కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా లక్ష్యం నెరవేరని పరిస్థితి. యువతకు శిక్షణనిచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ కిరణాలు నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతోంది. శిక్షణకు.. ఉపాధి కల్పించిన రంగానికి పొంతన లేక నెల రోజులు తిరక్కుండానే వారు వెనుదిరుగుతున్నారు. మొత్తంగా ఈ పథకం శిక్షణ సంస్థలకు కాసుల కురిపిస్తోంది.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాజీవ్ యువ కిరణాల అమలులో డీఆర్‌డీఏ-ఐకేపీ, మెప్మా పాత్ర కీలకం. జిల్లా లక్ష్యంలో డీఆర్‌డీఏ-ఐకేపీకి 80 శాతం.. ఐటీడీఏ, మైనార్టీ వెల్ఫేర్, ఉపాధి కల్పన సంస్థ, టెక్నికల్ ఎడ్యుకేషన్లకు 20 శాతం కేటాయిస్తున్నారు. 2013-14లో 14వేల మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి చూపాలనేది లక్ష్యం. డీఆర్‌డీఏ-ఐకేపీ ద్వారా 2400 మందికి శిక్షణనివ్వగా, వెయ్యి మందికి ఉపాధి కల్పించారు.
వీరిలో 50 శాతం మందికి పైగా నెలలోపే ఆయా ఉద్యోగాలు వదిలేసినట్లు అధికార యంతాంగం సర్వేలో స్పష్టం చేస్తోంది. మోప్మా ద్వారా 4వేల మంది యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3,700 మందికి శిక్షణ పూర్తయింది. 2,300 మందికి ఉపాధి చూపగా సగానికి పైగా వెనక్కు వచ్చేశారు. అయితే డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా వీరందరికీ శిక్షణ నిమిత్తం చేసిన ఖర్చు మాత్రం రూ.1.50 కోట్లకు చేరుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 12,400 మంది నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం కాగా, 5094 మందికి శిక్షణనిచ్చి 3900 మందికి ఉపాధి చూపారు. నామమాత్రపు వేతనాలు కావడం.. శిక్షణతో ఉపాధి కల్పించిన రంగానికి పొంతన లేకపోవడంతో 50 శాతం మంది రెండు నెలల్లోపే మానుకున్నారు.
శిక్షణకు రూ.2కోట్లు ఖర్చు చేసినా.. 20 శాతం మంది కూడా ఉద్యోగాల్లో లేకపోవడం రాజీవ్ యువ కిరణాలు పథకం ఏ స్థాయిలో విఫలమైందో తెలియజేస్తోంది. అడ్డగోలుగా నిధుల వ్యయమే తప్పిస్తే నిరుద్యోగులకు ఈ పథకం ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. శిక్షణలో నాణ్యత లేకపోవడం.. తగిన ప్లేస్‌మెంట్ చూపకపోవడంతోనే పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే సెర్ప్ సీఈఓ 30 సంస్థలను శిక్షణ నుంచి తప్పించారు. డీఆర్‌డీఏ-ఐకేపీకి సంబంధించి నిర్మాణ రంగానికి న్యాక్ ఆధ్వర్యంలో ఆత్మకూరు, కర్నూలు, నంద్యాల, ఆదోనిలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈజీఎంఎం, సాఫ్‌టెక్‌లకు ఒక్కో శిక్షణ సంస్థలు పని చేస్తున్నాయి. మెప్మాకు కర్నూలులో 3, ఎమ్మిగనూరులో 3, ఆత్మకూరులో 1, నందికొట్కూరులో 1 చొప్పున శిక్షణ సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పరిమితంగానే సంస్థను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. పథకం ఉద్దేశం మంచిదే అయినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది.
ఉపాధి కల్పనపైనే దృష్టి - విజయ్‌కుమార్, జాబ్స్ మేనేజర్, డీఆర్‌డీఏ-ఐకేపీ
రాజీవ్ యువ కిరణాల కింద ఈ ఏడాది పరిమితంగానే శిక్షణ సంస్థలను ఎంపిక చేశాం. నిర్మాణ రంగ సంస్థ న్యాక్, ఈజీఎంఎం ప్రభుత్వానికి చెందినవే. శిక్షణలో నాణ్యత పెంపొందించడంతో పాటు తగిన ప్లేస్‌మెంట్లు చూపే విషయమై దృష్టి సారిస్తున్నాం. శిక్షణ సంస్థలు కనీసం 50 శాతం ప్లేస్‌మెంట్ చూపితేనే నిధులు మంజూరు చేస్తున్నాం. ట్యూషన్ ఫీజు నెలకు రూ.4500 నుంచి రూ.8 వేలు ఉంటుంది. ఇది కూడా హాజరు శాతాన్ని బట్టి నాలుగు విడతలుగా చెల్లిస్తాం.
మసకబారిన కిరణం
Published Wed, Feb 12 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement