జలమేది.. జీవమేది !
- చెరువులకు చేరని తాగునీరు
- మూడు రోజుల కిందటే విడుదల చేశామంటున్న అధికారులు
- రెండు దశాబ్దాల తరువాత అడుగంటిన మల్లేశ్వరం మంచినీటి చెరువు
- తీరంలో తాగునీటి పాట్లు తప్పవా..?
మచిలీపట్నం : అధికారుల నిర్లక్ష్యం, ముందుచూపు లోపించడం వెరసి తీరప్రాంత ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేదు. తాగునీటి అవసరాల నిమిత్తం మూడు రోజుల కిందట కాలువలకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నా అవి ఇంకా శివారు ప్రాంతాలకు చేరనేలేదు. చెరువులు నింపే పనిని పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేయాల్సి ఉన్నా ఎవరికి వారు తమది కానట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. పంచాయతీలే తాగునీటి చెరువులను నింపుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. విడతలవారీగా ఆయా కాలువలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటన చేశారు.
► రైవస్ కాలువ కింద 269 మంచినీటి చెరువులు ఉండగా ఇప్పటివరకు ఆ కాలువకు చుక్కనీరు విడుదల చేయలేదు. ఏలూరు కాలువకు తాగునీటిని విడుదల చేసినా మంగళవారం సాయంత్రానికి పెరికీడు వరకు మాత్రమే చేరింది.
► అవనిగడ్డ నియోజకవర్గానికి తాగునీటి అవసరాల కోసం కేఈబీ కాలువకు నీటిని విడుదల చేసినా పులిగడ్డ అక్విడెక్టును దాటి చుక్కనీరు దిగువకు వెళ్లలేదు.
► బందరు కాలువకు మూడు రోజుల కిందట నీటిని విడుదల చేయగా తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నింపుతున్నారు. ఈ ట్యాంకు పూర్తిస్థాయిలో నిండుతుందనే నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కాలువలకు సక్రమంగా నీటి విడుదల చేయని నేపథ్యంలో చెరువులు నింపటం సాధ్యం కాదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అంటున్నారు.
పూర్తిగా ఎండిన మల్లేశ్వరం మంచినీటి చెరువు
► బంటుమిల్లి మండలంలోని మల్లేశ్వరం రక్షిత మంచినీటి పథకాన్ని 1995లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ చెరువు అడుగంటలేదు. ఈ సారి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఈ చెరువు అడుగంటి నెర్రలిచ్చింది. దీంతో 17 గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. రైవస్ కాలువ ద్వారా వచ్చే నీటిని ఈ చెరువులో నింపాలి. ఈ చెరువును ఎప్పటికి నింపుతారు, ఎన్ని రోజుల పాటు నీటి సరఫరా జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చెరువు ద్వారా చినపాండ్రాక, ఇంతేరు, నాగేశ్వరరావుపేట, కొర్లపాడు, మల్లేశ్వరం, బంటుమిల్లి తదితర గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది.
► కృత్తివెన్ను మండలంలో తాగునీటి చెరువులన్నీ పూర్తిస్థాయిలో ఎండిపోయాయి. సముద్రానికి సమీపంలో ఉన్న పల్లెపాలెం, లక్ష్మీపురం, గరిసిపూడి, కొమాళ్లపూడి, మాట్లం తదితర పంచాయతీల్లోని చెరువులన్నీ ఎండిపోయాయి. ఎప్పటికి కాలువలకు నీరు వస్తుందనేది తెలియని స్థితి. శీతనపల్లి మెగా రక్షిత మంచినీటి పథకం చెరువులోనూ నీరు అడుగంటే స్థితికి చేరింది. 20 రోజులు మాత్రమే ప్రస్తుతం ఈ నీరు వచ్చే అవకాశం ఉంది. గత వేసవిలో ఈ చెరువును నింపకుండానే మమ అనిపించారు.
అక్విడెక్టు దాటని నీరు
తీరప్రాంతంలో ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో తాగునీటి చెరువులు నింపే విషయంపై అధికారులు కినుకు వహిస్తున్నారు. కేఈబీ కాలువ ద్వారా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలకు నీటిని వదలాల్సి ఉంది. చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల పరిధిలో 10 తాగునీటి చెరువులు ఉండగా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో 50కు పైగా తాగునీటి చెరువులు ఉన్నాయి. కేఈబీ కాలువ ద్వారా వచ్చిన నీటిని పులిగడ్డ అక్విడెక్టు వద్ద నిలిపివేశారు. శివారున ఉన్న మండలాలకు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు తాగునీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. నాగాయలంక మండలం కమ్మనమోలు మంచినీటి పథకం ద్వారా ఎనిమిది పంచాయతీలకు తాగునీటిని విడుదల చేయాల్సి ఉంది. కాలువకు నీటిని విడుదల చేస్తే కమ్మనమోలు మంచినీటి చెరువు వరకు నీరు వెళుతుందా, లేదా అనేది అధికారులకే అర్థం కాని పరిస్థితి. గత ఏడాది ఈ చెరువుకు కాలువ నీరు చేరకుండానే గడిచిపోయింది.