దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఆధ్యాయం
వాషింగ్టన్ డీసీ : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో ఓ చీకటి ఆధ్యాయమని రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ అభివర్ణించారు. శనివారం యూఎస్ వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలతో శివాజీ సమావేశమయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు... ఆ సమయంలో తాను గడిపిన జైలు జీవితాన్ని శివాజీ ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు ఎన్నారైలకు వివరించారు.
దేశంలో ఎమర్జెన్సీ సమయంలో న్యాయస్థానాల పరిస్థితి... క్రిమినల్ లా లోని లోపాలు ... పరిపాలన ఎలా పట్టాలు తప్పేందుకు దోహదం చేసిందో ఓ క్రమానుగతంగా యలమంచిలి శివాజీ వివరించారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో పరిస్థితులు మారతాయని భావించానని ఆయన తెలిపారు. అయితే నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు పెద్ద తేడా లేదన్నారు. కొందరు వ్యక్తులు అమలు కానీ హామీలు ఇచ్చి ఎన్నికలో గెలిచి.. అధికారం చేపట్టి పెత్తనం చెలాయిస్తున్నారని యలమంచిలి శివాజీ ఆరోపించారు.
అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు శివాజీ జవాబులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హేతువాది ప్రొ. ఇన్నయ్య నరిశెట్టి, మాణిక్య లక్ష్మీ, డాక్టర్ యడ్ల హేమప్రసాద్, జక్కంపూడి సుబ్బారాయుడు, మధు బెల్లం, శ్రీనివాసరావు, జ్యోతి శాఖమూరి, డాక్టర్ నవీనా హేమంత్, రావు లింగాతోపాటు పలువురు ఎన్నారులు పాల్గొన్నారు. 1975 జూన్ 25న అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. దేశంలో ఎమర్జెన్సి విధించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యలమంచిలి శివాజీ స్పందించారు.