ఫాస్ట్ ఫుడ్ పోటీల్లో అందాల భామ!
గ్లామర్ ప్రపంచంలో... అందాల భామలు వారి వారి శరీరారోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంటారు. ఏది పడితే అది తినకపోగా... ఫాస్ట్ ఫుడ్‌కు మరీ దూరంగా ఉంటారు. కానీ ఆ సుందరి అభిరుచులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఒకప్పుడు మిస్ ఎర్త్ న్యూజిలాండ్ పోటీలలో పాల్గొన్న నేలా జిస్సెర్ అనే అమ్మాయి.. ఇటీవల ఓ ఫాస్ట్ ఫుడ్ పోటీలో పాల్గొని కేవలం వంద సెకన్లలో ఏకంగా 27 కప్పుల వేరుశనగ వెన్నను లాగించేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది.
23 ఏళ్ల జిస్సెర్.. కావడానికి గ్లామర్ గాళ్ అయినా తినడం మొదలుపెడితే మాత్రం ఆమెను తలదన్నేవారే ఉండరట. ఆమెకు ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నో పోటీల్లో పాల్గొని తనదైన శైలిలో రకరకాల ఆహార పదార్థాలను అలవోకగా లాగించేసి కప్పులు కొట్టేసింది. అందులో భాగంగానే తాజాగా 2,970 కాలరీస్ కలిగిన 27 కప్పుల పీనట్ బటర్‌ను వంద సెకన్లలో.. మధ్య మధ్యలో కాసిన్ని పాలు తాగుతూ లాగించింది. మోడల్స్ సాధారణంగా చాక్లెట్ ట్రీట్స్కు దూరంగా ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎక్కడ పోటీ జరిగినా వదలకుండా... తన ప్రతాపం చూపిస్తుంటుంది. ఈసారి నిజానికి 35 కప్పుల పీనట్ బట్టర్ తినాలని ప్లాన్ చేసిన జిస్సర్.. వంద సెకన్లలో 27 కప్పులను మాత్రమే పూర్తి చేయగలిగింది. ఆమె మరింత వేగంగా తినేందుకు వెనుక నృత్య, సంగీతాలతో ప్రోత్సాహాన్ని కూడా అందించారు. అయితే ఆమె.. ఎక్కువ నములుతూ తినడం వల్ల సమయం వేగంగా గడిచిపోయింది. వంద సెకన్లు పూర్తయ్యేసరికి మొత్తం 27 ప్యాకెట్లు తినగలిగింది.
న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో జన్మించిన జిస్సర్.. పదహారేళ్ల ప్రాయంలోనే లోకల్ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. తన కెరీర్ ను కొనసాగించేందుకు ఆమె 18 ఏళ్ల వయసులో ఆక్లాండ్‌కు తరలి వెళ్లింది. 2013 లో మిస్ ఎర్త్ న్యూజిల్యాండ్ పోటీలలో పాల్గొంది. ''నిజానికి మోడల్స్ సాధారణంగా ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలకు ప్రాధ్యాన్యం ఇస్తూ, తెరవెనుక ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. అలా ఉండటం నాకు నచ్చదు. నేను 20/80ని నమ్ముతూ... 80 శాతం సమయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఫిట్‌గా ఉండేందుకు కృషి చేస్తుంటాను'' అంటుంది జిస్సర్.