తడిసిమోపెడు
భూ పంపిణీ ఖర్చు ప్రభుత్వానికి తడిసిమోపెడవుతోంది. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సర్కారు.. అమలుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పంద్రాగస్టున శ్రీకారం చుట్టిన ఈ పథకంలో భాగంగా జిల్లాలోని 122 మందికి 307.57 ఎకరాలు పంచారు. ప్రభుత్వభూమి లభించక ప్రైవేటు భూములు సేకరిస్తుండగా ఖర్చు అంచనాలు మించిపోతోంది. ఈ ఒక్కసారికే రూ.8.43 కోట్లు భారం కాగా... నిరంతరం అమలు చేయడం గగనమే కానుంది.
- భూ‘భారం’
- అంచనాలు తారుమారు
- ఎనిమిది మండలాల్లోనే ప్రభుత్వ భూములు
- పూర్తిస్థాయి పంపిణీకి రూ.500 కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : డీఆర్డీఏ సర్వే ప్రకారం జిల్లాలో 1,48,982 దళిత కుటుంబాలున్నాయి. ఇందులో భూమిలేని కుటుంబాలు 51,445. ఎకరం, ఆపై ఉన్న కుటుంబాలు 97,537 ఉన్నాయి. ప్రతి కుటుంబానికి మూడెకరాల చొప్పున అందించాలంటే మొత్తం రెండు లక్షల ఎకరాల భూమి అవసరమవుతుంది. జిల్లాలో అంతమొత్తం ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ముందుగా సరేనన్న ప్రభుత్వం.. పునరాలోచనలో పడి ఆ లెక్కలన్నీ తప్పుల తడకేనని, ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో ప్రైవేటు భూముల ధర ఎంత ఉంది? అర్హుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? స్థానికంగా మార్కెట్ విలువ ఎంత? అనే అంశాలపై ఆరా తీసింది.
ముందుగా విధించిన కొన్ని నిబంధనలను సడలించి.. ఐదేళ్లుగా సాగులో ఉన్న భూములు కొనుగోలు చేయడంతోపాటు తక్కువ లబ్ధిదారులున్న గ్రామాలను గుర్తించాలని ఆదేశించింది. ముందుగా మండలానికో గ్రామం అనుకున్నా.. తర్వాత నియోజకవర్గానికో గ్రామానికే పరిమితం చేసింది. ఏడాదికి రూ.60 వేల లోపు ఆదాయమున్నవారినే ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్లినా..జిల్లాలో ఇప్పుడున్న అర్హులకు భూమి పంచాలంటే రూ.500 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. ఒక్క జిల్లాకే రూ.500 కోట్లు వెచ్చిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు భూమి కొనుగోలు చేసి ఇవ్వాలంటే వేలాదికోట్ల రూపాయలు అవసరం కానున్నాయి.
సర్కారు భూములు కరువు
మండలానికో గ్రామాన్ని గుర్తించి.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అధికారులు కరీంనగర్ మండలం మినహా 56 మండలాల్లో 56 గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లో భూపంపిణీకి 1202 ఎస్సీ కుటుంబాలను అర్హులుగా పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది మండలాల్లోనే ప్రభుత్వ భూములున్నాయని, 49 గ్రామాల్లో 3,288 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులు విక్రయించేందుకు ముందుకొస్తున్నారని, వీటి కొనుగోలుకు మార్కెట్ ధర ప్రకారం రూ.397.47 కోట్లు అవసరమని నివేదిక సిద్ధం చేశారు.
అయితే మెట్ట భూమికే ప్రైవేటు వ్యక్తులు ఎకరాకు రూ.7లక్షలకు పైగా ధర చెబుతున్నారు. ఇక బావులు, బోర్లు ఉన్నవారు భూములకు అధిక రేటు చెబుతున్నారు. ఎట్టకేలకు తొలివిడత భూ పంపిణీ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నా.. ప్రభుత్వానికి మాత్రం కునుకు లేకుండా చేస్తోంది. నిరంతరం భూపంపిణీ చేయాలంటే భారాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతోంది.