ముందు పళని బలం తేలాల్సిందే!
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ సీ విద్యాసాగర్ రావును ప్రతిపక్ష నేత స్టాలిన్ కోరారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్ ను కలిసిన డీఎంకే అధినేత తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచాలని విజ్నప్తి చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిపిన స్టాలిన్ పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డారంటూ 19మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైన విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా పళని ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని వివరించారు.
గతంలో సభలో బలనిరూపణ సందర్భంగా వ్యతిరేకంగా ఓటేసిన పన్నీర్ సెల్వం అండ్ గ్రూప్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధన్‌పాల్ ఇప్పుడు పార్టీ విప్ ఆదేశాలతో దినకరన్ వర్గానికి నోటీసులు పంపటం ఆశ్చర్యంగా ఉందని స‍్టాలిన్ తెలిపారు.