అలనాటి పాటలు మధురం
‘‘కొన్ని పాటలు వినగానే మనసుకు హత్తుకుపోతాయి. అందుకు కారణం చెప్పలేకపోవచ్చు. కానీ, ‘ఆ పాత మధురం’ పుస్తకం చదివితే ఆ పాటలు ఎందుకంతగా నచ్చాయో తెలుస్తుంది. అలనాటి పాత పాటలు జలపాతంపై తేనె ఒలికించినంత మధురంగా ఉంటాయి. 1960 నుంచి 1980 వరకు అద్భుతమైన పాటలు వచ్చాయి’’ అని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు.
1951 నుంచి 1955 మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోని మంచి పాత పాటల సంకలనంతో పాటు వాటి గురించి విశదీకరిస్తూ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ రాజా రచించిన ‘ఆ పాత మధురం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.పారిశ్రామిక వేత్త వరప్రసాద్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రామచంద్రమూర్తికి అందించారు. డాక్టర్ రాజా మాట్లాడుతూ– ‘‘గోవిందరావు, నారాయణరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వరప్రసాద్‌రెడ్డిలు తనకు ఎంతో ప్రోత్సాహం అందించారు. వారి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగా’’ అన్నారు.
‘‘ఇటీవల వచ్చిన పాటలపై మరో సంపుటి తీసుకొస్తే తానే ముద్రణ వేయిస్తానని’’ వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. ‘సినీ గీత పరిశోధక శిరోమణి’ గా వక్తలు రాజాను కొనియాడారు. కాగా, ఈ పుస్తకాన్ని మధుసూదన్ శర్మకు అంకితం ఇచ్చారు. సంగీత దర్శకులు ఆర్పీపట్నాయక్, రచయిత డాక్టర్ మృణాళిని, సినీ గేయ రచయిత చంద్రబోస్, సన్ షైన్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ గురవారెడ్డి, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణమరాజు, డాక్టర్ భార్గవి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.