నేను రజనీకాంత్కన్నా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాననుకుంటాను...
పద్మశ్రీ డా. మోహన్‌బాబుకు చాలా మంచి బిరుదులున్నాయి.
కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ.
డా. మోహన్‌బాబులో చాలా మంచి పాత్రలున్నాయి.
విలన్, హీరో, ప్రొడ్యూసర్.
డా. మోహన్‌బాబు చాలా మంచి పనులు చేశారు.
రోడ్లు వేయించారు, బ్రిడ్జి నిర్మించారు, స్కూల్‌కి స్థలం ఇచ్చారు.
వీటికి మించి -డా. మోహన్‌బాబు వేరే పేర్లనూ మూటగట్టుకున్నారు.
కోపిష్టి! అహంకారి! నోటి దురుసు!
ముక్కుసూటిగా ఉన్నందుకేనా ఇన్ని టైటిల్స్? అంటే...
భయపడుతూ బతకడంకన్నా ఇలా ఉండడమే తనకిష్టం అంటున్నారు.
వివరాలు ఈవారం ‘తారాంతరంగం’లో...
38ఏళ్ల సుదీర్ఘ నటజీవితం మీది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?
మోహన్‌బాబు: 1975 నవంబర్ 22న నా మొదటి సినిమా ‘స్వర్గం-నరకం’ విడుదలైంది. ఓ సాదాసీదా కుటుంబం నుంచి పొట్ట చేత్తో పట్టుకుని సినిమా పరిశ్రమకు వచ్చినవాణ్ణి. మొదట్లో అసిస్టెంట్ డెరైక్టర్, అసోసియేట్ డెరైక్టర్‌గా చేశాను. ఆ తర్వాత ప్రతినాయకుడు, కథానాయకుడు, సహాయ నటుడు.. ఇలా ఇప్పటివరకు 550 చిత్రాలకు పైగా నటించాను. 58 చిత్రాలకు పైగా నిర్మించాను. ఇన్ని సినిమాలు నిర్మించిన నటుణ్ణి నేనే. ‘పద్మశ్రీ’ బిరుదు వచ్చింది. ఎంపీగా చేశాను. నా బిడ్డలు ప్రయోజకులయ్యారు. అడపా దడపా ఎదురయ్యే చేదు అనుభవాల తాలూకు బాధ మినహా నా జీవితం సంతృప్తికరంగా ఉంది.
ఓసారి మీ చిన్ననాటి జీవితం గురించి చెబుతారా?
మోహన్‌బాబు: తిరుపతికీ కాళహస్తికి మధ్యలో ఉండే ‘మోదుగులపాళెం’ మా ఊరు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అమ్మానాన్నలకు మేం మొత్తం ఐదుగురు సంతానం. నలుగురు కొడుకులు, ఓ కూతురు. అప్పట్లో మా గ్రామానికి సరైన రోడ్లు, బస్సులు ఉండేవి కాదు. మోదుగులపాళెం చుట్టుపక్కన ఉన్న రెండు, మూడు గ్రామాలకు నాన్నగార్ని ట్రాన్స్ఫర్ చేస్తుండేవాళ్లు. ఆయన ఎక్కడకు మారితే అక్కడికి మేం మారేవాళ్లం. ఆయనతో పాటే స్కూల్‌కెళ్లడం, ఇంటికి రావడం. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు, దారిలో లెక్కలు అడిగేవారు. ఒకవేళ కరెక్ట్‌గా చెప్పకపోతే, చేతిలో ఉన్న గొడుగుతో కొట్టేవారు. గొడుగు లేనప్పుడు పక్కనే ఉన్న చెట్టెక్కి, ఒక కానుగ కొమ్మ తీసి... కాళ్ల మీద కొట్టేవారు. అప్పుడు ‘నిక్కర్లు’ వేసుకునేవాణ్ణి. అందుకని దెబ్బ చురుక్మని తగిలేది. ఏర్పేడు, పాపానాయుడుపేట, తిరుపతి.. ఇలా చాలా స్కూల్స్‌లో చదివాను. పాపానాయుడుపేట మా ఊరి నుంచి అడ్డదారిలో వెళితే ఆరు కిలోమీటర్ల పైనే ఉండేది. కాలి నడకనే రాకపోకలు. అందుకే ఆ ఊళ్లో క్రిస్టియన్ మాస్టర్ ఇజ్రాయల్గారిని రిక్వెస్ట్ చేసి, ఆయన ఇంట్లో ఉండే ఏర్పాటు చేశారు మా నాన్నగారు. ఏడాదిపాటు ఆయన ఇంట్లో ఉండి చదువుకున్నాను. నాన్న చాలా స్ట్రిక్ట్. ఉదయం ఐదు గంటలకు పొలం దగ్గరికెళ్లి, పనులు చూసుకుని, ఇంటికొచ్చి స్కూల్‌కి రెడీ అయ్యి వెళ్లేవారు.
మీకు ఎన్ని ఎకరాల పొలం ఉండేది?
మోహన్‌బాబు: మూడున్నరో నాలుగన్నర ఎకరాలో ఉండేది. మాది దాదాపు దిగువ మధ్య తరగతి కుటుంబం. నేనూ టీచర్ అయితే, ఆ ఉద్యోగం, వ్యవసాయం చూసుకుంటే హాయిగా జీవితం గడిచిపోతుందన్నది నాన్నగారి ఆలోచన.
మీరు పొలం పనులు చేసేవారా?
మోహన్‌బాబు: నాగలి దున్నాను. మా చిత్తూరు సైడ్ నాగలిని మడక అంటాం. మాకు రెండు, మూడు ఆవులు, నాలుగు ఎద్దులు, రెండు, మూడు పొట్టేళ్లుండేవి. వాటిని మేపేవాణ్ణి.
చిన్నప్పుడు ఎలా ఉండేవారు?
మోహన్‌బాబు: పొగరుబోతుని, ఆవేశపరుణ్ణి. ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు నాతో ప్రేమగా ఉంటే నేనూ ప్రేమగా ఉండేవాణ్ణి. అంతేకానీ, వాళ్ల డబ్బుకి దాసోహం అనలేదు. మంచి మనిషి అయితే పాదానికి నమస్కారం చేస్తాను. కానీ, అహంకారి అయితే నేను డోంట్ కేర్!
చిన్నప్పడు బాగా చదివేవారా?
మోహన్‌బాబు: బ్యాడ్ స్టూడెంట్‌ని కాదు. అలాగని వెరీ గుడ్ స్టూడెంట్‌నీ కాదు. అల్లరి చేసేవాణ్ణి కాదు. క్లాసులు ఎగ్గొట్టి, రోడ్ల మీద తిరగాలనే ఉద్దేశం ఉండేది కాదు. నాకు సిగరెట్ తాగడం, అమ్మాయిలకు సైట్ కొట్టడంలాంటి అలవాట్లేవీ ఉండేవి కావు.
నటన మీద ఆసక్తి ఎప్పుడు మొదలైంది?
మోహన్‌బాబు: నాన్నగారు వీధి నాటకాలు ఆడేవారు. ‘సత్యహరిశ్చంద్ర’లో నక్షత్రకుడి వేషానికి ఆయన పాపులర్. ‘అయ్యోరిని పిలవండి’ అని నాన్నను పిలిచి మరీ, నాటకాలు వేయించేవాళ్లు. ఆ విధంగా నాకు ‘నటన’ మీద చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది.
సినిమాల్లో యాక్ట్ చేయాలని ఎప్పుడు ప్రయత్నించారు?
మోహన్‌బాబు: ఎస్ఎస్ఎల్సీ చదువుతున్నప్పుడు ‘సినిమా నటులు కావాలంటే ఫొటోలు, వంద రూపాయలు పంపవలెను’ అనే పేపర్ ప్రకటన చూసి, ఫొటోలు పంపించాను. అయితే డబ్బులు మాత్రం పంపలేదు. అందుకేనేమో సమాధానం రాలేదు. ఆ తర్వాత మళ్లీ అలాంటి యాడ్ వస్తే, మా నాన్నగారి ప్రోత్సాహంతో వంద రూపాయలు, ఫొటోలు పంపించాను. రెండూ పోయాయి. అంతా మోసం అని తర్వాత తెలిసింది.
ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపు అడుగులు ఎప్పుడు వేశారు?
మోహన్‌బాబు: ఎస్ఎస్ఎల్సీ పాసయిన తర్వాత, నాన్నగారితో చెప్పి, మద్రాసు వైఎంసీ కాలేజ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్‌కి చేరాను. అక్కడ సీటు దొరకాలంటే చాలా కష్టం. పైగా, నాకు స్పోర్ట్స్‌లో పెద్దగా నాలెడ్జ్ లేదు. ఓ ముస్లిమ్ సోదరుడు, ఓ క్రిస్టియన్ మాస్టార్ యాషీర్ సిఫార్సు మీద సీటు వచ్చింది. నాన్నగారు డబ్బులు పంపడానికి చాలా ఇబ్బందులు పడేవారు. అసలు నేను మద్రాసు వెళ్లడానికి కారణం సినిమాల్లో నటించాలని. కాలేజ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ, సాయంత్రం టీనగర్‌లోని పానగల్ పార్క్‌కి వెళ్లి, అక్కడకొచ్చే సినిమా తారలను చూసేవాణ్ణి.
సినిమా హీరోల్లో మీకెవరంటే ఇష్టం ఉండేది?
