కాల్షియం తీసుకుంటున్నా... ఎందుకిలా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. ఐదేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. అయితే రుతుక్రమం తగ్గిన వాళ్లు... జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని చదివాను. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. పదిరోజుల కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టియోపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది?
- నీరజ, కొత్తగూడెం
క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి.
వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు.
ఇక ముందుగా మీకు స్పష్టం చేయాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయడం జరగదు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,హైదరాబాద్