ద్రవిడ్ ఫీజు రూ.2.60 కోట్లు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) 2013-14 సంవత్సరానికి రూ.50 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్టు పేర్కొంది. పారదర్శక పాలనలో భాగంగా రూ.25 లక్షలకు మించి చేసే వ్యయాల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో బోర్డు ఉంచుతోంది. దీంట్లో భాగంగా తమ మార్చి నెల చెల్లింపులను వివరంగా పేర్కొంది. సర్వీస్ ట్యాక్స్ కింద రూ.2.74 కోట్లు చెల్లించింది. మరోవైపు భారత అండర్-19, ‘ఎ’ జట్టు కోచ్‌గా వ్యవహరించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఫీజు కింద బీసీసీఐ రూ.2.60 కోట్లు చెల్లిస్తోంది. దీంట్లో సగం మొత్తం రూ.1.30 కోట్లు గత నెలలో అతడికి చెల్లించింది.
అలాగే 2014-15 వార్షిక బకాయిల కింద అస్సాం క్రికెట్ సంఘానికి రూ.3.37 కోట్లు, క్యాబ్‌కు రూ.6.75 కోట్లు చెల్లించింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్, ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీలకు అడ్వాన్స్ పేమెంట్స్ కింద రూ.67.70 కోట్లు చెల్లించింది.
బోర్డులకూ డబ్బులు: ఐపీఎల్-9లో ఆడేం దుకు తమ ఆటగాళ్లను పంపినందుకు ఇతర దేశాల బోర్డులకు బీసీసీఐ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించింది. దక్షిణాఫ్రికా బోర్డుకు రూ. 4.2 కోట్లు; లంకకు రూ. 1.6 కోట్లు; న్యూజిలాండ్‌కు రూ. 1.1 కోట్లు చెల్లించినట్లు బోర్డు వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉంది. టి20 ప్రపంచకప్ సందర్భంగా వాడిన స్పైడర్కామ్ల కోసం రూ. 1.7 కోట్లను ఖర్చు చేసింది.