సయాటికా (గుద్రసీ వాతము)
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవితం చాలా యాంత్రికంగా మారిపోయింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్న విపర్యయం (పగటి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాలలో అనేక మార్పులు రావటం వలన. ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల వలన మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది (నడుమునొప్పి) కటిశూల. నూటికి 90 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేదశాస్త్రంలో చరక, నూశ్రత, వాగ్భటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటికా)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు.
దీనికి సాధారణ కారణాలు పరిశీలించి చూసినట్లయితే...
ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చోవడం, స్థూలకాయం, అధికశ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయటం, అధిక బరువులను మోయటం, ఎక్కువదూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన, కొన్ని వంశపారంపర్య వ్యాధుల వలన, మరికొన్ని రోడ్డు ప్రమాదాల వలన ఈ నడుమునొప్పి సమస్య వస్తుంటుంది.
ముఖ్యంగా పైన వివరించిన కారణాల వలన శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే గుద్రసీ వాతము (సయాటికా) అని అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది.
ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఎల్4-ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూసల మధ్యగల సయాటికా అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది.
ఆయుర్వేద చికిత్స
ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో
1. శమన చికిత్స.
2. శోధన చికిత్స.
శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదనను నివారించే ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి.
శోధన చికిత్స: శమన చికిత్స వలన ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగపెట్టవచ్చు. అందుకే ఆయుర్వేదంలో పంచకర్మ అనే ఒక ప్రత్యేక చికిత్సాపద్ధతి ఉంది. ఈ చికిత్సా పద్ధతి ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు.
1. స్నేహకర్మ: ఈ ప్రక్రియ ద్వారా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి, తద్వారా జాయింట్స్‌లో కదలికలను తేలికగా చేయవచ్చును.
2. స్వేదకర్మ: ఈ పద్ధతిలో గట్టిగా అతుక్కొని ఉండే జాయింట్స్‌ను మృదువుగా అయ్యేటట్లు చేయవచ్చును.
కటివస్తి: ఈ పద్ధతి ఈ వ్యాధిలో అతి విశిష్టతను సంతరించుకున్నది. ఈ ప్రక్రియ ద్వారా అరిగిపోయిన మృదులాస్థికి రక్తప్రసరణను పెంచి తద్వారా నొప్పి తీవ్రతను తగ్గించవచ్చును. అలాగే సర్వాంగధార, వస్తికర్మ అనే విశిష్ట చికిత్సా పద్ధతుల ద్వారా నాడీ కణాలలో కలిగిన లోపాలను సరిచేయవచ్చు. అదేవిధంగా ప్రకోపించిన వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు.
జాగ్రత్తలు: సరి అయిన పోషక ఆహారాలు తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీమళ్లీ చేయకుండా జాగ్రత్త పాటించినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చు.
డిస్క్‌లో వచ్చే మార్పులు
ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగిపోవటం అనే సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది.
డిస్క్‌లో వాపు వస్తే దానిలో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి కలిగించటం వల్ల నొప్పి వస్తుంది.
లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంటతో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనది అయితే స్పర్శహాని కూడా కలుగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. కావున ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చు.
డాక్టర్ హనుమంతరావు
ఎం.డి (ఆయుర్వేద),
స్టార్ ఆయుర్వేద,
సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
ph: 9908911199 / 9959911466