరు కట్టించారో తెలుసా?!
తాజ్ మహల్లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్ మహలూ కాదు. తాజ్‌మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం.పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగాబాద్‌లో ఉంది. అందుకే దక్కన్ తాజ్‌గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్ మహల్లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్‌మహల్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్రాస్ బానుబేగమ్ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్ కొడుకు అజమ్ షా దగ్గరుండి కట్టించాడు.
మొఘల్ ఆర్కిటెక్చర్ శైలిని ప్రతిబింబిస్తుంది, ప్రధాన భవనం ముందు పెద్ద కొలను, నాలుగు వైపులా విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు, పాలరాతి పూలలో పర్షియన్ లాలిత్యం ప్రతిదీ తాజ్‌మహల్‌ను పోలి ఉంటుంది. తలెత్తి ఓసారి పై కప్పును చూస్తే ఇక ఒక నిమిషం పాటు తల దించుకోలేం. తోటల నుంచి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉన్న విశాలమైన వరండాలు, ఆర్చ్‌ల మధ్య తిరుగుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది.
భార్యాభర్తలిద్దరూ ఇక్కడే
బీబీ కా మఖ్బారా... మహారాష్ట్ర, ఔరంగాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు దక్కన్ కోసం పోరాడి పోరాడి దక్కన్‌లోనే మరణించాడు. బీబీ కా మఖ్బారాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఖుల్దాబాద్‌లో అతడి సమాధి ఉంది. ఈ ట్రిప్‌లో శివాజీ మ్యూజియాన్ని కలుపుకోవచ్చు. ఆ మ్యూజియంలో శివాజీ ఆయుధాలు, నాణేల ప్రదర్శన ఆసక్తిగా ఉంటుంది.
ఇవి కూడా చూడవచ్చు!
16 కిమీల దూరంలో దౌలతాబాద్ కోట
30 కి.మీల దూరంలో ఎల్లోరా గుహలు
50 కి.మీల దూరంలో పైథాన్ ఉంది. అక్కడి చేనేతకారులు నేసే చీరలను పైథానీ చీరలంటారు. మహిళల మనసు దోచే పైథానీ చీరలు గత దశాబ్దకాలంగా నడుస్తున్న ట్రెండ్. కాబట్టి ఒక్క చీరనైనా తెచ్చుకుంటే ఈ ట్రిప్‌కు గుర్తుగా ఉంటుంది. ధర పదివేల నుంచి మొదలవుతుంది.
బస: ఔరంగాబాద్‌లో బస చేయవచ్చు. ఉత్తరాది, దక్షిణాది ఆహారం దొరుకుతుంది.
– వాకా మంజులారెడ్డి
చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు