సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో 25 ఏళ్ల వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. వర్షం కారణంగా ప్రధాన రేసును నిర్ణీత 53 ల్యాప్‌లకు బదులుగా 28 ల్యాప్‌లకు కుదించారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్ దూసుకుపోగా రెండు ల్యాప్‌ల తర్వాత వర్షం రావడంతో రేసు నిలిచిపోయింది. వర్షం తగ్గాక రెండు గంటల్లోపు రేసును ముగించాలనే నిబంధన కారణంగా రేసును 28 ల్యాప్‌లకు తగ్గించారు.
వెర్‌స్టాపెన్ 3 గంటల 1ని:44.044 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ సీజన్‌లో 12వ విజయాన్ని అందుకున్నాడు. సెర్గియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, లెక్‌లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. 22 రేసుల ఈ సీజన్‌లో 18 రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్ 366 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. పెరెజ్ 253 పాయింట్లతో రెండో స్థానంలో, లెక్‌లెర్క్ 252 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మరో నాలుగు రేసులు జరగాల్సి ఉన్నా... తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌కు రెండో స్థానంలో ఉన్న పెరెజ్ మధ్య 113 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఒకవేళ పెరెజ్ నాలుగు రేసుల్లోనూ గెలిచినా వెర్‌స్టాపెన్‌ను అధిగమించే అవకాశం లేకపోవడంతో ఈ రెడ్‌బుల్ డ్రైవర్‌కు ప్రపంచ టైటిల్ ఖరారైంది. సీజన్‌లోని తదుపరి రేసు యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి టెక్సాస్‌లో ఈనెల 23న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment