drinking water corporation
-
ముంబై నీళ్లు అమోఘం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు. -
‘ఆ టెండర్లు అన్నీ రద్దు చేస్తాం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్‌తో నిధులు తెచ్చి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని పంచాయతీ రాజ్, గ్రామిణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో తాగు నీరు కోసం కార్పొరేషన్ పెట్టి రూ.17,730 కోట్లకు టెండర్లు పిలిచారన్నారు. ఎన్నికల ముందు ఆగమేఘాల మీద ఏడు కన్సెల్టెన్సీలకు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా కమీషన్ల కోసమే చేశారన్నారు. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి తిరిగి కొత్తగా డీపీఆర్‌లను సిద్ధం చేసి ముందకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా డీపీఆర్‌లను తయారు చేసి అన్ని గ్రామాలకు దశల వారిగా నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. -
తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం అభినందన
ప్రాజెక్టును అధ్యయనం చేయాలని అన్ని రాష్ట్రాలకు నోట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ నమూనాను కేంద్ర ప్రభుత్వం అభినందించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా మంచినీరందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం నోట్ పంపింది. నోట్లో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. బడ్జెట్లో కూడా రూ. 2వేల కోట్లు కేటాయించింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సాయం కూడా పొందుతోంది. ఈ ప్రయత్నాలు అభినందనీయం. ఈ వాటర్‌గ్రిడ్ నమూనా ఆచరణాత్మకంగా ఉన్నందున, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేసే అంశాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలి’ అని పేర్కొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ మంచినీటి వార్షిక ప్రణాళిక సమావేశంలో వాటర్‌గ్రిడ్ పథకంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ఈ నోట్‌ను రూపొందించి అన్ని రాష్ట్రాలకూ పంపింది. గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఎంతో శ్రమించి ఈ ప్రాజెక్టును రూపొందించారని, ఈ నమూనా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.