అధికార యంత్రాంగంపైఆగ్రహం
డీఆర్సీ సమావేశం గరం..గరం
=పంట నష్టం అంచనాలు సక్రమంగా లేవన్న సభ్యులు
=మళ్లీ సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్
=జేడీఏ, డ్వామా పీడీపై ఎర్రబెల్లి దూషణల పర్వం
=పొన్నాల అక్రమాలకు పాల్పడుతున్నారని రాజలింగం ఫైర్
=ఉపాధి హామీ పథకంలో ప్రగతి లేదని నిర్వేదం
=పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరిన సీతక్క
=నగరంలో నాలాల ఆక్రమణలను సమావేశం దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంపై డీఆర్సీ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్సీ నిల దీత... కాకతీయ ఉత్సవాలపై చిన్నచూపు చూస్తున్నారంటూ తెలంగాణవాదుల విమర్శలు... పంట నష్టం అంచనా వేయడంలో వివక్ష చూపుతున్నారంటూ ఓ అధికారిని ఏకంగా గాడిద కొడకా అని తిట్టడం... వెరసి పదకొండు నెలల తర్వాత జరిగిన జిల్లా సమీక్షా సమావేశం ఆద్యంతం వాడివేడిగా సాగింది.
జిల్లా ఇన్చార్జి మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7:30 గంటల వరకు కొనసాగింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మినహా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. పెద్దముప్పారంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదనే అంశంతో మొదలైన సమావేశం.. చేర్యాల ఐబీ చెరువు అంశం, జనగామ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు, పోడు భూములకు పట్టాలు, నగరంలో నాలాల ఆక్రమణ, కేయూ భూముల వ్యవహారం, ఆర్వోబీ, డ్వామా, విద్యుత్‌శాఖ, హౌసింగ్ శాఖ పనితీరుపై చర్చించింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి అధికార యంత్రాంగం తరఫున జరిగిన ఒక్కోతప్పును సభ్యులు ఎత్తిచూపుతూ నిలదీశారు. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధుల ఆరోపణలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.
పంటనష్టంపై తప్పుడు నివేదికలు
జిల్లాలో అకాల వర్షాల వల్ల పత్తి, మిర్చి, వరి పంటలు నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించే విషయంలో వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అధికారులు సక్రమంగా నివేదికలు పంపినందున వారికి పరిహారం వస్తుందని, ఇక్కడి అధికారులు నివేదికలు సక్రమంగా లేవని ఆక్షేపించారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ ఆంధ్రా అధికారుల వల్ల ఇలాంటి దుర్మార్గం జరుగుతున్నదని తను కలెక్టర్‌కు ముందే వివరించానని అన్నారు.
ఆంధ్రా పాంతంలో గాలివానలొస్తే కొబ్బరిచెట్లు కూలినట్లు పరిహారం పొందుతున్నారని, తెలంగాణ ప్రాంతంలో మాత్రం వాస్తవంగా నష్టపోయిన ైరె తులకు పరిహారం ఇవ్వడానికి అధికారులకు చేతులు రావడం లేదన్నారు. ఎకరానికి రూ.50 వేలు ఖర్చు చేసి పంట నష్టపోయిన రైతుకు.. రూ.5వేలు పరిహారం ఇస్తే అధికారులకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. తాను అక్రమాలు చేయమనడంలేదని, వాస్తవాన్ని నివేదించాలని చెప్తున్నానని అన్నారు. అధికారుల సమాధానంతో విసిగిన దయాకర్‌రావు జేడీఏ రామారావునుద్దేశించి ‘ఈ గాడిద కొడుకువల్లే’ రైతులకు న్యాయం జరగట్లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి తనకు జిల్లా నష్టంపై నివేదికను చూపారని, అందులో రూ.1.46కోట్లు మాత్రమే నష్టంగా జిల్లా అధికారులు పంపినట్లు ఉందని తెలిపారు.
రైతులకు ఇచ్చే అరకొర సాయానికి కొర్రీలు ఎందుక ంటూ ఆగ్రహించారు. పంట నష్టంపై ఎంపీ రాజయ్య, ఎమ్మెల్సీ రాజలింగం, సీతక్క కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. ఇక.. గత సంవత్సరం ఆదర్శ రైతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సభ్యులు అడిగారు. బాధ్యులపై క్రిమినల్ కేసులకు పెట్టేందుకు ఆదేశాలివ్వనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుత పంట నష్టంపై పంచాయతీ వారీగా మళ్లీ సర్వే చేయించి వివరాలు సేకరించి వాస్తవ నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున డిసెంబర్ 6లోగా నివేదికలు వ్యవసాయశాఖ అధికారులు కలెక్టర్‌కు అందించాలని మంత్రి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తాను మంత్రివర్గంలో చర్చించి జిల్లా రైతులను ఆదుకునేందుకు కృషిచేస్తానని అన్నారు.
పొన్నాలపై రాజలింగం ఫైర్
మంత్రి పొన్నాల లక్ష్మయ్య అవినీతికి ప్పాలడుతున్నారంటూ ఎమ్మెల్సీ రాజలింగం ఆరోపించారు. జనగామ నియోజకవర్గాన్ని మంత్రి దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు అధికార యంత్రాంగం సైతం మంత్రికి వత్తాసు పలుకుతున్నదని ఆరోపణలు గుప్పించారు. మంత్రి అవినీతిని వెలికి తీసేందుకు తాను ప్రయత్నిస్తే త న అనుచరగణం చేత నాపై కరపత్రాలు ముద్రించడం, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం వంటి పనులు మంత్రి చేస్తున్నారని, అయినా తన పోరాటం ఆపబోనని ఎమ్మెల్సీ రాజలింగం అన్నారు.
చేర్యాలలో ఉన్న ఐబీ శాఖ పరిధిలోని చెరువుకు ఒక వైపు రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే మరోవైపు ఇరిగేషన్ అధికారులు ఎఫ్టీఎల్ విషయంలో నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువు మత్తడి రాళ్లు తొలగించారని, తప్పుడు ఎన్వోసీ ఇచ్చారని చెప్పారు. ఇదంతా కేవలం మంత్రికి లబ్ధి చేకూర్చేందుకే చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్ఈ పద్మారావు స్పందిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీ ఇవ్వలేదని, అయినా మరోమారు వివరాలు పరిశీలిస్తామని చెప్పినప్పటికీ రాజలిగం సంతృప్తి చెందలేదు. చివరికి కలెక్టర్ జోక్యం చేసుకుంటూ జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలతో మరోమారు సర్వే చేసి ఎఫ్టీఎల్ గుర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పీడీ.. ఓ మెంటల్ కేస్
ఉపాధి హామీ పథకం అమలులో పొరుగు జిల్లాలో ఉన్న ప్రగ తి మన జిల్లాలో లేదని సభ్యులు అభిప్రాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం అవినీతిమయంగా మారిందని సభ్యులు ఆరోపించారు. ఇతర జిల్లాల్లో గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎంపీ లాడ్స్, సీడీఎప్ నిధులకు ఉపాధి నిధులను జతచేసి సీసీరోడ్లు నిర్మిస్తున్నారని, కానీ మన దగ్గర పీడీ నిర్లక్ష్యం వల్ల ఈ పద్ధతి అమలు కావడం లేదని ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యే దయాకర్‌రావు ఉపాధిహామీ ప్రాజెక్టు డెరైక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సక్రమంగా పని కల్పించడం లేదని, పూర్తయిన పనులకు కావాలనే కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఓ సమయంలో ఎర్రబెల్లి ఆవేశాన్ని ఆపుకోలేక ‘డ్వామా పీడీ ఓ మెంటల్ కేస్లా తయారయింది’ అంటూ వ్యక్తిగత విమర్శకు దిగారు. చెప్పినట్లు పనిచేయలేక పోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. తెలంగాణపై ప్రాంతంపై వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చివరకు ఈజీఎస్‌పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.
