దాహార్తి తీర్చిన అపర భగీరథుడు !
సాక్షి, దాచేపల్లి: అది పల్నాడు ప్రాంతం. అందునా దాచేపల్లి మండలం. సిమెంటు, సున్నం కంపెనీలు, క్వారీలకు ప్రసిద్ధి చెందిన ఏరియాగా గుర్తింపు ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఒకప్పుడు గుక్కెడు నీరు దొరక్క దాహార్తితో అలమటించే వారు. బిందెడు నీటి కోసం నానా పాట్లు పడేవారు. నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చి ప్రజలు కకావికలం అవుతున్న తరుణంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథుడిగా నిలిచి ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చారు. దాహంతో అలమటిస్తున్న ప్రజల గొంతులు తడిపారు. శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్య లేకుండా చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఫ్లోరైడ్ నీరు తాగుతూ రోగాల బారిన పడుతున్న ప్రజలకు సురక్షితమైన కృష్ణమ్మ నీటిని అందించి ఎంతో మేలు చేశారు.
పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ....
అపర భగీరథుడిగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇంటింటికి కృష్ణమ్మను పరవళ్లు తొక్కించారు. చెంతనే కృష్ణమ్మ ఉన్న గుక్కెడు నీరు అందని పరిస్థితిలో ప్రజల దాహార్తిని తీర్చి ప్రజల పాలిట ఆపద్బాంధవుడిగా వెలుగొందారు. మహానేత స్వర్ణయుగంలో గురజాల నియోజకవర్గంలోని శ్రీనగర్, గామాలపాడు, పొందుగల, రామాపురం, శ్రీనివాసరావు, ఆంధ్రా సిమెంట్స్ పరిశ్రమ కాలనీ, దాచేపల్లి, నడికుడి, ఇరికేపల్లి, తంగెడ గ్రామాల ప్రజలు మహానేత పుణ్యమని కృష్ణానది నీటిని తాగుతున్నారు. సుమారుగా రూ.10 కోట్ల వ్యయంతో శ్రీనగర్, పొందుగల, దాచేపల్లి, ఇరికేపల్లి, తంగెడ గ్రామాల్లో సురక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌లను నిర్మించి ప్రజలకు పుష్కలంగా కృష్ణానది నీటిని అందిస్తున్నారు. అంతకు ముందు కలుషితమైన నీటిని తాగి రోగాలబారిన పడే ప్రజలు వైఎస్సార్ చొరవతో స్వచ్ఛమైన కృష్ణానది నీటిని తాగుతున్నారు.
మనస్సున్న మారాజు వైఎస్సార్ ...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజేశేఖర్‌రెడ్డిని గురజాల నియోజకవర్గ ప్రజలు మనస్సున్న మారాజుగా ఆరాధిస్తుంటారు. వైఎస్సార్ సీఎం అయిన తరువాత అప్పటి గురజాల శాసనసభ్యుడు జంగా కృష్ణమూర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌లు నిర్మించి వాటి ద్వారా సురక్షిత కృష్ణానది నీటిని ఇంటింటికి తరలించాలని కోరారు. దీంతో శ్రీనగర్, దాచేపల్లి, తంగెడ గ్రామాల్లో సురక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్మించేందుకు వైఎస్సార్ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పనులు వేగవంతం పూర్తి చేశారు. దీంతో 2006 ఏప్రిల్ 16వ తేదిన శ్రీనగర్ గ్రామంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ జంగాతో కలిసి శ్రీనగర్‌లో నిర్మించిన సురక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో శ్రీనగర్, గామాలపాడు, నడికుడి, ఇరికేపల్లి, దాచేపల్లి, పొందుగల గ్రామాల ప్రజలు కృష్ణానది నీటిని తాగుతున్నారు. తంగెడలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ను అప్పటి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు.
రైతుల కోరిక మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు...
శ్రీనగర్‌లో జరిగిన ప్రజాపథంలో పాల్గొన్న రైతులు దండివాగు ఎత్తిపోతల పథకంకు కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవటం వల్ల పంటలకు సాగునీరు అందటంలేదని, కరెంట్ సక్రమంగా ఇస్తే రెండు పంటలు పండుతాయని సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన వైఎస్సార్ మరొక ఆలోచన లేకుండా అక్కడికక్కడే 33/11 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి దండివాగు ఎత్తిపోతల పథకంకు 18 గంటల కరెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రూ.1.50 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి చేసి జంగా చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో దండివాగుకు 18 గంటల నాణ్యమైన కరెంట్తోపాటుగా శ్రీనగర్‌కు 24 గంటల కరెంట్‌ను ఇస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణంతో రెండు వేలకుపైగా ఎకరాల్లో రైతులు రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు. కృష్ణానది నీరు ఇంటింటికి వస్తుండటం వల్ల ఫ్లోరిన్ ప్రభావం నుంచి ప్రజలు తప్పించుకున్నారు. వైఎస్సార్ చేసిన ఈ మంచి పనులను ప్రజలు ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎం అయితే మళ్లీ అటువంటి పథకాలు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.