సిరియాలో మరో ఘోరం..
డమస్కస్: యుద్ధ బాధిత దేశమైన సిరియాలో మరో ఘోరం చోటుచేసుకుంది. సిరియా రాజధాని డమస్కస్కు సమీపంలోని డౌమా పట్టణంలో జరిగిన విష రసాయనిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు, పిల్లలు ప్రాణాలు విడిచారు. శనివారం సాయంత్రం ప్రభుత్వ సైనికులు ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. ఇది విషపూరితమైన గ్యాస్ (టాక్సిక్ గ్యాస్) దాడి అని స్థానిక వైద్యులు వెల్లడించారు. ఈ విషపూరిత గ్యాస్ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 42మంది చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. ఆర్గాన్ ఫాస్ఫోరస్ సమ్మేళనంతో ఈ దాడి జరిగిందని, ఈ ప్రభావంతో వేలమందికి శరీరాలపై తీవ్ర గాయాలయ్యాయని సహాయక సిబ్బంది చెప్తున్నారు.
తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఘౌటా ప్రాంతంపై అధ్యక్షుడు అసద్ సైన్యం రసాయనిక దాడి జరపడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వ సైనిక ముట్టడిలో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల క్లోరైన్ రసాయనిక దాడులు జరిగాయి. 2013లో సరిన్ గ్యాస్ దాడి జరిగింది. ప్రభుత్వ సైన్యం విచ్చలవిడిగా జరుపుతున్న వైమానిక దాడులు, రసాయనిక దాడులతో బెంబేలెత్తుతున్న ప్రజలు, కొందరు తిరుగుబాటుశ్రేణులు కూడా ఆ ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో వలస వెళ్లిపోతున్నారు.
డౌమా: గ్యాస్ దాడికి గురైన చిన్నారులు
ఘౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో ఉన్న షెల్టర్ల వద్ద తాజా దాడి జరిగిందని, బాంబు దాడులు జరిగినా సురక్షితంగా ఉండేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. బెదరగొట్టేందుకు ఈ గ్యాస్ దాడి జరిగి ఉంటుందని, క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిస్తున్న స్థానిక డాక్టర్లు చెప్తున్నారు. ఈ రసాయనిక దాడిలో పెద్దసంఖ్యలో చిన్నారులు, కుటుంబాలు మృతిచెందినట్టు వీడియోలు వెలుగుచూస్తున్నాయి. దట్టమైన గ్యాస్ దాడి వల్ల చిన్నారులు ఊపిరి ఆడక నరకం అనుభవించడం, వారికి సహాయక సిబ్బంది ఇన్హేలర్లతో స్వాంతన చేకూర్చడం, గ్యాస్ దాడి బారిన పడిన వారికి ఆక్సీజన్ అందించడం వంటి హృదయవిదాకరమైన వీడియోలు, ఫొటోలు వెలుగుచూశాయి.
డౌమా: గ్యాస్ దాడికి గురై.. ఆక్సిజన్ పొందుతున్న వ్యక్తి..
అమెరికా ఆగ్రహం!
రెబల్స్ అధీనంలోని డౌమా పట్టణంపై రసాయనిక దాడి జరిగిన నేపథ్యంలో సిరియా, రష్యా ప్రభుత్వాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసద్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు ఈ దాడికి రష్యానే బాధ్యత వహించాలని ఘాటుగా పేర్కొంది. డౌమాలోని ఆస్పత్రిపై కూడా రసాయనిక దాడి జరిగిందన్న వార్తలు తమను కలిచి వేస్తున్నాయని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి హిథర్ నౌవెర్ట్ అన్నారు. అసద్ ప్రభుత్వానికి, ఘౌటాను తమ అధీనంలో ఉంచుకున్న తిరుగుబాటుదారులకు రాజీ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఆదివారం ఉదయం ఈ ప్రాంతంపై మళ్లీ ప్రభుత్వ సేనలు వైమానిక దాడులు ప్రారంభించాయి. మరోవైపు డౌమా పట్టణంలో రసాయనిక దాడి జరగలేదని సిరియా ప్రభుత్వ మీడియా, రష్యా చెప్పుకొచ్చాయి. వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ ఘౌటాలోని రెబల్ సంస్థ జైష్ అల్ ఇస్లాం సంస్థతో శాంతి చర్చలు ఆదివారం జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
డౌమా: గ్యాస్ దాడికి గురైన చిన్నారులు