డీఎంహెచ్‌వోపై ఆర్డీ విచారణ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఆర్.రామతులశమ్మ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణాధికారిగా నియమితులైన వైద్యారోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ (ఆర్డీ) డాక్టర్ షాలినీదేవి గురువారం విచారణ చేపట్టారు. డీఎంహెచ్‌వో రామతులశమ్మ అనేక అక్రమాలకు పాల్పడినట్లు జిల్లాకు చెందిన దళిత సంఘ నాయకుడు బ్రహ్మయ్య ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పాత తేదీ వేసి 46 మంది స్టాఫ్ నర్సులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించారని, రెగ్యులర్ వైద్యులను నియమించినప్పటికీ 26 మంది కాంట్రాక్టు వైద్యులను రెన్యువల్ చేశారని, మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. వాటిపై విచారణ చేపట్టాలని ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులను గవర్నర్ ఆదేశించారు. ఆ మేరకు విచారణాధికారిగా నియమితులైన ఆర్డీ షాలినీదేవి గురువారం ఒంగోలు చేరుకుని స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని ఐడీఎస్పీ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
ముందుగా ఫిర్యాదుదారుడు బ్రహ్మయ్య, అనంతరం డీఎంహెచ్‌వో రామతులశమ్మ, కార్యాలయ పర్యవేక్షణాధికారి, ఇతర సిబ్బందిని విడివిడిగా విచారించి రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ స్టాఫ్ నర్సుల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ఇళ్లకు వెళ్లిమరీ డీఎంహెచ్‌వో రామతులశమ్మ డబ్బు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై ప్రధానంగా విచారించినట్లు తెలిపారు. విచారణ స్టేట్మెంట్లతో పాటు సంబంధిత ఫైళ్లను కూడా గుంటూరు తీసుకెళ్లి పూర్తిగా పరిశీలిస్తానని, అనంతరం నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తానని ఆమె పేర్కొన్నారు.
9 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రామతులశమ్మ...
ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్‌వో ఆర్.రామతులశమ్మ మరో 9 రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్నీ తానై ఆమె వ్యవహరిస్తుండటం, ఆమె కారు డ్రైవర్ కూడా డీఎంహెచ్‌వోకు సంబంధించిన ప్రతిపనికీ డబ్బు వసూలు చేస్తుండటంపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేం దుకు ఇటీవల సిద్ధమయ్యారు. యూనియన్ నాయకులు సర్దిచెప్పడంతో ఆగిపోయారు. చివరకు స్టాఫ్ నర్సుల నియామకాల్లో అక్రమాల కారణంగా మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగడంతో విషయం విచారణ వరకూ వచ్చింది. అయితే, డీఎంహెచ్‌వో రామతులశమ్మ మాత్రం తాను ఎలాంటి అవినీతి అక్రమాలకూ పాల్పడలేదని, విచారణలో ఆ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు.