DRDA-IKP
-
ద్యావుడా!.. పదకొండేళ్లకు కదిలిన అవినీతి చిట్టా
సాక్షి, కరీంనగర్: అది 2011 సంవత్సరం. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ (డీఆర్డీఏ)లో వెలుగుచూసిన గడ్డపారల స్కాం ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. డీఆర్డీఏ అధికారుల ఆగడాలు చూసి, విని ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత కొంతకాలం క్రితం తుది నివేదికను సమర్పించింది. నిందితులపై చేసిన విచారణ ఆధారంగా పలు సూచనలు, సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించిన డీఆర్డీఏ ఏసీబీ డైరెక్టర్ జనరల్ చేసిన సిఫారసులను అమలు చేయాలని ఆయా విభాగాలకు అధికారికంగా ఇటీవల లేఖలు రాసింది. ఈ కుంభకోణంలో ఏ–1పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఏ–2, ఏ–3లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని స్పష్టంచేశారు. ఐకేపీ ఫిర్యాదుతో వెలుగులోకి.. ►ఉమ్మడి రాష్ట్రంలో 2010–11 ఆర్థిక సంవత్సరంలో డీఆర్డీఏ చేపట్టిన అనేకపనులపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా గడ్డపారల కొనుగోళ్లలో గోల్మాల్, అభయహస్తం పింఛన్ పథకంలో నిధుల పక్కదారి.. తదితర వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నిధులు పక్కదారి పట్టాయని, సాక్షాత్తూ డీఆర్డీఏ అధికారులు కొందరితో కుమ్మక్కై ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్‌లోని ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) సిబ్బంది ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. 2011 మే 9వ తేదీన ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్ఐఆర్లో ప్రధాన ఆరోపణలు ఇవే! ►గడ్డపారల కొనుగోళ్లలో సరఫరా చేసే కంపెనీతో రూ.3.8 కోట్లకు రహస్య ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ఉమ్మడి జిల్లాలోని 57 మండలాల్లోని మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేయల్సి ఉండటం గమనార్హం. ఇలా తప్పుడుమార్గంలో వెళ్లినందుకు రూ.38 లక్షల కమిషన్ దక్కిందని ఆరోపణలు. ► అభయహస్తం పింఛన్ పథకంలో నిధుల రూ.18 లక్షలు పక్కదారి. ట్రైనీలకు భోజనం పేరిట రూ.35 లక్షలు ఖర్చు చూపారు. ► దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఇప్పటి అంబేద్కర్ స్టేడియంలో స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలు సమావేశం పేరిట రూ.40లక్షలు తప్పుడు బిల్లుల పేరిట క్లయిం చేసుకున్నారు. ఇందులో డెకరేషన్‌కు రూ.20 లక్షలు చూపడం విశేషం. ► యాభైవేల స్వయం సహాయ గ్రూపులకు పుస్తకాల ప్రింటింగ్ పేరిట రూ.15 లక్షల బిల్స్ పెట్టారు. విలేజ్ మార్కెటింగ్ కమిటీ మెంబర్స్‌కు శిక్షణ పేరిట రూ.15 లక్షలు దుర్వినియోగం. రబీ పంటలో గ్రామ సమాఖ్యల సాయంతో రైస్ మిల్లర్ల నుంచి దాదాపు రూ.10 లక్షలు వసూలు చేశారు. సదరం క్యాంపు కోసం ఎలాంటి అనుమతి లేకుండా దాదాపు 40 కంప్యూటర్ల కొనుగోళ్లు. ► ఈ మొత్తం స్కాంలో రూ.1.66 కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఇందులో స్వయం సహాయక గ్రూపులకు పుస్తకాల ముద్రణ కోసం రూ.15 లక్షల విషయంలో, రైస్‌మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు, అనుమతి లేకుండా కంప్యూటర్ల కొనుగోలు ఆరోపణలు ఏసీబీ దర్యాప్తులో రుజువు కాలేదు. మిగిలిన ఆరోపణలకు సంబంధించి శాఖాపరమైన చర్యలు సూచిస్తూ పంచాయతీరాజ్‌శాఖకు అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ సిఫారసులు పంపారు. ముగ్గురు నిందితులపై చర్యలకు లేఖలు.. ఈ కేసులో ఏ–1గా అప్పటి డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పడాల రవీందర్ (ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్), ఏ–2గా అర్ష వేణుగోపాల క్రిష్ణ (ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసర్, డీఆర్డీఏ కరీంనగర్,), ఏ–3 ఐలినేని కృష్ణారావు (డీఆర్డీఏ, ఏపీఎం/కాంట్రాక్ట్ ఉద్యోగి) ఈ ముగ్గురిలో పడాల రవీందర్‌పై వెంటనే శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని, మిగిలిన వేణుగోపాల్ క్రిష్ణ, ఐలినేని రవీందర్లను విధుల నుంచి తొలగించాలని తుది విచారణ అనంతరం ఏసీబీ డైరెక్టర్ జనరల్ సిఫారసు చేశారు. ఈ సిఫారసుల ఆధారంగా పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల ఆయా విభాగాలకు లేఖలు రాశారు. చదవండి: ట్రెండు మారుతోంది...ఆడబిడ్డే కావాలి..! ‘కారా’ దరఖాస్తు విధానం ఇలా! -
మసకబారిన కిరణం
కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా లక్ష్యం నెరవేరని పరిస్థితి. యువతకు శిక్షణనిచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ కిరణాలు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతోంది. శిక్షణకు.. ఉపాధి కల్పించిన రంగానికి పొంతన లేక నెల రోజులు తిరక్కుండానే వారు వెనుదిరుగుతున్నారు. మొత్తంగా ఈ పథకం శిక్షణ సంస్థలకు కాసుల కురిపిస్తోంది. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాజీవ్ యువ కిరణాల అమలులో డీఆర్డీఏ-ఐకేపీ, మెప్మా పాత్ర కీలకం. జిల్లా లక్ష్యంలో డీఆర్డీఏ-ఐకేపీకి 80 శాతం.. ఐటీడీఏ, మైనార్టీ వెల్ఫేర్, ఉపాధి కల్పన సంస్థ, టెక్నికల్ ఎడ్యుకేషన్లకు 20 శాతం కేటాయిస్తున్నారు. 2013-14లో 14వేల మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి చూపాలనేది లక్ష్యం. డీఆర్డీఏ-ఐకేపీ ద్వారా 2400 మందికి శిక్షణనివ్వగా, వెయ్యి మందికి ఉపాధి కల్పించారు. వీరిలో 50 శాతం మందికి పైగా నెలలోపే ఆయా ఉద్యోగాలు వదిలేసినట్లు అధికార యంతాంగం సర్వేలో స్పష్టం చేస్తోంది. మోప్మా ద్వారా 4వేల మంది యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3,700 మందికి శిక్షణ పూర్తయింది. 2,300 మందికి ఉపాధి చూపగా సగానికి పైగా వెనక్కు వచ్చేశారు. అయితే డీఆర్డీఏ, మెప్మా ద్వారా వీరందరికీ శిక్షణ నిమిత్తం చేసిన ఖర్చు మాత్రం రూ.1.50 కోట్లకు చేరుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 12,400 మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం కాగా, 5094 మందికి శిక్షణనిచ్చి 3900 మందికి ఉపాధి చూపారు. నామమాత్రపు వేతనాలు కావడం.. శిక్షణతో ఉపాధి కల్పించిన రంగానికి పొంతన లేకపోవడంతో 50 శాతం మంది రెండు నెలల్లోపే మానుకున్నారు. శిక్షణకు రూ.2కోట్లు ఖర్చు చేసినా.. 20 శాతం మంది కూడా ఉద్యోగాల్లో లేకపోవడం రాజీవ్ యువ కిరణాలు పథకం ఏ స్థాయిలో విఫలమైందో తెలియజేస్తోంది. అడ్డగోలుగా నిధుల వ్యయమే తప్పిస్తే నిరుద్యోగులకు ఈ పథకం ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. శిక్షణలో నాణ్యత లేకపోవడం.. తగిన ప్లేస్మెంట్ చూపకపోవడంతోనే పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే సెర్ప్ సీఈఓ 30 సంస్థలను శిక్షణ నుంచి తప్పించారు. డీఆర్డీఏ-ఐకేపీకి సంబంధించి నిర్మాణ రంగానికి న్యాక్ ఆధ్వర్యంలో ఆత్మకూరు, కర్నూలు, నంద్యాల, ఆదోనిలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈజీఎంఎం, సాఫ్టెక్లకు ఒక్కో శిక్షణ సంస్థలు పని చేస్తున్నాయి. మెప్మాకు కర్నూలులో 3, ఎమ్మిగనూరులో 3, ఆత్మకూరులో 1, నందికొట్కూరులో 1 చొప్పున శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పరిమితంగానే సంస్థను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. పథకం ఉద్దేశం మంచిదే అయినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. ఉపాధి కల్పనపైనే దృష్టి - విజయ్‌కుమార్, జాబ్స్ మేనేజర్, డీఆర్డీఏ-ఐకేపీ రాజీవ్ యువ కిరణాల కింద ఈ ఏడాది పరిమితంగానే శిక్షణ సంస్థలను ఎంపిక చేశాం. నిర్మాణ రంగ సంస్థ న్యాక్, ఈజీఎంఎం ప్రభుత్వానికి చెందినవే. శిక్షణలో నాణ్యత పెంపొందించడంతో పాటు తగిన ప్లేస్మెంట్లు చూపే విషయమై దృష్టి సారిస్తున్నాం. శిక్షణ సంస్థలు కనీసం 50 శాతం ప్లేస్మెంట్ చూపితేనే నిధులు మంజూరు చేస్తున్నాం. ట్యూషన్ ఫీజు నెలకు రూ.4500 నుంచి రూ.8 వేలు ఉంటుంది. ఇది కూడా హాజరు శాతాన్ని బట్టి నాలుగు విడతలుగా చెల్లిస్తాం.