సిరియా ప్రభుత్వ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో ధ్వంసమైన దౌమా పట్టణంలోని ఓ భాగం
- సిరియా వైమానిక దాడుల్లో చిన్నారులు సహా 82 మంది హతం
దమస్కస్: సిరియా రాజధాని దమస్కస్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌమా పట్టణంలో నెత్తురు ఏరులైపారింది. తిరుగుబాటుదారులను అణిచివేసే క్రమంలో సిరియా ప్రభుత్వం ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. చిన్నారులు సహా 82 మంది హతమయ్యారు. మరో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం తిరుగుబాటుదారుల ఆధీనంలోఉన్న దౌమా పట్టణాన్ని తిరిగి సొంతం చేసుకోవాలనుకున్న ప్రభుత్వం గడిచిన కొద్దిరోజులుగా దాడులు జురుపుతూనేఉన్నది. ఆ క్రమంలోనే ఆదివారంనాడు అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. అత్యాధునిక యుద్ధవిమానాలు, హెలికాప్టర్లతో బాంబులు కురిపించింది. ఒక్కసారిగా కురిసిన బాంబుల వర్షంతో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా బహిరంగ స్మశానంలా మారింది.
దాడుల్లో గాయపడిని వారిని గుర్తించి, చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తిరుగుబాటు దళాల నేతృత్వంలోని సహాయ బృందాలు వెల్లడించాయి. గడిచిన నాలుగేళ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటివరకు రెండు లక్షల పైచిలుకు మంది మరణించగా, తొమ్మిది లక్షల మంది గల్లంతయ్యారు.