పోడు భూములకు పట్టాలు
జిల్లాలో పోడుభూముల విషయంలో అటవీ శాఖాధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా రైతులను మభ్యపెట్టి తిరిగి తీసుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. చివరికి ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కూడా తీసుకుపోనివ్వడం లేద న్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. డిసెంబర్ 2005 కన్నా ముందు సాగులో ఉన్న పోడు భూముల విషయంలో తాము అభ్యంతరం చెప్పడం లేదని అటవీ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే సంతృప్తి చెందకపోవడంతో ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
కాకతీయ ఉత్సవాలకు నిధులివ్వాలి
కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు దేశ రాజధానిలో చేపట్టాలని, అందుకు అనుగుణంగా పెద్దమొత్తంలో నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ వెంటేశ్వర్లు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నగరంలో నాలాల ఆక్రమణలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీన్ని పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. నాలాలపై పెట్రోల్ పంపులు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినా చర్యలు తీసుకోవడం లేదని, పైగా యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీ భూములు ఆక్రమణ విషయంలో అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
సమావేశానికి కార్పొరేషన్ సిటీ ప్లానర్ వచ్చి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా ప్రజాప్రతినిధులెవరూ సంతృప్తి వ్యక్తం చేయలేదు. చివరికి జేసీ, కొత్త కమిషనర్లతో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంపీ గుండు సుధారాణి మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణంకోం తీసిన గుంతల్లో జనం పడి చనిపోతున్నారని చెప్పారు. హంటర్‌రోడ్డు నిర్మాణంలో అధికారులు నాలాలు మూసేస్తున్నారని, దీనివల్ల కాలనీలు నీటమునుగుతున్నాయన్నారు.
మరోసారి ప్రొటోకాల్ వివాదం
తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్తులు పంపిణీ చేసే క్రమంలో కూడా స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్చ జరుగుతుండగానే ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ పక్కన రౌడీషీటర్ కూర్చున్నాడని, దీనికి అధికారులు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. సమావేశలో జేసీ పౌసుమి బసు, ఏజేసీ సంజీవయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్, కవిత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డీఆర్సీలో నేతలు ఏమన్నారంటే..
పేదల కోసం ఎన్నో పథకాలు
- మంత్రి బస్వరాజు సారయ్య
పేదల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. అందుకే మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం మరిన్ని మంచి పనులు చేస్తాం. ప్రస్తుతం రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు రచ్చబండలో అందించాం. అర్హులైన వారికి త్వరలోనే మరిన్ని అందించేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటాం.
ప్రత్యేక నిధుల కోసం కృషి చేసిన
- ఎంపీ సిరిసిల్ల రాజయ్య
జిల్లాను నక్సల్స్ ప్రభావిత జాబితాలో చేర్చి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేసిన. దేవాలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం రూ. 5.25 కోట్లు, కోటగుళ్ల అభివృద్ధికి రూ.5.65 కోట్లు, పాండవులగుట్ట అభివృద్ధికి రూ.1.50 కోట్లు, చేర్యాల, పెంబర్తి హస్తకళల అభివృద్ధికి రూ.50 లక్షల చొప్పున నిధులు వచ్చారుు. పనులు జరుగుతున్నారుు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి.
అధికారుల మధ్య సమన్వయం లేదు
- ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర
ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నా నియోజకవర్గంలో చలివాగు, భీంఘన్‌పూర్ పనులు ప్రారంభం కాకపోవడానికి ఇదే కారణం. ఒకరిపై ఒకరు నెట్టేసుకోకుండా పనులు జరిగేలా చూడాలి. లేదంటే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు
- ఎమ్మెల్యే సీతక్క
ఫారెస్టు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగంతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడం లేదు. దీని వల్ల మారుమూల ప్రాంతాల్లో 20 సంవత్సరాల క్రితం రోజులు గుర్తుకువస్తున్నాయి. ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత రాకముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే మంచిది.
35 కిలోల బియ్యం ఎప్పుడిస్తారు
- ఎంపీ గుండు సుధారాణి
పేద ప్రజలకు తెల్లరేషన్‌కార్డుపై 35 కిలోల బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని గత సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఇది నెరవేరలేదు. ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలి. ఎస్సీ కాలనీకి విద్యుత్ సరఫరా నిలిపివేసే విషయంలో అధికారులు స్పందించి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.