హైహెల్! | High heels | Sakshi
Sakshi News home page

హైహెల్!

Published Wed, May 20 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

హైహెల్!

హైహెల్!

నాగరకతకు ప్రతీకగా భావించి అనుసరించే తప్పుడు వేషధారణలో ముఖ్యమైనది హైహీల్స్. అందం కోసం, పదిమందిలో ప్రత్యేకత కోసం ధరించే ఈ పాదరక్షలు... పాదాన్ని రక్షించడానికి బదులు, సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల పూర్తి శరీరానికే హాని చేస్తున్నాయి.  హైహీల్స్‌ను ఎలా ధరించాలి, ఎంతవరకు ధరించాలో తెలుసుకుందాం.
 
హైహీల్స్‌ను ఎందుకు తొడుగుతారు? నిటారుగా కనిపించేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. హైహీల్స్ తొడిగిన వారిలో మడమలు మరింత ఎత్తుకు వెళ్లేసరికి పృష్టభాగం కాస్త వెనక్కువస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మరింత నిటారుగా నిలబడతారు. ఇలా నిటారుగా ఉండటం వల్ల అందం ఇనుమడించినట్టయ్యి, ఎదుటివారికి ఆత్మవిశ్వాసంతోనూ కనిపిస్తున్నట్లుగా అవుతుంది. అందుకే ఈ హైహీల్. కానీ పరిమితికి మించిన హీల్ వల్ల దీర్ఘకాలంలో పాదాలకూ, పాదాల్లోని కండరాలకూ, వెన్నుకూ జరిగే నష్టాలే ఎక్కవ.
 
చాలాకాలం పాటు హీల్స్ వేస్తే...?

హైహీల్స్ వాడటం వల్ల కండరాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేం. దాంతో కాలి కండరాలు తేలిగ్గా అలసిపోతాయి. కొద్ది శ్రమకే ఎక్కువ అలసిపోయే ఫలితం హైహీల్స్ వల్ల కనిపిస్తుంది. ఇదే ప్రక్రియ దీర్ఘకాలం సాగితే కండరాల్లో స్ట్రెయిన్ ఇంజరీస్ అనే గాయాలు అవుతాయి. కండరం అదేపనిగా గాయపడటం వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉంది.

ఒక్కటొక్కటిగా అనేక అనర్థాలు... : ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ నడిచే సమయంలో ఒక క్రమత్వాన్ని పాటిస్తుంటుంది. దాన్నే గెయిట్ అంటారు. మనుషులకూ ఈ గెయిట్ ఉంటుంది. హీల్ వల్ల మడమ పైకి లేచి ఉంటుంది కాబట్టి మహిళలు మునివేళ్లతోనే ఎక్కువ పుష్ చేయాల్సి ఉంటుంది. అలా పుష్ చేస్తున్నకొద్దీ మిమ్మల్ని ముందుకు నడిపించడానికి తుంటి భాగంలో ఉండే ‘హిప్ ఫ్లెక్సార్ కండరాలు’ అవసరమైనదానిక కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో హిప్ ఫ్లెక్సార్ కండరాలపై చాలా బరువు పడుతుంది.
 బ్యాలెన్స్: పాయింటెడ్ హీల్‌పై నిలబడటాన్ని ఎంతగా ప్రాక్టీస్ చేస్తే వారు అంత నాగరికులని లెక్క. కానీ జరగబోయే అనర్థాన్ని మహిళలు గుర్తించడం లేదు. ఇలా చేయడం వల్ల  మన పాదం, చీలమండ బయటివైపునకు (స్యూపినేటెడ్) కదులుతాయి. ఫలితంగా బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు మరింత పెరుగుతాయి. బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు పెరిగినకొద్దీ పడటం, గాయపడటం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ.

వెన్ను సున్నమవ్వడం ఖాయం: మన వీపు ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ ఆకృతిలో  ఉంటుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగం (లంబార్) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక  ఛాతీకి వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ తమ స్వాభావికమైన ఒంపును కోల్పోయి సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా ఒక కర్రలా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్‌మెంట్‌లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది.

హిప్ (తుంటి భాగం)లో: మన తుంటి భాగంలో ఉండే హిప్ ఫ్లెక్సార్ కండరాలు తొడల పై భాగంలో వెనకవైపున ఉంటాయి. మనను ముందుకు నడిచేలా చేసే కండరాలు ఇవే. హైహీల్స్ కారణంగా వీటిలో ఉండాల్సినంత బలం లోపించడంతో సమర్థంగా నడిపించలేవు. పైగా హైహీల్స్ వల్ల అవి పొట్టిగా మారడమే కాకుండా...  కంట్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. (మనకు ఏదైనా కండరం కాలినప్పుడు లోపల కదుము కట్టినట్లుగా బిగుతుగా మారి చర్మం నుంచి బయటకు కనిపించే భాగాన్ని కంట్రాక్చర్స్ అంటారు. కాలడం అన్నమాటను ఉదాహరణకు చెప్పినదే. కాలకపోయినా సరే కంట్రాక్చర్స్ వస్తాయి).  

మోకాళ్లు (నీస్): హైహీల్స్ వల్ల మహిళల్లో మోకాళ్లకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ. హైహీల్స్ తొడిగినప్పుడు మోకాళ్లు ఒంగాల్సి (ఫ్లెక్స్‌డ్) వస్తుంది. ఇది మోకాళ్లలో లోపలివైపునకు ఒత్తిడిని (ఇన్‌వర్డ్ ఫోర్స్) వృద్ధి చేస్తుంది. దాంతో మోకాలిలోపలి భాగంలో అరుగుదల కనిపించి ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమవుతుంది.

చీలమండ (యాంకిల్): హైహీల్స్ వల్ల చీలమండ భాగంలోని యాంకిల్ జాయింట్ కదలికలు చాలా తగ్గిపోతాయి. దాంతో పిక్క కండరాలు (కాఫ్ మజిల్స్) పొట్టిగా మారతాయి. మడమ ఎముక (క్యాల్కేనియస్)పై ఒత్తిడి పడుతుంది. ఈ మొత్తం ప్రయత్నం వల్ల ‘ఇన్‌సెర్షనల్ ఎకిలిస్ టెండనైటిస్’ అనే ఒక రుగ్మత రావచ్చు.

పాదం (ఫీట్): మామూలుగా పాదం నేలకు ఆనించి ఉన్నప్పటి కంటే... హీల్ పెరుగుతున్న కొద్దీ కాలి ముందు భాగంలో ఉండే ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది.  దీనివల్ల కాలి నొప్పి, పాదం నిర్మాణంలో మార్పులు, హ్యామర్ టో, బునియోనెటీస్ వంటి కాలి వ్యాధులు, న్యూరోమా వంటి కండిషన్స్ అభివృద్ధి చెందవచ్చు.
 
 
హైహీల్స్ వాడేవారికి టిప్స్:  హైహీల్స్ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్‌లా చేయండి.  వార్మింగ్ అప్ ఎక్సర్‌సైజ్ కోసం అటూ ఇటూ పరుగెత్తి ఆ తర్వాత హైహీల్స్ వేసుకోండి.  రోజంతా హైహీల్స్ వేసుకోకండి.  మధ్యాహ్నం లేదా సాయంత్రాలే ధరించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో మీ పాదల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. హై హీల్స్ ధరించడానికి అనుకూలం   మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి.   అలాగని పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే పాదరక్షలూ వద్దు. కాస్తంత మాత్రమే హీల్ ఉండే (లో హీల్) పాదరక్షలను ఎంచుకోండి.  మీ మడమ వెడల్పు ఎంతో చూడండి. దానితో పోలిస్తే మీ మడమ ఎత్తు అందులో సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి.  మీ హైహీల్స్ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి.  మీరు హైహీల్స్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థితి కూడా రావచ్చని గుర్తుంచుకోండి.  హైహీల్స్ తొడిగాలనే కోరిక ఉంటే కొద్దికొద్దిగా హీల్‌ను పెంచుకోండి తప్ప... ఒకేసారి ఎక్కువ ఎత్తున్న హైహీల్స్ వేసుకోవద్దు.   మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి  మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌ను చేయండి.  హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి.
 
 డాక్టర్ కె. సుధీర్ రెడ్డి,
 చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
 కేపీహెచ్‌బీ, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement