Dr. K. Sudhir Reddy
-
కాల్షియం తీసుకుంటున్నా... ఎందుకిలా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. ఐదేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. అయితే రుతుక్రమం తగ్గిన వాళ్లు... జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని చదివాను. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. పదిరోజుల కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టియోపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది? - నీరజ, కొత్తగూడెం క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. ఇక ముందుగా మీకు స్పష్టం చేయాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయడం జరగదు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,హైదరాబాద్ -
హైహెల్!
నాగరకతకు ప్రతీకగా భావించి అనుసరించే తప్పుడు వేషధారణలో ముఖ్యమైనది హైహీల్స్. అందం కోసం, పదిమందిలో ప్రత్యేకత కోసం ధరించే ఈ పాదరక్షలు... పాదాన్ని రక్షించడానికి బదులు, సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల పూర్తి శరీరానికే హాని చేస్తున్నాయి. హైహీల్స్‌ను ఎలా ధరించాలి, ఎంతవరకు ధరించాలో తెలుసుకుందాం. హైహీల్స్‌ను ఎందుకు తొడుగుతారు? నిటారుగా కనిపించేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. హైహీల్స్ తొడిగిన వారిలో మడమలు మరింత ఎత్తుకు వెళ్లేసరికి పృష్టభాగం కాస్త వెనక్కువస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మరింత నిటారుగా నిలబడతారు. ఇలా నిటారుగా ఉండటం వల్ల అందం ఇనుమడించినట్టయ్యి, ఎదుటివారికి ఆత్మవిశ్వాసంతోనూ కనిపిస్తున్నట్లుగా అవుతుంది. అందుకే ఈ హైహీల్. కానీ పరిమితికి మించిన హీల్ వల్ల దీర్ఘకాలంలో పాదాలకూ, పాదాల్లోని కండరాలకూ, వెన్నుకూ జరిగే నష్టాలే ఎక్కవ. చాలాకాలం పాటు హీల్స్ వేస్తే...? హైహీల్స్ వాడటం వల్ల కండరాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేం. దాంతో కాలి కండరాలు తేలిగ్గా అలసిపోతాయి. కొద్ది శ్రమకే ఎక్కువ అలసిపోయే ఫలితం హైహీల్స్ వల్ల కనిపిస్తుంది. ఇదే ప్రక్రియ దీర్ఘకాలం సాగితే కండరాల్లో స్ట్రెయిన్ ఇంజరీస్ అనే గాయాలు అవుతాయి. కండరం అదేపనిగా గాయపడటం వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కటొక్కటిగా అనేక అనర్థాలు... : ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ నడిచే సమయంలో ఒక క్రమత్వాన్ని పాటిస్తుంటుంది. దాన్నే గెయిట్ అంటారు. మనుషులకూ ఈ గెయిట్ ఉంటుంది. హీల్ వల్ల మడమ పైకి లేచి ఉంటుంది కాబట్టి మహిళలు మునివేళ్లతోనే ఎక్కువ పుష్ చేయాల్సి ఉంటుంది. అలా పుష్ చేస్తున్నకొద్దీ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి తుంటి భాగంలో ఉండే ‘హిప్ ఫ్లెక్సార్ కండరాలు’ అవసరమైనదానిక కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో హిప్ ఫ్లెక్సార్ కండరాలపై చాలా బరువు పడుతుంది. బ్యాలెన్స్: పాయింటెడ్ హీల్పై నిలబడటాన్ని ఎంతగా ప్రాక్టీస్ చేస్తే వారు అంత నాగరికులని లెక్క. కానీ జరగబోయే అనర్థాన్ని మహిళలు గుర్తించడం లేదు. ఇలా చేయడం వల్ల మన పాదం, చీలమండ బయటివైపునకు (స్యూపినేటెడ్) కదులుతాయి. ఫలితంగా బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు మరింత పెరుగుతాయి. బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు పెరిగినకొద్దీ పడటం, గాయపడటం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. వెన్ను సున్నమవ్వడం ఖాయం: మన వీపు ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ ఆకృతిలో ఉంటుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగం (లంబార్) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఛాతీకి వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ తమ స్వాభావికమైన ఒంపును కోల్పోయి సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా ఒక కర్రలా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. హిప్ (తుంటి భాగం)లో: మన తుంటి భాగంలో ఉండే హిప్ ఫ్లెక్సార్ కండరాలు తొడల పై భాగంలో వెనకవైపున ఉంటాయి. మనను ముందుకు నడిచేలా చేసే కండరాలు ఇవే. హైహీల్స్ కారణంగా వీటిలో ఉండాల్సినంత బలం లోపించడంతో సమర్థంగా నడిపించలేవు. పైగా హైహీల్స్ వల్ల అవి పొట్టిగా మారడమే కాకుండా... కంట్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. (మనకు ఏదైనా కండరం కాలినప్పుడు లోపల కదుము కట్టినట్లుగా బిగుతుగా మారి చర్మం నుంచి బయటకు కనిపించే భాగాన్ని కంట్రాక్చర్స్ అంటారు. కాలడం అన్నమాటను ఉదాహరణకు చెప్పినదే. కాలకపోయినా సరే కంట్రాక్చర్స్ వస్తాయి). మోకాళ్లు (నీస్): హైహీల్స్ వల్ల మహిళల్లో మోకాళ్లకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ. హైహీల్స్ తొడిగినప్పుడు మోకాళ్లు ఒంగాల్సి (ఫ్లెక్స్‌డ్) వస్తుంది. ఇది మోకాళ్లలో లోపలివైపునకు ఒత్తిడిని (ఇన్వర్డ్ ఫోర్స్) వృద్ధి చేస్తుంది. దాంతో మోకాలిలోపలి భాగంలో అరుగుదల కనిపించి ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమవుతుంది. చీలమండ (యాంకిల్): హైహీల్స్ వల్ల చీలమండ భాగంలోని యాంకిల్ జాయింట్ కదలికలు చాలా తగ్గిపోతాయి. దాంతో పిక్క కండరాలు (కాఫ్ మజిల్స్) పొట్టిగా మారతాయి. మడమ ఎముక (క్యాల్కేనియస్)పై ఒత్తిడి పడుతుంది. ఈ మొత్తం ప్రయత్నం వల్ల ‘ఇన్సెర్షనల్ ఎకిలిస్ టెండనైటిస్’ అనే ఒక రుగ్మత రావచ్చు. పాదం (ఫీట్): మామూలుగా పాదం నేలకు ఆనించి ఉన్నప్పటి కంటే... హీల్ పెరుగుతున్న కొద్దీ కాలి ముందు భాగంలో ఉండే ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కాలి నొప్పి, పాదం నిర్మాణంలో మార్పులు, హ్యామర్ టో, బునియోనెటీస్ వంటి కాలి వ్యాధులు, న్యూరోమా వంటి కండిషన్స్ అభివృద్ధి చెందవచ్చు. హైహీల్స్ వాడేవారికి టిప్స్: హైహీల్స్ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్‌లా చేయండి. వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ కోసం అటూ ఇటూ పరుగెత్తి ఆ తర్వాత హైహీల్స్ వేసుకోండి. రోజంతా హైహీల్స్ వేసుకోకండి. మధ్యాహ్నం లేదా సాయంత్రాలే ధరించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీ పాదల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. హై హీల్స్ ధరించడానికి అనుకూలం మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. అలాగని పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే పాదరక్షలూ వద్దు. కాస్తంత మాత్రమే హీల్ ఉండే (లో హీల్) పాదరక్షలను ఎంచుకోండి. మీ మడమ వెడల్పు ఎంతో చూడండి. దానితో పోలిస్తే మీ మడమ ఎత్తు అందులో సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి. మీ హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి. మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థితి కూడా రావచ్చని గుర్తుంచుకోండి. హైహీల్స్ తొడిగాలనే కోరిక ఉంటే కొద్దికొద్దిగా హీల్‌ను పెంచుకోండి తప్ప... ఒకేసారి ఎక్కువ ఎత్తున్న హైహీల్స్ వేసుకోవద్దు. మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ను చేయండి. హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. డాక్టర్ కె. సుధీర్ రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
పిక్క మన రెండో గుండె!
ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకుందాం రండి. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. కానీ... కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపునకు అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు. ఇక భాషాశాస్త్రానికి వద్దాం. గుండెబలం అంటే ఇప్పటివరకూ అర్థం మనోబలం. కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. కానీ పిక్క గురించీ, గుండెలా అది నెరవేర్చే విధుల గురించీ వాస్తవం తెలిశాక పిక్కబలమూ ఇంచుమించూ గుండెబలంతో సమానమని మీకు వేరే చెప్పాలా? పిక్కకు ఎందుకీ గుండె డ్యూటీలు...? మన పిక్కను చూడండి. కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా అనిపించదూ? అనిపించడం ఏమిటి, అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. కారణం... గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకుపోవాలి. అలా చేసేందుకు పిక్క ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. పిక్క గుండె డ్యూటీలెలా చేస్తుందంటే... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) సహయంతో మూసుకుపోతూ పైవైపునకే రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి. ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే... మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి. ఈ సమస్య ఎవరెవరిలో ఎక్కువ? చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి (ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా కదలకుండా ఇంటిపట్టునే ఉండేవారికి)ఎక్కువసేపు అదేపనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు మొదలైనవారికి) స్థూలకాయంతో బాధపడేవారికి గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు. సమస్యను అధిగమించడానికి చేయాల్సిందేమిటి? {Mమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది).మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి. (స్థూలకాయాన్ని తగ్గించుకోండి).మీ కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి వేసేలా వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి. ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి. పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలివే... కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడంమనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావడంచెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఏర్పడే పరిణామాలివే...కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపువేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం)కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటంకాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటంకాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్) డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్