మోహన్‌బాబు: నాకు మొదట్నుంచీ ఎన్టీ రామారావుగారంటే ప్రాణం. ఆ తర్వాత నాగేశ్వరరావుగారు. మద్రాసు వెళ్లిన తర్వాత రామారావుగార్ని ఎలాగైనా చూడాలనుకున్నాను. బజుల్లా రోడ్‌లోని ఇంట్లో రామారావుగారు ప్రతిరోజూ ఉదయం దర్శనమిస్తారని ఎవరో చెప్పగా విని, ఓ ఆదివారం పొద్దున్నే ఐదు గంటలకల్లా గేటు ముందు నిలబడ్డాను. ఆ తర్వాత టూరిస్ట్ బస్సులన్నీ వచ్చాయి. రామారావుగారు బయటికొచ్చి, అందర్నీ చూసి నమస్కారం చేశారు. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.
కాలేజీలో శిక్షణ పూర్తయ్యాక ఏం చేశారు?
మోహన్‌బాబు: ఉద్యోగాల వేటలో పడ్డాను. మద్రాసులోని ఓ స్కూల్లో టీచర్ జాబ్‌కి వెళితే, ఒక కౌన్సిలర్ ఐదు వందలు లంచం అడిగాడు. నాన్నగారిని అడిగితే కష్టం అన్నారు. అయితే నా బాధ భరించలేక రూపాయిన్నర వడ్డీకి అప్పు చేసి, ఇచ్చారు. దురదృష్టం ఏంటంటే, ఆ డబ్బు తీసుకుని, ఆ కౌన్సిలర్ మోసం చేశాడు.
ఆ మోసంతో బ్యాక్ టు మోదుగులపాళెం వెళ్లిపోయారా?
మోహన్‌బాబు: లేదు. బీఆర్ రెడ్డిగారి రికమండేషన్‌తో యార్లగడ్డ వెంకన్న చౌదరి ద్వారా కేసరి హైస్కూల్లో ఉద్యోగం వచ్చింది. నెలకు 197 రూపాయలు జీతం. ఏడాది పాటు బాగానే సాగింది. అయితే నాకు ఉద్యోగం ఇప్పించిన చౌదరిగారు తప్పుకోవడంతో, కమిటీవాళ్లు నన్ను పిలిపించి, ‘నువ్వు మా కులంవాడివి కాదు’ అంటూ నన్ను తీసేశారు. ఆ సమయంలోనే సినీనటులు ప్రభాకర్‌రెడ్డిగారు, గిరిబాబు, త్యాగరాజుతో పరిచయం ఏర్పడింది. త్యాగరాజు ఇంట్లో ఆరు నెలలు ఉన్నాను. ఆయన బాగా ఆదరించారు.
ఆ తర్వాత...
మోహన్‌బాబు: ప్రభాకర్‌రెడ్డిగారి రికమండేషన్‌తో లక్ష్మీదీపక్గారు ‘కూతురు కోడలు’ సినిమాకి అప్రెంటిస్‌గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి దాసరి నారాయణరావుగారు కో-డెరైక్టర్. శోభన్‌బాబుగారు హీరో. ఆరు నెలలకు 50 రూపాయలు జీతం. ‘ఏవయ్యా.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్లు.. మధ్యలో కాఫీ, టీలు. మీ ఇళ్లల్లో ఇలాంటివి అనుభవించారా? ఇదే గొప్ప. మళ్లీ డబ్బులా... ఎక్కడ దొరుకుతారయ్యా?’ అని చిత్రనిర్మాతల్లో ఒకరు అనేవారు. అవమానంగా ఉండేది. అప్పుడు నేనో రేకుల షెడ్లో ఉండేవాణ్ణి. నెల అద్దె 35 రూపాయలు. రెండు సత్తు పాత్రలు, ఓ చాప, దిండు.. ఇవే నా ఆస్తి. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసుకుంటూనే, వేషాల కోసం ట్రై చేసేవాణ్ణి. మొదట్నుంచీ నా యాంబిషన్ ‘నంబర్‌వన్ ప్రతినాయకుడు’ అవ్వాలన్నదే!
మరి... అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఎందుకు చేశారు?
మోహన్‌బాబు: భోజనం గడుస్తుందనీ పదిమందితో పరిచయాలు అవుతాయని! మొదటి సినిమాకి ఆరు నెలలకు 50 రూపాయలిచ్చారు. రెండో సినిమాకి నెలకు 150, మూడో సినిమాకి 200, నాలుగో సినిమాకి 300 ఇచ్చారు. షూటింగ్ లేని రోజుల్లోనూ సినిమా ఆఫీసుకి ఉదయాన్నే వెళ్లిపోయేవాణ్ణి. టిఫిన్, భోజనం పెడతారని. అప్పుడే శివాజీరావ్ (రజనీకాంత్)తో పరిచయం ఏర్పడింది. బస్ కండక్టర్‌గా మానేసి, సినిమాల్లో ట్రై చేయడానికి వచ్చాడు.
రజనీకాంత్, మీరు ప్రాణస్నేహితులవ్వడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా?
మోహన్‌బాబు: కొన్ని కొన్ని విషయాలకు కారణాలు ఉండవు. నేను, వాడు ఫ్లాట్‌ఫామ్ నుంచే స్నేహితులం. కాలక్రమేణా విడదీయలేనంత స్నేహితులయ్యాం. నా చెల్లెలు లత (రజనీకాంత్ భార్య) ప్రతి సంవత్సరం నాకు రాఖీ కడుతుంది. నేను తనకు బట్టలు పెడుతుంటాను. అది మా ఆచారం.
మీరు సినిమాల్లో ట్రై చేస్తున్నారని తెలుసుకుని, మీ ఊళ్లోవాళ్లు మీ గురించి ఏమనుకునేవారు?
మోహన్‌బాబు: నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేస్తున్నప్పుడు మా నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమన్నారు. కానీ, స్వయానా మా మేనమామ, ఇతర బంధువులు నాకు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఊళ్లోవాళ్లూ అంతే. ‘వీడు సినిమా పిచ్చోడు.. ఎలా పిల్లనిస్తాం’ అనేవాళ్లు. ‘లేదండి.. మావాడు గొప్ప యాక్టర్ అవుతాడు’ అని నాన్నగారు ఎంత చెప్పినా, వినిపించుకోలేదు. వ్యవసాయం చేస్తున్న నా తమ్ముడికి పిల్లనిస్తామన్నారు. దాంతో నాకన్నా ముందు నా తమ్ముడికే పెళ్లయ్యింది. తిరుపతిలో పెళ్లి. నేనొక రాయి మీద కూర్చుని ఉంటే, నాన్నగారు ‘పెద్దోడు ఉండగా చిన్నోడికి పెళ్లి చేస్తే, పెద్దోడిలో ఏదో లోపం ఉందనుకుంటార్రా’ అంటూ భోరున ఏడ్చారు. అప్పుడు నేను ‘దిగులు పడొద్దు. నేను డెఫినెట్‌గా నంబర్‌వన్ ప్రతినాయకుడు అవుతాను’ అని చాలా పాజిటివ్‌గా చెప్పాను.
మీరెవర్నీ ప్రేమించలేదా?
మోహన్‌బాబు: టు బీ ఫ్రాంక్... నన్నెవరూ లవ్ చేయలేదు. నేనూ ఎవర్నీ ప్రేమించలేదు. పెళ్లయిన తర్వాత మా ఆవిణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమిస్తూనే ఉంటాను.
ఇంతకీ మీ పెళ్లి ఎలా కుదిరింది?
మోహన్‌బాబు: ఓ రోజు నేను ఊళ్లో నడుచుకుంటూ వెళుతుంటే, మా బంధువు ఒకాయన నన్ను చూసి, ఓ సంబంధం కుదిర్చారు. అయితే, ఆ అమ్మాయి ఎమ్మే లిటరేచర్ చదివింది. అందుకని, పెళ్లికూతురి తండ్రి దగ్గర ‘బిఎస్సీ ఫస్ట్ క్లాస్’లో పాసయ్యానని అబద్ధం చెప్పమన్నారు ఆ బంధువు. ఆ అమ్మాయికి నిజం చెప్పి, కాబోయే మామగారికి మాత్రం అబద్ధం చెప్పాను. ఎట్టకేలకు పెళ్లయ్యింది. పెళ్లయిన పదమూడు రోజులకు ‘స్వర్గం నరకం’ సినిమా కోసం దాసరిగారి దగ్గర్నుంచి నాకు పిలుపొచ్చింది. అంతకుముందు ఓ యాభైసార్లు వేషం కోసం ఆయన ఇంటికి వెళ్లుంటాను. అందుకే దాసరిగారి నుంచి పిలుపు రాగానే, వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ‘మీరు తప్పకుండా సెలక్ట్ అవుతారు’ అని నా భార్య చెప్పింది. అదే నిజమైంది. మిగతావాళ్లకి రికమండేషన్స్ ఉన్నాయి. పైగా, నామీద కోపంతో నా టెస్ట్ షూట్‌ని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ దాచేశాడు. ‘భక్త టెస్ట్ షూట్ చూశావా?’ అని పద్మగారికి దాసరిగారు ఫోన్ చేసి అడిగితే, దాచిపెట్టిన నా షూట్ బయటికొచ్చింది. అది చూసి, పద్మగారు నన్ను సెలక్ట్ చేశారు. అప్పుడు భక్తవత్సలం నాయుడు అనే నా పేరుని దాసరిగారు ‘మోహన్‌బాబు’గా మార్చారు.
సెలక్ట్ అయిన విషయం వెంటనే మీ భార్యకు చెప్పారా?
మోహన్‌బాబు: టెస్ట్ షూట్ విజయవాడలో జరిగింది... మేమేమో మద్రాసులో ఉండేవాళ్లం. అప్పట్లో సెల్‌ఫోన్స్ లేవు. నాకు ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేదు. మేం ఓ మేడ పైన చిన్న గదిలో ఉండేవాళ్లం. కింద ఓ మేకప్‌మన్ ఉండేవారు. ఆయన ఇంటికి ఫోన్ చేసి... రిక్వెస్ట్ చేసి, నా భార్యను పిల్వమన్నాను. తను ఫోన్ తీయగానే, ‘సెలక్ట్ అయిన విషయం చెప్పడానికే కదా. సంతోషం. కనకదుర్గమ్మ గుడికి వెళ్లండి’ అని చెప్పింది. ఇక, ఈ వార్తను మా అమ్మానాన్నలకు చేరవేయాలి. మా ఊళ్లో ఫోన్ లేదు. దాంతో, తిరుపతిలో నాకు తెలిసినవాళ్లకి సమాచరం చేరవేసి, వీలు చూసుకుని మా ఇంటికెళ్లి, విషయం చెప్పండన్నాను. ఎందుకంటే, అప్పట్లో మా ఊళ్లో రవాణా సౌకర్యం లేదు.. ఫోన్లు లేవు.
మరి.. మీరు డబ్బులు సంపాదించిన తర్వాత మీ ఊరికోసం ఏం చేశారు?
మోహన్‌బాబు: నేను రాజ్యసభ సభ్యుణ్ణయ్యాక, నా నిధుల్లోంచి కొంత మా ఊరి అభివృద్ధికి కేటాయించాను. రోడ్లు వేయించాను... బ్రిడ్జ్ కట్టించాను. కానీ, కొంతమంది స్వార్థపరులు నదిలో ఇసుక తవ్వేస్తుండడంతో బ్రిడ్జ్ పరిస్థితి హీనంగా తయారైంది. దాని గురించి ఎంతమందికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం కనపడలేదు. ఇసుక తవ్వడం ఆపలేదు. అలాగే, ఊళ్లో స్కూలు కోసం స్థలం కొని ఇచ్చాను. ఆ స్కూలు వరండాలో శెనక్కాయలూ వడ్లూ ఆరబోసుకుంటున్నారు. నేనేమో మోడల్ విలేజ్‌లా తీర్చిదిద్దాలనుకున్నా. ప్రజలకే లేనప్పుడు నేను మాత్రం ఏం చేసేది? అందుకే విరక్తి వచ్చేసింది. అప్పట్నుంచీ ఊరి గురించి ఆలోచించడం మానేశాను.
అది సరే.. చాలామంది స్టూడియోలు కట్టుకుంటే, మీరెందుకు స్కూల్ కట్టారు?
మోహన్‌బాబు: ఓ దశలో హోటల్ పెట్టాలనుకున్నాను. కానీ, వన్ ఫైన్ మార్నింగ్ స్కూల్ పెడితే బాగుంటుందనిపించింది. నటుడిగా రిటైర్ అయిన తర్వాత అక్కడ గడపొచ్చని. ఓ స్కూల్లో వారి కులం కాదని నన్ను తీసేశారు కదా. కాబట్టి స్కూల్ పెడితే, ప్రాస్పెక్టస్‌లో కులం అనేది తీసేయాలనుకున్నాను. అలాగే కుల, మతాలకు అతీతంగా 25 శాతం ఉచిత విద్య అందించాలనుకున్నాను. నా రెండో తమ్ముడు కృష్ణ ‘వద్దన్నయ్యా.. మనం నడపలేం’ అన్నాడు. ‘పెట్టి చూపిస్తారా’ అన్నాను. సరే.. స్కూల్ పెట్టాం. కుల, మతాలకు అతీతంగా 25 శాతం ఉచిత విద్య అందించాలనుకుని, కులాలకు అతీతంగా బాగా మార్కులు వచ్చినవాళ్లని ఎన్నుకుంటాం. మా విద్యానికేతన్‌లో ఒక్క డాక్టర్ కోర్స్ తప్ప లేని కోర్స్ అంటూ లేదు. ఇక, నా రిటైర్మెంట్ విషయానికొస్తే.. ప్రజలు వీడు అసహ్యంగా ఉన్నాడు.. వీడిని ఇక చూడలేం అనుకునే ముందే రిటైర్ అయితే గౌరవంగా ఉంటుందనుకున్నాను. కానీ, ఇప్పటివరకు నాకా అవకాశం రాలేదు.
ఇంతకీ మీరు రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు?
మోహన్‌బాబు: ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్లకి రాజకీయం పనికి రాదు.
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా ఉంటే కుదరదన్నా రు.. మరి సినిమా పరిశ్రమ పరిస్థితి కూడా అంతే కదా?
మోహన్‌బాబు: కరెక్టే, కానీ, ఈ ఇండస్ట్రీలో 38 ఏళ్లలో నా గురించి అందరికీ అర్థం అయ్యింది. ‘మోహన్‌బాబు సూటిగా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు. తనతో జాగ్రత్తగా ఉండాలి.. పద్ధతిగా ఉండాలి’ అనుకుంటారు తప్ప నా గురించి మరో రకంగా అనుకోరు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినా, అవి ముంబయ్ నుంచి వచ్చిన థర్డ్ గ్రేడ్ హీరోయిన్ల వల్లే. ‘షూటింగ్‌కి టైమ్ ప్రకారం రండి’ అంటే తప్పా? మనకు అన్నం పెడుతున్న వృత్తిపట్ల క్రమశిక్షణగా ఉండమనడం అన్యాయమా? అదే కనుక అన్యాయం అంటే.. డోంట్ కేర్!
మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడ్డంవల్లే కొంతమంది ‘మోహన్‌బాబుకి నోటి దురుసు’ అంటారు..?
మోహన్‌బాబు: శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మీరు అన్వేషిస్తే ‘మోహన్‌బాబు ముక్కుసూటి మనిషి. కరెక్ట్ మనిషి’ అని చాలామంది నోట వింటారు. మీరు ‘నోటి దురుసు’ అన్నారు. అది తప్పు మాట. ఎవరి మీద పడితే వాళ్ల మీద ఇష్టం వచ్చినట్లు అసందర్భంగా నోరు పారేసుకుంటే అది నోటి దురుసు కింద లెక్క. నేను తప్పుచేసినవాళ్ల గురించే మాట్లాడతాను. చెయ్యనివాళ్లని గౌరవిస్తాను. ఊరికే ఎవడో ఒకడు ‘మోహన్‌బాబుకి నోటి దురుసు’ అంటాడు. అలా అన్నవాడికే దురుసు ఎక్కువ. గురువింద గింజకు తన నలుపు తెలియదన్నట్లు ఎవడి తప్పు వాడికి తెలియదు. ఇక్కడ ఎవరూ సత్యహరిశ్చంద్రులు, ధర్మాత్ములు కాదు, శ్రీరామచంద్రులు కాదు. నాకు హద్దు తెలుసు. అది దాటను.
కానీ, మీ దగ్గరకు రావడానికి చాలామంది భయపడతారు!
మోహన్‌బాబు: కొంతమంది అలా క్రియేట్ చేశారు. రామారావుగారిని చూస్తే భయపడతారు. కానీ, దగ్గరకెళ్లిన తర్వాతే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మనిషో. నన్ను నేను ఆ మహానటుడితో పోల్చుకోవడంలేదు. కానీ, ఆయన లక్షణాలు నాలో కొన్ని ఉన్నందుకు నాకెప్పటికీ గర్వంగా ఉంటుంది. ఓ సందర్భంలో ఆయన ‘మేం ఏకగర్భంలో పుట్టకపోయినా అన్నదమ్ములమే. వారి ఆవేశమే మమ్మల్ని వారికి దగ్గర చేసింది’ అన్నారు. అలాగే, మా బావగారు వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ‘మోహన్‌బాబుగారు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయన్ని డీల్ చేయడం కష్టం. కానీ, డీల్ చేసిన తర్వాత, దగ్గరకెళితే అటువంటి మంచి మనిషి ఉండరు’ అన్నారు.
మీకు కోపం ముక్కు మీద ఉంటుందనేవారికి మీ సమాధానం ఏంటి?
మోహన్‌బాబు: అది వాస్తవమే. అన్యాయాన్ని సహించలేక వచ్చే కోపం అది. నా కళ్లముందు చెడు జరిగితే భరించలేను.
మితిమీరిన కోపం ఆరోగ్యానికి చేటు అంటారు కదా?
మోహన్‌బాబు: నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే, కోపం వల్ల నాకు తక్కువమంది స్నేహితులు ఉన్నారు. నేనెవర్నీ మోసం చేయను. ఎవరైనా మోసం చేస్తే భరించలేను.నిర్మాతగా నన్ను చాలామంది ‘గోల్డెన్ పే మాస్టర్’ అంటారు.
మీకు పారితోషికాలు ఎగ్గొట్టినవాళ్లు ఉన్నారా?
మోహన్‌బాబు: వందల మంది ఉన్నారు. వాళ్లిచ్చిన చెక్‌లు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు. అలాగే, కొన్ని సినిమాలు నేను పారితోషికం తీసుకోకుండా చేశాను. ఉదాహరణకు, ఇటీవల చేసిన ‘ఆదిశంకర’. ఎవరైనా ‘నేను ఇవ్వలేను’ అంటే, ఉచితంగా చేసిన రోజులున్నాయి. కానీ, ఇస్తానన్న పారితోషికం ఇవ్వకపోతే మాత్రం కోపం వస్తుంది.
సినిమా రంగం నుంచి ఎప్పుడైనా వెళ్లిపోదామను కున్నారా?
మోహన్‌బాబు: అలా ఎప్పుడూ అనుకోలేదు. ‘పుణ్యభూమి నా దేశం’ అద్భుతమైన సినిమా. ఓ హిందీ సినిమాకి ఆధారం అది. హిందీలో బ్రహ్మాండంగా ఆడింది. కానీ, తెలుగులో ఆడలేదు. అలాగే ‘పోస్ట్‌మేన్’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాపై కూడా భారీ అంచనాలుండేవి. కానీ, అది ఎబౌ యావరేజ్ అయ్యింది. నిజానికి అది రజనీకాంత్ కథ. ‘కొన్ని మార్పులు చేస్తారా’ అంటే తను ఒప్పుకోలేదు. ఆ మార్పులు చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఆ సినిమాని నేను తెలుగులో చేసిన తర్వాత, ఇతర భాషల్లో చేయాలన్నది రజనీ అభిప్రాయం. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ‘ఏం చేశావురా.. నేను నీ అంత అద్భుతంగా యాక్ట్ చేయలేను. నా వల్ల కాదురా’ అన్నాడు.
గ్రేట్ కాంప్లిమెంట్?
మోహన్‌బాబు: స్నేహం అనేది పదానికి అర్థం తెలిసిన వ్యక్తి రజనీకాంత్. నా ‘రాయలసీమ రామన్న చౌదరి’ చూసి, ‘బ్రహ్మాండం’ అని అంటే, అది గొప్ప కాంప్లిమెంట్ అనుకోను. నేను బాగా యాక్ట్ చేశాను కాబట్టి అన్నాడు. నాకంటే వాడు గొప్ప నటుడంటే ఒప్పుకోను. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల మంచి నటుడు వాడు. కానీ, వాడికన్నా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తానని నేననుకుంటాను. మా ఇద్దరిలో ఎవరు గొప్ప నటుడు? అని డిసైడ్ చేయాలంటే మధ్యలో ఓ జడ్జిని పెట్టాలి.
మరి... మిమ్మల్ని అభినందించే అవకాశం ఎవరికిస్తారు?
మోహన్‌బాబు: ప్రజలకు ఇస్తాను.
ఒకప్పుడు సమైక్యాంధ్ర అన్నారు. ఇప్పుడేమంటారు?
మోహన్‌బాబు: కలిసుందాం అంటే తప్పయ్యింది. ఆ మాట అన్నదానికి నా స్కూల్ బద్దలు కొట్టారు. ఇంటి మీదకొచ్చారు. నా సినిమాని నిషేధించారు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి కాదు. కానీ, నన్ను దోషిని చేశారు. నేను పది పైసలు సంపాదించడానికి కష్టపడ్డాను. నీతిగా, న్యాయంగా సంపాదించాను. ఎవరి పోరాటం వారిది అని ఫిక్స్ అయ్యాను. అన్ని ప్రాంతాలవాళ్లని ప్రేమిస్తాను.. గౌరవిస్తాను. నాకే పోరాటం వద్దు. నాకు నా కుటుంబం, నా సినిమాలు ముఖ్యం. వాస్తవానికి మా మీద దాడి జరిగినప్పుడు ఇటు ఆంధ్రా అటు తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొంతమంది ‘అయ్యో.. మీకిలా జరగడమేంటి?’ అని బాధపడ్డారు. కానీ, సినిమా పరిశ్రమలో చాలామంది ‘వీడేమైనా పోటుగాడా’ అంటూ ఎద్దేవాగా మాట్లాడారు. రేపు తెలంగాణ వస్తుందా? ఆంధ్రాగా మిగిలిపోతుందా? అనేది ఆ దేవుడికే తెలియాలి.
అసలు మీ ఎమోషన్స్‌ని ఎవరితో పంచుకుంటారు?
