drivers championship title
-
వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో 25 ఏళ్ల వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. వర్షం కారణంగా ప్రధాన రేసును నిర్ణీత 53 ల్యాప్‌లకు బదులుగా 28 ల్యాప్‌లకు కుదించారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ దూసుకుపోగా రెండు ల్యాప్‌ల తర్వాత వర్షం రావడంతో రేసు నిలిచిపోయింది. వర్షం తగ్గాక రెండు గంటల్లోపు రేసును ముగించాలనే నిబంధన కారణంగా రేసును 28 ల్యాప్‌లకు తగ్గించారు. వెర్స్టాపెన్ 3 గంటల 1ని:44.044 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ సీజన్లో 12వ విజయాన్ని అందుకున్నాడు. సెర్గియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. 22 రేసుల ఈ సీజన్లో 18 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ 366 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. పెరెజ్ 253 పాయింట్లతో రెండో స్థానంలో, లెక్లెర్క్ 252 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మరో నాలుగు రేసులు జరగాల్సి ఉన్నా... తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌కు రెండో స్థానంలో ఉన్న పెరెజ్ మధ్య 113 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఒకవేళ పెరెజ్ నాలుగు రేసుల్లోనూ గెలిచినా వెర్స్టాపెన్ను అధిగమించే అవకాశం లేకపోవడంతో ఈ రెడ్‌బుల్ డ్రైవర్‌కు ప్రపంచ టైటిల్ ఖరారైంది. సీజన్‌లోని తదుపరి రేసు యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి టెక్సాస్‌లో ఈనెల 23న జరుగుతుంది. -
విజయంతో ముగించాడు
అబుదాబి: పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించి... అదే జోరును చివరి ల్యాప్ వరకు కొనసాగించి... మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 2019 ఫార్ములావన్ సీజన్‌ను విజయంతో ముగించాడు. ఆదివారం జరిగిన సీజన్లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో 34 ఏళ్ల హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 55 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో... లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కెరీర్లో 88వ సారి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్ ఈ సీజన్లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీజన్లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్–326 పాయింట్లు) రెండో స్థానంలో ... వెర్స్టాపెన్ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. ►3 ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్ సాధించాయి. ►5 ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్ సాధించగలిగారు. హామిల్టన్ 11 టైటిల్స్ నెగ్గాడు. బొటాస్ 4 టైటిల్స్, వెర్స్టాపెన్ 3 టైటిల్స్, లెక్లెర్క్ 2 టైటిల్స్, వెటెల్ ఒక టైటిల్ గెలిచారు. -
వెటెల్‌కు మళ్లీ ‘పోల్’
సావోపాలో: డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లోని చివరిదైన 19వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిని ఈ జర్మనీ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 26.479 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది తొమ్మిదో ‘పోల్’ కాగా... కెరీర్లో 45వది కావడం విశేషం. ఈ సీజన్లో 12 టైటిల్స్ నమోదు చేసిన వెటెల్ ఆదివారం కూడా గెలిస్తే తన ఖాతాలో వరుసగా పదో టైటిల్‌ను జమ చేసుకొని ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.