విత్తుకోని ఆశలు!
జిల్లాలో తగ్గుతోన్న వేరుశనగ సాగు
- పెట్టుబడి సమస్యతో రైతుల అవస్థలు
- ఇప్పటికీ అందని ఇన్పుట్ సబ్సిడీ, ఇనూరెన్స్
- కరువు, ఆర్థిక ఇక్కట్లతో ఉక్కిరిబిక్కిరి
- ఖాళీగా దర్శనమిస్తున్న విత్తన కేంద్రాలు
- తొమ్మిదేళ్లలో తగ్గిన 2.70లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం
- ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు
‘అనంత’ రైతులు ఖరీఫ్‌కు సిద్ధమయ్యేలోపు ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తాం. సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చుకు ఇబ్బంది లేకుండా చూస్తాం.’
– గత ఏప్రిల్ 20న పామిడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
ఇది పూట్లూరు వ్యవసాయశాఖ కార్యాలయం. రైతులకు వేరుశనగ విత్తనాలను ఇక్కడే పంపిణీ చేస్తున్నారు. బుధవారం చింతరపల్లికి చెందిన కుళ్లాయప్ప అనే రైతు మాత్రమే నాలుగు బస్తాలు వేరుశనగ విత్తనకాయలు తీసుకున్నారు. అధికారులు సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించినా ఇతర రైతుల జాడ లేకపోయింది. ఇక్కడే కాదు.. జిల్లాలోని అన్ని పంపిణీ కేంద్రాల్లో 15 రోజులుగా ఇదే పరిస్థితి. అలాగని పంట సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదనుకుంటే పొరపాటు. పెట్టుబడికి డబ్బులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే ప్రాంతం అనంతపురం. 2008లో ఇక్కడ 8.70లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. గతేడాది 6.02లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 6.02లక్షల హెక్టార్లలో పంట సాగువుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. జిల్లాలో పరిస్థితి చూస్తుంటే 5–5.50లక్షల హెక్టార్లలోపు పంట మాత్రమే సాగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వరుస కరువుతో పంట నష్టపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు రైతులను ఉక్కరిబిక్కిరి చేశాయి. ఇదే సమయంలో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో పంట సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులతో విత్తనాలు కూడా కొనలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీ కేంద్రాలు రైతులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఇప్పటి వరకూ 35వేల హెక్టార్లలోనే వేరుశనగ సాగు
గతేడాది జూన్‌లో 1.72లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 35వేల హెక్టార్లకే పరిమితమైంది. ఇందుకు వర్షాభావంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌కు 4.01లక్షల క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సేకరించారు. అవసరమైతే అదనంగా మరో 50వేల క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో 3.19లక్షల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. తక్కిన విత్తన కాయల కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదు. పంపిణీ చేసిన విత్తనాల్లో కూడా కొనుగోలు చేసిన రైతుల సంఖ్య తక్కువే. ఏటా మూడు బస్తాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది 4బస్తాలు పంపిణీ చేశారు. దీంతో 3.19లక్షల క్వింటాళ్ల సంఖ్య కన్పిస్తోంది.
వీటిని కొనుగోలు చేసిన రైతులు మాత్రం తక్కువే కావడం గమనార్హం. నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతాంగం అల్లాడుతోంది. కరువు మండలాలను ప్రకటిస్తున్నా.. హక్కుగా దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందని పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్‌లోపు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని గత ఏప్రిల్ 20న జిల్లా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేకపోయారు. బీమా పరిహారం నిబంధనల మేరకు గతేడాది అక్టోబర్‌కే రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉన్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు. దీంతో పెట్టుబడికి రైతుల వద్ద డబ్బుల్లేని పరిస్థితి. బ్యాంకు రుణాలు కూడా రైతులకు పెట్టుబడికి సరిపడా అందడం లేదు. ఈ ఏడాది రూ.4,264కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. బ్యాంకర్లు రూ.3,400కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇందులో కూడా గతేడాది రుణాలకు వడ్డీలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవడం మినహా రైతుల చేతికి డబ్బులు వచ్చింది లేకపోవడం గమనార్హం.
వర్షపాతమూ కారణమే..
విత్తనాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు కారణమైతే, కొనుగోలు చేసిన రైతులు పంట సాగుకు ఉపక్రమించకపోవడానికి వర్షపాతమూ కారణమే. జూన్‌లో 63.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంటే, 59 మిల్లీమీటర్లకే పరిమితమైంది. ఈ నెల 6న మాత్రమే ఓ మోస్తరు వర్షం కురిసింది. తక్కిన రోజుల్లో పదునుకు సరిపడా వర్షం లేదు. రైతులు పంటసాగు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమే. అయితే గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూలై ఆఖరు వరకూ విత్తనం వేసేందుకు అవకాశం ఉండటంతే సాగు విస్తీర్ణం ఏ మేరకు పెరుగుతుందనేది చూడాలి.
సాగుభూమి కూడా తగ్గుతోందా?
గత తొమ్మిదేళ్లతో పోలిస్తే ఇటీవల జిల్లాలో విండ్‌పవర్ కోసం రైతుల నుంచి భూముల కొనుగోలు భారీగా పెరిగింది. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, గుంతకల్లుతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైతులు విండ్‌పవర్ కంపెనీలకు భూములను విక్రయిస్తున్నారు. ఇది కూడా సాగు విస్తీర్ణం తగ్గేందుకు కారణం. అటవీ ప్రాంతాల్లో పంటసాగు చేస్తే పందులు, జింకల బెడద తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఏటా పంటసాగుకు ఉపక్రమిస్తున్నా రైతులను నష్టాలు వెక్కిరిస్తున్నాయి. పెట్టుబడి కోసం చేసిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత 187 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు అంతా వేరుశనగ సాగు చేసే రైతులే. దీంతో వేరుశనగ సాగుపై రైతుల్లో కూడా ఆసక్తి తగ్గినట్లు కన్పిస్తోంది. పండ్ల తోటలతో పాటు పత్తి, కంది, పెసర లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు.
గత ఏడేళ్లలో వర్షపాతం వివరాలు ఇలా..
––––––––––––––––––––––––––––––––
సంవత్సరం వర్షపాతం(మిల్లీమీటర్లలో) భూగర్భ జలమట్టం(మీటర్లలో)
––––––––––––––––––––––––––––––––––––
2009–10 615.6 13.04
2010–11 722.4 12.01
2011–12 495.4 14.65
2012–13 455.6 16.23
2013–14 538.7 18.59
2014–15 404.3 21.87
2015–16 503 22.32
2016–17 284 23.50
––––––––––––––––––––––––––––––––––––
ఏడేళ్లుగా అనంతపురం జిల్లాలో ఖరీఫ్ పంట నష్టం(అధికారిక లెక్కల ప్రకారం):
–––––––––––––––––––––––––––––––––––
సంవత్సరం పంట నష్టం(రూ.కోట్లలో)
–––––––––––––––––––––––––––––––––––––––
2009 2,150
2010 2,300
2011 1,950
2012 2,225
2013 2,650
2014 3,100
2015 3,400
2016 3,700