గోవాలో మరో అర్ధరాత్రి డ్రామా
పణజీ: గోవాలో వారం తిరిగేలోపే మరోసారి అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ఎంజీపీ ఎమ్మెల్యేలు మనోహర్ అజ్గావోంకర్, దీపక్ పావస్కర్లు గోవా అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ మైఖేల్ లోబోకు మంగళవారం అర్ధరాత్రి 1.45 గంటలకు అందజేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మరో ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్ను ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గం నుంచి తొలగించారు. తమ పార్టీ శాసనసభాపక్ష వ్యవహారాల్లో బీజేపీ తలదూరుస్తోందనీ, ఆ పార్టీ కుట్రకు పాల్పడుతున్నందున సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఎంజీపీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
బీజేపీతో కలిసే పార్టీలకు ఇదే గతి: కాంగ్రెస్
గోవాలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలకన్నింటికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. ‘తన మిత్రపక్షాలకు తానే ప్రమాదకారినని బీజేపీ నిరూపించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ మనుగడే ప్రమాదకరమవుతుందన్న విషయాన్ని ఎన్డీయేలోని పార్టీలు గుర్తించాలి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇదో గట్టి హెచ్చరిక’ అని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సునీల్ కవఠాంకర్ అన్నారు.