అమెరికా రక్తదాహం
- పెంటగాన్ సంచలన ప్రకటన
- సిరియాలో పౌరులను చంపింది నిజమే
- తాజా దాడిలో మరో 35 మంది హతం
డమస్కస్/వాషింగ్టన్: ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు సిరియాలో రక్తపుటేరులు పారిస్తున్నాయి. అసలు లక్ష్యాలకూ దూరంగా.. నివాస సముదాయాలపై బాంబులు కురిపిస్తూ అమాయక ప్రజలను పొట్టనపెట్టుకుంటున్నాయి.
ఐసిస్ ఆధినంలోని మయాదీన్, మోసుల్ నగరాలపై బుధ,గురువారాల్లో అమెరికా యుద్ధవిమానాలు జరిపిన దాడుల్లో కనీసం 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ (ఎస్‌ఓహెచ్‌ఆర్) ఈ విషయాన్ని వెల్లడించింది. అటు వాషింగ్టన్‌లోని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కేంద్రం పెంటగాన్ కూడా సిరియాలో పౌరుల మరణాలు నిజమేనని అంగీకరించడం సంచలనంగా మారింది.
అమెరికా నేతృత్వంలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఎస్‌డీఎఫ్).. బుధవారం రక్కా నగరంపై, గురువారం మయదీన్ నగరంపై విచక్షణా రహితంగా బాంబులు కురిపించాయని, రెండు ఘటనల్లోకలిపి 50 మంది చనిపోయారని ఎస్‌ఓహెచ్‌ఆర్ ప్రతినిధి రమి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి మే 23 వరకు సంకీర్ణదళాలు జరిపిన దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 225కు పెరిగిందని ఆయన వివరించారు. ఐసిస్ ఆక్రమిత సిరియా, ఇరాన్‌లపై 2014 నుంచి యుద్ధం చేస్తోన్న అమెరికా సంకీర్ణదళాలు ఇప్పటివరకు 8000 మందిని చంపేశాయి. వీరిలో 6000 మంది ఉగ్రవాదులుకాగా, మిగిలిన 2000 మంది సాధారణ పౌరులే కావడం గమనార్హం.
పెంటగాన్ సంచలన ప్రకటన
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల దాడిలో సాధారణ పౌరులు కూడా హతమైనట్లు పెంటగాన్ అంగీకరించింది. ఒక్క మౌసూల్ పట్టణంలోనే మార్చి నెలలో 105 మంది సిరియన్లు చనిపోయారని యూఎస్ సెంట్రల్ కమాండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, మిగతా ప్రాంతాల్లో జరిపిన దాడులు, వాటిలో చనిపోయినవారి సంఖ్యపై పెంటగాన్ పెదవి విప్పకపోవడం గమనార్హం.