23 నుంచి రెండోవిడత పల్స్‌పోలియో
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రామతులశమ్మ తెలిపారు. మొత్తం 3,55,088 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 2,491 బూత్‌లు ఏర్పాటు చేశామని, 10,935 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. గత నెలలో నిర్వహించిన మొదటివిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాలు సాధించామన్నారు. అయినప్పటికీ మరో ఏడాదిపాటు జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలియో వైరస్ ఒకరికి సోకితే పక్కవారికి కూడా సోకే ప్రమాదముందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏ ఒక్కరూ పోలియో బారినపడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు కారణంగా పోలియో సోకుతుందన్నారు.
అనుమానం ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం చెన్నైకి పంపిస్తామని, పాజిటివ్ రిపోర్టు వస్తే బూస్టర్ డోస్ వేస్తామని తెలిపారు. ఎక్కడైనా పోలియో కేసు నమోదైతే ఆ ప్రాంతానికి చెందిన ఆశా కార్యకర్తలను డిస్మిస్ చేస్తామని, ఏఎన్ఎంలను సస్పెండ్ చేస్తామని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. స్థానిక వైద్యాధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా సంచార జాతులు, బిక్షగాళ్లు, వలస కూలీల పిల్లలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సరళాదేవి మాట్లాడుతూ రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా 23వ తేదీ మొదటిరోజును బూత్డేగా ప్రకటిస్తామన్నారు. ఆ రోజు ఉదయం బూత్‌లలో మాత్రమే పోలియో చుక్కలు వేస్తామన్నారు.
మధ్యాహ్నం నుంచి బూత్‌లకు రాని పిల్లల వివరాలు సేకరించి ఏఎన్ఎంలు వారి ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు వారందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. 24, 25 తేదీల్లో ఇళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు సంచార జాతుల వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఐడీఎస్పీ వైద్యుడు డాక్టర్ పుల్లారెడ్డి, ఎస్వో శ్రీధర్‌బాబు, డెమో శ్రీనివాసరావు, డిప్యూటీ డెమో పద్మజ తదితరులు పాల్గొన్నారు.
రెండోవిడత పల్స్‌పోలియో రూట్ ఆఫీసర్లు వీరే...
మార్కాపురం, పెద్దదోర్నాల, వై.పాలెం ప్రాంతాలకు డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.రామతులశమ్మ, ఒంగోలు అర్బన్ పరిధిలో డాక్టర్ కె.సరళాదేవి, చీమకుర్తి, దర్శి ప్రాంతాలకు డాక్టర్ రమేష్, మార్టూరు, అద్దంకి ప్రాంతాలకు డాక్టర్ పద్మావతి, గిద్దలూరు, కంభంకు డాక్టర్ నవీన్, చీరాల, పర్చూరు ప్రాంతాలకు డాక్టర్ సత్యనారాయణ, కందుకూరు, ఉలవపాడు, కొండపికి ఎస్వో శ్రీధర్‌రావు, కనిగిరి, పామూరు ప్రాంతాలకు కేవీ సబ్బలక్ష్మి రూట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తారు.