కొత్త జీవితాన్నిస్తున్నకేవీఐసీ, ఎఫ్‌డీడీఐ
చెప్పులు, షూ తయారీలో 25 రోజులు ఆధునిక శిక్షణ
సొంతంగా యూనిట్లు పెట్టుకునేలా ప్రోత్సాహం
రాయదుర్గం: పురాతన పద్ధతుల్లో చెప్పులు కుడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా బతుకుతున్న చర్మకారుల జీవితాలకు కొత్త ‘కళ’ను అద్దుతోంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ). ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)తో కలిసి చర్మకారులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇచ్చి సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పుకునేందుకు చేయూతనందిస్తోంది.
ఆధునిక డిజైనింగ్‌పై శిక్షణ
చర్మకార వృత్తిని కొనసాగిస్తున్నవారితోపాటు వృత్తిని వదిలేసినా దానిపై ఆసక్తిగల వారిని కొందరిని ఎంపిక చేసి గత డిసెంబర్ 9 నుంచి ఈ జనవరి 3వ తేదీ వరకు మూడు విడతలలో 25 రోజుల పాటు రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐలో శిక్షణ ఇచ్చారు. ఆధునిక కాలానికి తగినట్లుగా చెప్పులు, షూల డిజైనింగ్.. వాటిని నాణ్యతతో తయారు చేయటంపై మెళకువలు నేర్పారు.
ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరసింహుగారి తేజ్‌లోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ అబ్దుల్ రహమాన్, చంద్రమణి, కన్వర్‌సింగ్, ఇళయరాజా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. షూ తయారీలో శుద్ధి చేసిన చర్మాన్ని కటింగ్ చేసే ప్యాటర్న్, బాటమ్ ఫిట్టింగ్, అప్పర్ మేకింగ్, స్టిచ్చింగ్ వంటి అంశాలలో అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు తయారు చేసిన ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
లిడ్‌క్యాప్‌కు పూర్వవైభవం తేవాలి
ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తూ చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ శిక్షణ పొందినవారు కోరుతున్నారు. శిక్షణ పొందినవారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణ సౌకర్యం, ఆధునిక యంత్రాలు అందించాలని విన్నవించారు. అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్)కు పూర్వవైభవం తీసుకొస్తే చర్మకారులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.
ప్రత్యేక కోర్సులతో శిక్షణ
ఎఫ్‌డీడీఐ హైదరాబాద్ క్యాంపస్‌లో నిష్ణాతులైన ఫ్యాకల్టీతో చర్మకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రత్యేక కోర్సులను నిర్వహించి వీరికి శిక్షణ అందించాం. భవిష్యత్తులో కూడా మరిన్ని శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు ఫ్యాకల్టీ సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ నరసింహుగారి తేజ్ లోహిత్‌రెడ్డి, ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
నేను టూరిజమ్‌లో పీజీ చేసి పర్యాటక శాఖలో గైడ్‌గా పనిచేసే లైసెన్స్ పొందాను. అయితే వంశపారంపర్యంగా వచ్చిన చర్మకార వృత్తిలో కొనసాగాలనుకున్న నాకు.. ఎఫ్‌డీడీఐలో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం రుణసౌకర్యం కల్పిస్తే సొంతంగా యూనిట్ పెట్టి నేను ఎదగటంతోపాటు కొంతమందికి ఉపాధి కల్పిoచాలన్నదే నా లక్ష్యం. –క్రాంతి, శిక్షణ తీసుకున్న చర్మకార కళాకారుడు, సికింద్రాబాద్
మాదాపూర్‌లో పాత చెప్పులు కుడుతూ, చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాణ్ణి. ఎఫ్‌డీడీఐ శిక్షణతో షూ కూడా తయారు చేయడం నేర్చుకున్నాను. అంతేకాదు ఏదో సాధించాలనే పట్టుదల వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన మరికొందరితో కలిసి ఒక తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పిoచాలని ఉంది. –పవన్‌కుమార్, చర్మకారుడు, మాదాపూర్
20 ఏళ్లుగా చర్మకార పనిచేస్తున్నా. సాధారణ చెప్పుల తయారీ, మరమ్మతులు, పాలిష్ వంటివి మాత్రమే చేయగలిగేవాణ్ణి. ఎఫ్‌డీడీఐలో శిక్షణ పొందాక రకరకాల డిజైన్లలో షూస్ తయారీతో పాటు కటింగ్, స్టిచ్చింగ్ చేసే స్థాయికి ఎదిగాను. ఇప్పటి తరంవారికి కూడా నచ్చేలా షూలు తయారు చేయగలననే నమ్మకం వచి్చంది. ప్రభుత్వం రుణం, యంత్రాలు అందిస్తే సొంతంగా యూనిట్ ఏర్పాటు చేసుకుంటా. ఇలాంటి శిక్షణ అందరికీ ఇస్తే మా కులవృత్తి కనుమరుగు కాకుండా ఉంటుంది. –తుకారామ్, చర్మకారుడు, ఈసీఐఎల్
Comments
Please login to add a commentAdd a comment