అవిశ్వాసం తీర్మానం కోసం గవర్నర్ చెంతకు
సాక్షి, చెన్నై: దినకరన్ వర్గం తిరుగుబాటుతో మైనారిటీలో పడిన పళనిస్వామి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష డీఎంకే ప్రయత్నిస్తోంది. పళని సర్కారు వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు ఆదివారం గవర్నర్ సీ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన స్టాలిన్ వెంట డీఎంకే నేతలతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల నేతలు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా స్టాలిన్ గవర్నర్‌ను కోరారు.
శశికళ వర్గంలో ఇప్పటికీ 21మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరారు. మరింతమంది అన్నాడీంఎకే ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుకునే అవకాశముందని దినకరన్ వర్గం చెప్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా బలపరీక్ష జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? పళనిస్వామికి ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ వేటు వేస్తారా? పళనిస్వామి-పన్నీర్ సెల్వం ద్వయం బలపరీక్ష గట్టెక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.