పిక్క మన రెండో గుండె! | Our second heart nut | Sakshi
Sakshi News home page

పిక్క మన రెండో గుండె!

Published Fri, May 15 2015 10:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

పిక్క మన రెండో గుండె!

పిక్క మన రెండో గుండె!

ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకుందాం రండి. మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. కానీ... కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపునకు అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు. ఇక భాషాశాస్త్రానికి వద్దాం. గుండెబలం అంటే ఇప్పటివరకూ అర్థం మనోబలం. కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. కానీ పిక్క గురించీ, గుండెలా అది నెరవేర్చే విధుల గురించీ వాస్తవం తెలిశాక పిక్కబలమూ ఇంచుమించూ గుండెబలంతో సమానమని మీకు వేరే చెప్పాలా?
 
పిక్కకు ఎందుకీ గుండె డ్యూటీలు...?

మన పిక్కను చూడండి. కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా అనిపించదూ? అనిపించడం ఏమిటి, అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. కారణం... గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకుపోవాలి. అలా చేసేందుకు పిక్క ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్‌పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు.

పిక్క గుండె డ్యూటీలెలా చేస్తుందంటే...

 పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) సహయంతో మూసుకుపోతూ పైవైపునకే రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి.
 
ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే...

మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి.
 
ఈ సమస్య ఎవరెవరిలో ఎక్కువ?
 
చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి (ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా కదలకుండా ఇంటిపట్టునే ఉండేవారికి)ఎక్కువసేపు అదేపనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు మొదలైనవారికి)  స్థూలకాయంతో బాధపడేవారికి గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు.
 
 సమస్యను అధిగమించడానికి చేయాల్సిందేమిటి?


{Mమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది).మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి. (స్థూలకాయాన్ని తగ్గించుకోండి).మీ కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి వేసేలా వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి. ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి.
 
 పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలివే...

కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడంమనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావడంచెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఏర్పడే పరిణామాలివే...కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపువేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం)కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటంకాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటంకాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్)
 
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
కేపీహెచ్‌బీ, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement