నేడు వైఎస్సార్సీపీ బంద్
ఒంగోలు, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. టీ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల పార్లమెంట్లో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. శాసనమండలి, శాసనసభలో ఆమోదం పొందని టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చినట్లయిందన్నారు.
తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని, సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా.. సమైక్యాంధ్రకు సంఘీభావంగా.. పార్లమెంట్లో టీ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు బాలాజీ పేర్కొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అధికార ప్రతినిధులు, వివిధ విభాగాల కన్వీనర్లు,
రాష్ట్ర నాయకులు, నగర, మండల కన్వీనర్లు, జిల్లా, నగర స్టీరింగ్ కమిటీ సభ్యులు, సమైక్యవాదులు విరివిగా పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని నూకసాని కోరారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌కు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజానీకం సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
బంద్‌కు సహకరించడండి
శుక్రవారం ఉదయం 5 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో జరిగే ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ కోరారు. ఆర్టీసీ బస్టాండులో బస్సులను అడ్డుకుంటామని చెప్పారు. పదిగంటలకు పార్టీ కార్యాలయం నుంచి నగరంలో అన్ని వాణిజ్యసంస్థలు, ఫ్రభుత్వ కార్యాలయాల మూసివేత కార్యక్రమం ఉంటుందని, వైఎస్సార్సీపీ శ్రేణులంతా కదిలిరావాలని కుప్పం పిలుపునిచ్చారు.
సమాచారం లేకుండా
బిల్లు ఎలా పెడతారు?
గిద్దలూరు, న్యూస్‌లైన్ : సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండానే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశ పెడతారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రశ్నించారు. గురువారం గిద్దలూరు వచ్చిన ఆయన.. పార్టీ మండల కన్వీనర్ కాకునూరి హిమశేఖర్‌రెడ్డి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీలో ఓడిన విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. టీ బిల్లు పెడుతున్నట్లు సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
2008లో రాష్ట్ర విభజన డిమాండ్రాగా మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తేల్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. సోనియా తన కుమారుడిని ప్రధాని చేయాలనే దురాశతో రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రపన్నిందని మండిపడ్డారు. బిల్లులో సవరణలు చేయాలని బీజేపీ సూచిస్తున్నా పట్టించుకోకుండా సభ్యులను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంటులోనే సీమాంధ్ర ఎంపీలు, మంత్రులపై తెలంగాణ ప్రాంత ఎంపీలు దాడులు చేశారంటే రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతోందని, అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యం కారణంగానే నేడు రాష్ట్రం ఇలాంటి దుస్థితికి దిగజారిందని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జంగీటి శ్రీనివాసులు, ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు కోటేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు వెంగళరావుయాదవ్, బేస్తవారిపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి, గడికోట మాజీ సర్పంచ్ రంగస్వామి, కె.రవీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.