మోహన్‌బాబు: నేనీ మధ్య అసమర్ధుడిగా బతుకుతున్నాను. అలా ఎందుకంటున్నానంటే.. ఏదీ మాట్లాడకూదని, ఆల్మోస్ట్ నోరు కట్టేసుకున్నాను. బస్టాపుల్లో, సినిమా థియేటర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న పిల్లలు అడుక్కుంటుంటారు. అక్కడే పోలీసులు నిలబడి ఉన్నా, పట్టించుకోరు. అదే రోడ్డు మీద చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్.. ఇలా ఎంతోమంది మంత్రులు వెళుతుంటారు. కారు అద్దాల్లోంచి రోడ్లపై దృష్టి పెడితే, ఆ పసిపిల్లలు కనిపిస్తారు. ఈ ఆర్థికంగా వెనకబడినవారి కోసం పభుత్వం కల్పించే అవకాశాలను వారు ఉపయోగించుకోవాలి. పోనీ.. ప్రభుత్వ సంస్థల్లో ఉండే పిల్లలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తే, ‘అన్నీ బాగున్నాయి’ అని ఆ పిల్లలతో చెప్పిస్తారు. ఇవన్నీ తల్చుకుంటే చాలా ఆవేదనగా ఉంటుంది. కానీ, ఏం చేయలేక అసమర్థుడిగా ఉండిపోతున్నాను. కాకపోతే, నా వంతుగా విద్యానికేతన్‌లో 25 శాతం ఉచితం అందిస్తున్నా. ఇంకా చేతనైన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఎవరో వస్తారని, ఎదురు చూసి మోసపోకుమా? అని శ్రీశ్రీ అన్నారు. నాకు తెలిసినంత వరకు దానర్థం ఏంటంటే.. ‘అన్యాయం జరుగుతున్నప్పుడు నీకు నువ్వే తిరగబడు’ అని. అలా ఇంటికొకరు తిరగబడినా సమాజం బాగుపడుతుంది.
ఫైనల్‌గా మీరేం చెబుతారు?
మోహన్‌బాబు: ఇతరుల వస్తువులను మట్టిపెళ్లల్లానే భావించాలని, గౌరవంగా, నీతిగా బతకాలని మా నాన్నగారు చెప్పారు. నాది ఆయన బాటే. ముక్కుసూటిగానే వెళతాను. తప్పుని ఖండిస్తాను. కానీ, ఇప్పుడిప్పుడు పిల్లలు ‘మనకెందుకు నాన్నా’ అంటుంటే, కొంచెం మారుతున్నాను. నిజం చెప్పడంవల్ల ఎవరి మనసైనా బాధ పడుతుందనిపిస్తే, ఆ నిజం చెప్పకుండా ఉండటమే బెటర్ అని ఇప్పుడిప్పుడు అనుకుంటున్నాను. నేను ఒకరి జోలికి వెళ్లను. నా బతుకు నేను బతుకుతూ నాకు చేతనైనంత సహాయం చేస్తాను. కానీ నా జోలికి ఎవరైనా వస్తే.. నన్ను నేను కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడను.
- డి.జి.భవాని
చిరంజీవి, మీరు ఒకప్పుడు క్లోజ్‌గా ఉండేవారట. ఆ తర్వాత మీ మధ్య మనస్పర్థలు ఏర్పడటం.. మళ్లీ స్నేహంగా ఉండటం..వీటి వెనకాల కారణాలేంటి?
మోహన్‌బాబు: చిరంజీవి, నేను మంచి కొలీగ్స్. కలిసి, మెలిసి ఉండేవాళ్లం. వజ్రోత్సవాల సమయంలో సినిమా పరిశ్రమలోని కొంతమంది థర్డ్ గ్రేడ్ ఫెలోస్ చిరంజీవిని కాకా పట్టడానికి ఏవేవో చెప్పారు. ఆ మాటలకు తను బాధపడ్డాడు. నేనూ బాధపడ్డాను. అంతేకానీ చిరంజీవి నాకెలాంటి చెడూ తలపెట్టలేదు. నేనూ చిరంజీవికి చెడు చేయాలనుకోలేదు. కానీ, అతని పక్కనే ఉన్నవాళ్లు నాకు చెడు తలపెట్టారు... చెడు చేశారు. ఇప్పుడు అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఏదేమైనా... నేను, చిరంజీవి ఒకటయ్యాం. ఆ రోజు మా మధ్య పొరపొచ్ఛాలు రావడానికి కారణమైనవాళ్లు ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాలి. ఎవరైతే అమాయకులైన అభిమానులను రెచ్చగొట్టి, రాళ్లు వేయించారో వాళ్లు సిగ్గుపడాలి. వాళ్లకే అంతా రివర్స్ కొట్టింది. నాకు అపఖ్యాతి తేవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే.. వాళ్లకే అది వస్తుంది.
మీ ముక్కుసూటితనం మీకు మైనస్ కాలేదా?
మోహన్‌బాబు: చాలా అయ్యింది. కొంతమంది స్నేహితులు దూరమయ్యారు. ఇంకా వ్యక్తిగతంగా కొన్ని నష్టాలు జరిగాయి. కానీ, ఏ మైనస్ అయినా నాకే జరిగింది. నా ప్రవర్తన ఎవరికీ నష్టం కలిగించలేదు. ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు. భయపడేవాడు క్షణానికోసారి చస్తాడు. అలా భయపడుతూ బతకడం ఎందుకు? అందుకే నాకు నచ్చినట్టుగా ముక్కుసూటిగా ఉంటాను.