Dr Br Ambedkar university
-
యువత జాతి సంపద
–బీఆర్ఏయూ రిజిస్ట్రార్ తులసీరావు ఎచ్చెర్ల: యువత జాతి సంపదగా డాక్టర్ బీఆర్ అండ్కేర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు పేర్కొన్నారు. ఎచ్చెర్ల సాంకేతిక శిక్షణ కేంద్రంలో నెహ్రూయువ కేంద్రం అధ్వర్యంలో వారంరోజులుగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జాతీయ యువ వలంటీర్లకు నిర్వహించిన పునశ్చరణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజానికి ఉత్తమ మానవ వనరులు అవసరమన్నారు. నెపుణ్యంగల యువతతోనే దేశప్రగతి సాధ్యమవుతుందన్నారు. యువతలో చిత్తశుద్ధి, పనిపట్ల అంకిత భావం, పట్టుదల, వ్యక్తిగత క్రమశిక్షణ, లక్ష్యం ఉండాలని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో సైతం యువత పాత్ర కీలకమన్నారు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే యువత ముందుండి గ్రామాన్ని నడిపించాలన్నారు. మద్యంకు దూరంగా ఉండాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ కేవీ రమణ, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ జయదేవ్, రాంప్రసాద్, ప్రణాంకుమార్ సింగ్, కె.సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రిలే దీక్షలు
ఎచ్చెర్ల : ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం సాగిస్తామని వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నేతలు స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ కాంట్రాక్టు అధ్యాపకులు చేపడుతున్న రిలే దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో యూజీసీ నిబంధనల అమలు, స్క్రీనింగ్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ దీక్షల్లో డాక్టర్ జేకేఎల్ సుజాత, డాక్టర్ కూన అచ్యుతరావు, రాంజీనాయక్, డాక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. -
నేటి నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాలు
హైదరాబాద్, న్యూస్లైన్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ కోర్సులో ప్రవేశాలు మంగళవారం నుంచి మొదలవుతాయని విశ్వ విద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులో చేరదలిచిన అభ్యర్థులు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందనీ, 2010 నుంచి 2013 వరకు విశ్వ విద్యాలయాలు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు కూడా 2014-15 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. దీంతో పాటుగా ఇంటర్మీడియెట్, సమానమైన విద్యార్హత గలవారు నేషనల్ ఓపెన్ స్కూలు, ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీ కోర్సులో పాస్ అయిన విద్యార్థులు కూడా డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ఏదైనా ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సమస్యలు ఎదురైనా 7382929570, 7382929580 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.