'మజ్లిస్ కనుసన్నల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
మజ్లిస్ పార్టీ కనుసన్నలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మెదక్ రైతులపై జరిగిన లాఠీఛార్జ్ అత్యంత పాశవికమని, విద్యుత్ కోసం ఇంతవరకూ ఛత్తీస్‌గఢ్ సీఎంతో సీఎం కేసీఆర్ మాట్లాడలేదని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్! నీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తుందని బీజేఎల్పీ నేత డా.లక్ష్మణ్ అన్నారు. విద్యార్థుల ఉద్యోగ కల్పనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగడం శోచనీయమని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ అన్నారు.
బీజేపీలో కుటుంబం కాదు, దేశ సౌభాగ్యం, రాష్ట్ర అభివృద్ది ముఖ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కుటుంబపాలన కొనసాగించేవారికి
బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని మురళీధర్‌రావు అన్నారు.