కరోనాతో పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత
న్యూఢిల్లీ: కరోనాతో ఇటీవల పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. కేంద్రమంత్రి సురేష్ అంగడి బుధవారం కరోనాతో మృతి చెందగా ఆయన మరణ వార్త మరవక ముందే టాలీవుడ్ ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. తాజాగా అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ శేఖర్ బసు(68) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. కరోనాతో పాటు కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు తెల్లవారుజామున 4.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. (కరోనాతో తెలుగు హాస్య నటుడు మృతి)
మెకానికల్ ఇంజనీర్ అయిన డాక్టర్ బసు దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తయారీలో కీలకపాత్ర పోషించారు. దేశంలో అణువిద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కృషి చేశారు. 2015 అక్టోబర్ 23 నుంచి 2018 సెప్టెంబర్ 17 వరకు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. (నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా)