మాట్లాడుతున్న ప్రొఫెసర్ తులసీరావు s
–బీఆర్‌ఏయూ రిజిస్ట్రార్ తులసీరావు
ఎచ్చెర్ల: యువత జాతి సంపదగా డాక్టర్ బీఆర్ అండ్కేర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు పేర్కొన్నారు. ఎచ్చెర్ల సాంకేతిక శిక్షణ కేంద్రంలో నెహ్రూయువ కేంద్రం అధ్వర్యంలో వారంరోజులుగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జాతీయ యువ వలంటీర్లకు నిర్వహించిన పునశ్చరణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజానికి ఉత్తమ మానవ వనరులు అవసరమన్నారు.
నెపుణ్యంగల యువతతోనే దేశప్రగతి సాధ్యమవుతుందన్నారు. యువతలో చిత్తశుద్ధి, పనిపట్ల అంకిత భావం, పట్టుదల, వ్యక్తిగత క్రమశిక్షణ, లక్ష్యం ఉండాలని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో సైతం యువత పాత్ర కీలకమన్నారు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే యువత ముందుండి గ్రామాన్ని నడిపించాలన్నారు. మద్యంకు దూరంగా ఉండాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ కేవీ రమణ, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ జయదేవ్, రాంప్రసాద్, ప్రణాంకుమార్ సింగ్, కె.సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.